ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్.షర్మిల అసలెందుకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు?తెలంగాణాలో రాజకీయాలు చేస్తానని పదే పదే చెప్పిన షర్మిల తెలంగాణా వదిలి ఏపీలో ఎందుకు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? వరుసగా రెండు ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలవ లేకపోయిన కాంగ్రెస్ కు నోటాకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు. మరి అటువంటి పార్టీలోకి షర్మిల ఎందుకు చేరినట్లు? ఏం సాధించాలని అనుకుంటున్నారు? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తచ్చాడుతున్నాయి.
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే వై.ఎస్.ఆర్.తెలంగాణా పార్టీ పెట్టారు షర్మిల. తెలంగాణాలో అధికారంలోకి రావడమే అజెండా అన్నారు. తాను పుట్టిన నేల రుణం తీర్చుకోడానికే తెలంగాణాలో రాజకీయాలు చేయాలనుకుంటోన్నట్లు వెల్లడించారు. అయితే ఎన్నికలకు కొద్ది వారాల ముందు అనూహ్యంగా తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. తన పార్టీ ఎన్నికల్లో పాల్గొంటే కాంగ్రెస్ ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి కాబట్టే..బి.ఆర్.ఎస్. ను ఓడించడం కోసం కాంగ్రెస్ ఓట్లు చీలకూడదని తాను ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు షర్మిల. తెలంగాణా ఎన్నికల అనంతరం తెలంగాణా కోటాలో రాజ్యసభకు వెళ్తారేమో అన్న ప్రచారం కూడా అప్పుడే జరిగింది.
తెలంగాణా ఎన్నికలు ముగిసిన వెంటనే ఒక్క సారిగా ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టిడిపి-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనిచ్చేదే లేదన్న పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తును ప్రకటించారు. ఇదే తరుణంలో షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ప్రకటించింది పార్టీ హైకమాండ్.
అప్పటిదాకా తెలంగాణాలో రాజకీయాలు చేస్తానన్న షర్మిల ఇపుడు ఏపీలోనే ఉండిపోతానంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు తాను ఏపీని వీడే ప్రసక్తే లేదంటున్నారు షర్మిల. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రత్యేక హోదా సాధిస్తానని కూడా అంటున్నారు.
అసలింతకీ ఏపీ కాంగ్రెస్ లో ఆమె ఎందుకు చేరారన్నది ప్రశ్న. ఏపీలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఒక్క అభ్యర్ధికి కూడా డిపాజిట్ దక్కలేదు. మెజారిటీ అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల కన్నా నోటాకే ఎక్కువ వచ్చాయి. మరి అంతగా భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ లో చేరడం ద్వారా రాజకీయంగా షర్మిల ఏం సాధించాలనుకున్నారని రాజకీయ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. అయితే తన సోదరుడి ఓటు బ్యాంకును చీల్చడమే అజెండాగా షర్మిల పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మొదట్నుంచీ కూడా ఎస్సీ ఎస్టీలతో పాటు మైనారిటీలు అండగా ఉన్నారు. 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ ఈ వర్గాలు పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి పార్టీ వెన్నంటే ఉన్నారు.2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ పేరిట టిడిపి ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తోన్న బీసీలపై కన్నేశారు. ఆ వర్గాలకు రక రకాల పదవులు కట్టబెట్టడం ద్వారా 2024 ఎన్నికల్లో మెజారిటీ బీసీలను తమ పార్టీవైపు తిప్పుకోవాలన్నది జగన్ వ్యూహం. అయితే బీసీలు మొదట్నుంచీ టిడిపికి వెన్నుదన్నుగా ఉంటున్నారు. వారు ఒకేసారి టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీ వైపు వెళ్తారని అనుకోలేం.
జగన్ మోహన్ రెడ్డి పార్టీని దెబ్బతీస్తేనే ఏపీలో కాంగ్రెస్ కు మనుగడ ఉంటుంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి పార్టీని బలహీన పర్చాలని కాంగ్రెస్ భావిస్తోంది. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్నట్లు వై.ఎస్. జగన్ ను ఆయన సోదరితోనే ఢీకొనాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా ఏపీలోని క్రైస్తవ సంఘాలను ప్రభావితం చేయడం ద్వారా క్రైస్తవ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలన్నది వారి ప్లాన్. దాన్ని అమలు చేయడానికే షర్మిలకు పార్టీ చీఫ్ పదవి కట్టబెట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ అప్పగించిన టాస్క్ ను ఫుల్ ఫిల్ చేస్తే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏదో ఒక రాష్ట్రం కోటాలో రాజ్యసభకు వెళ్లాలని షర్మిల భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యూహంలో ఆమె ఎంత వరకు సక్సెస్ అవుతారు? ఏ మేరకు వైసీపీ ఓట్లు చీలుస్తారు? అన్నది మే నెలలో తేలిపోతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…