గులాబీ కంచుకోట..సిద్ధిపేట

By KTV Telugu On 11 October, 2023
image

KTV TELUGU :-

సిద్ధిపేట నుంచి గడచిన ఆరు ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసిన మంత్రి హరీష్‌రావు ఏడోసారి గెలుపు తనదే అంటున్నారు. హరీష్‌రావు చొరవతో సిద్ధిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికే రోల్ మాడల్ గా  నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు వరసగా 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర సిద్ధిపేట నియోజకవర్గానికి ఉంది. ఒకవైపు హరీష్‌రావు విజయాన్ని ఖరారు చేసుకున్నారు. విపక్షాలు మాత్రం ఇంకా పోటీ చేసే పేర్లు ప్రకటించకపోవడంతో వారిలో అయోమయం కొనసాగుతోంది. రోల్‌మోడల్ సిద్దిపేటలో హరీష్‌రావు చేసిన అభివృద్ధి ఏంటో చూద్దాం.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఓ నియోజకవర్గంగా..ప్రస్తుతం జిల్లా కేంద్రంగా మారిన సిద్ధిపేటలో ఏడో సారి గెలుపు గుర్రం ఎక్కడానికి తన్నీరు హరీష్‌రావు రెడీ అవుతున్నారు. 2018 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 1,18,699 ఓట్ల మెజారిటీతో హరీష్‌రావు విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో లక్షా 30 వేల మెజారిటీ సాధిస్తానని హరీష్‌ చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన వెంటనే సిద్ధిపేటలో గులాబీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆ వెంటనే మంత్రి హరీష్ రావు తన నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం పూరించారు.

కొన్ని కుల సంఘాలు స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతున్నాయి. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను, మెడికల్ కాలేజీ,  బి ఫార్మా సి కాలేజ్ , రైల్వే లైన్ నిర్మాణం, కోమటి చెరువు, డైనోసార్ పార్క్, గ్లో  గార్డెన్స్ , రంగనాయక సాగర్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ హరీష్‌రావు ఓటర్లను ఆకర్షిస్తున్నారు.సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్, మోడల్ రైతు బజార్, స్వచ్ఛ బడి, ఔటర్ రింగ్ రోడ్డు, వాటర్ రింగ్ మెయిన్ లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, గొర్రెల హాస్టల్స్, పశువుల హాస్టల్స్, రైతు వేదికలు హరీష్‌రావుకు మంచి పేరు తెచ్చి పెట్టాయి

చంద్రపూర్ గ్రామం ఉత్తమ పర్యాటక కేంద్రంగా జాతీయ అవార్డు పొందింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, పోలీస్ కమీషనరేట్ ఏర్పాటు చేయడమే గాకుండా..ఐటి టవర్ నిర్మాణం, మందపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీటినే మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచార  అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. మరోవైపు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ పనిచేసే ప్రభుత్వాన్ని, తనని మరోసారి దీవించాలని హరీష్ రావు కోరుతున్నారు. నా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, ఆపదలో మీకు అండగా నిలుస్తానని హరీష్ రావు ప్రజల్లో సెంటిమెంట్ ను రగిలించి తనవైపునకు ఆకర్షిస్తున్నారు.

సిద్ధిపేట ఎన్నికల ప్రచారంలో హరీష్‌రావు దూసుకుపోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల్లో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన భవానీరెడ్డి,  గతంలో కాంగ్రెస్ తరఫున రెండుసార్లు పోటీ చేసిన తాడూరు శ్రీనివాస్ గౌడ్ సిద్ధిపేట టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో ముగ్గురు కూడా సిద్ధిపేట టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నా భవానీరెడ్డి లేదా శ్రీనివాసగౌడ్‌ల్లో ఎవరో ఒకరికి టిక్కెట్ రావచ్చే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ పాలిటిక్స్‌ స్థానిక నేతలు, కేడర్‌లో అయోమయానికి కారణమవుతున్నాయి.

భవానీరెడ్డి స్థానికంగా ఉండకపోవడం, ఆమెకు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం వంటివి..ఆమెకు టిక్కెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో ఓటు బ్యాంకు బాగానే ఉంది. అందువల్ల ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయనే టాక్ నడుస్తోంది. సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన భూ సేకరణ బాధితులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, దళిత బంధు, బీసీ బంధు కొందరికే అందడం వంటి అంశాలు కొంత వరకు మెజార్టీపై ప్రభావం చూపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి