ట్విట్టర్‌లో ఒకరిపై ఒకరు సెటైర్లు
రంజుగా మారిన తెలంగాణ రాజకీయం
కల్వకుంట్ల కవిత వర్సెస్ వైఎస్ షర్మిల…! ఎవరూ ఊహించని విధంగా ఈ ఇద్దరి మధ్య సరికొత్త జగడం మొదలైంది. ఇద్దరి పార్టీలు వేరు, భావాలు వేరు. రాజకీయంగా ఎవరి దారి వారిదే. అయితే ఉన్నట్లుండి కవిత, షర్మిల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఈ వార్‌కు రెండు రోజుల ముందు బీజం పడింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి షర్మిల ఘాటైన విమర్శలు చేయడం దానికి ఎమ్మెల్యే అనుచరులు షర్మిల కాన్వాయ్ మీద దాడి చేయడం పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించడం చకచకా జరిగిపోయాయి.
ఆ మరుసటి రోజు షర్మిల ప్రగతి భవన్‌కు బయలుదేరడంతో పోలీసులు అడ్డుకుని క్రేన్ సహయంతో ఆమెను కారుతో సహా పోలీస్టేషన్‌కు తరలించారు. మొత్తానికి షర్మిల ఉదంతం తెలంగాణలో వేడి పుట్టించింది. షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఒక మహిళ పట్ల కెసిఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైనదని పేర్కొన్నారు. అటు తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా షర్మిలను అరెస్టు చేసిన తీరును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత షర్మిలను, బీజేపీని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. షర్మిల తానా అంటే బీజేపీ నేతలు తందానా అంటున్నారని ఎద్దేవా చేశారు. తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామరపువ్వులు అంటూ ట్వీట్ చేశారు.
షర్మిల వెనుక బీజేపీ నేతలు ఉన్నారని బీజేపీనే వైయస్ షర్మిలను నడిపిస్తుంది అన్నట్టుగా కవిత ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కవిత ట్వీట్‌కు షర్మిల కూడా అంతే వెటకారంగా రిప్లై ఇచ్చారు. ‘పాదయాత్రలు చేసింది లేదు ప్రజల సమస్యలు చూసింది లేదు ఇచ్చిన హామీల అమలు లేదు పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. షర్మిల ట్వీట్‌కు కవిత ఒక కవిత రూపంలో సమాధానమిచ్చారు. ‘అమ్మా…కమల బాణం..ఇది మా తెలంగాణం…పాలేవో నీళ్లేవో తెలిసిన చైతన్య ప్రజాగణం… మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు నేడు తెలంగాణ రూటు…మీరు కమలం కోవర్టు…ఆరేంజ్ ప్యారెట్టు….మీలాగా పొలిటికల్ టూరిస్టు కాను నేను…రాజ్యం వచ్చాకే రాలేదు నేను…ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై షర్మిల ఇంకా స్పందించలేదు. ఈ ట్విట్టర్ వార్ ఎంతదూరం వెళ్తుందో అని ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు.