గేరు మార్చిన కేసీఆర్.. షర్మిల చుట్టూ కొత్త రాజకీయం

By KTV Telugu On 30 November, 2022
image

తెలంగాణలో రాజకీయం రంగులు మారుతోంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య యుద్ధం కాస్తా ఇప్పుడు టర్న్ తీసుకొని వైఎస్సార్టీపీ వైపు మళ్లింది. కేసీఆర్ టార్గెట్‌గా గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న షర్మిలపై ఒక్కసారిగా టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడంతో రాష్ట్రంలో యుద్ధం వాతావరణం నెలకొంది.  నిరసనగా షర్మిల కేసీఆర్ ఇంటి ముట్టడికి  వెళ్లడం, పోలీసులు అడ్డుకొని ఆమెతో సహా కారును లాక్కెళ్లి అరెస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, కేసులతో బెదిరిస్తోందని విపక్షాలన్నీ గులాబీదళంపై దండెత్తాయి.  అదే సమయంలో టీఆర్ఎస్ కూడా  బీజేపీ, వైఎస్సార్టీపీ టార్గెట్‌గా ఎదురుదాడి చేస్తోంది. షర్మిల వెనుక బీజేపీ ఉందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్.. ఆపార్టీ నేతలు చెప్పినట్టు షర్మిల ఆడుతున్నారని విమర్శిస్తున్నారు.

బీజేపీ, షర్మిల పార్టీ లక్ష్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైరికల్ ట్వీట్ చేశారు. తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”’ అంటూ కవిత ట్వీట్ చేశారు. వైఎస్సాఆర్‌టీపీ, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని షర్మిల వెనుక బీజేపీ నేతలు ఉన్నారనేలా పిట్టగూటిలో రాసుకొచ్చారు కవిత. అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ, వైఎస్సాఆర్‌టీపీలు దూకుడు పెంచుతున్నాయి.  కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారంటూ ఎవరికి వారు ప్రజల్లోకి వెళ్లి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో టీఆర్ఎస్ సర్కార్‌పై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు షర్మిల. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల పలుమార్లు  ఢిల్లీ వెళ్లిన ఆమె ప్రభుత్వ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఎప్పుడూ పింక్ పార్టీ అంతగా రియాక్ట్ కాలేదు. కానీ ఆమె పాదయాత్ర  నర్సంపేట్ చేరుకున్న సమయంలో ఎమ్మెల్యే పెద్ది అనుచరులు ప్రతాపం చూపించారు.  షర్మిల వాహనంపై దాడి, ఫ్లెక్సీలు, వైఎస్సార్ విగ్రహానికి నిప్పుపెట్టిన ఘటనతో ఒక్కసారిగా రాజకీయాలు భగ్గుమన్నాయి.  ఈ సమయంలో షర్మిలకు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఇక నిన్న ప్రగతిభవన్ వద్ద చోటుచేసుకున్న పరిణామాలతో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. మరోవైపు, బైంసాలో బండి సంజయ్ పాదయాత్రపైనా తొలుత హై టెన్షన్ నెలకొంది. పోలీసులు పర్మీషన్ ఇవ్వకపోవడంతో హైడ్రామా నడిచింది. హైకోర్టు అనుమతితో ఐదో విడత పాదయాత్ర మెుదలు పెట్టిన బండి సంజయ్ స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అదేసమయంలో షర్మిలపై టీఆర్ఎస్ దాడి ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆడబిడ్డ మీద దాడికి పాల్పడుతున్నారు. పోలీసుల ముందే టీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. అసలు రాష్ట్రాన్ని కేసీఆర్ ఎటువైపు తీసుకెళ్తున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అటు గవర్నర్ కూడా షర్మిలను అరెస్ట్ చేసిన తీరును తీవ్రంగా ఖండించారు.  కారు లోపల ఉన్న షర్మిలను క్రేన్ సాయంతో లాక్కెళ్లిన దృశ్యాలు తనను కలిచివేశాయని అన్నారు. ఈ సమయంలో అటు తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన షర్మిల మరోసారి కేసీఆర్‌ను తాలిబాన్‌తో పోల్చుతూ రెచ్చిపోయారు. ఓ వైపు టీఆర్ఎస్ మరోవైపు బీజేపీ, వైఎస్సార్టీపీల దూకుడైన రాజకీయాలతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొంది.