ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సమయంలో భారతీయ రాష్ట్ర సమితి నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. . కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మహాధర్నాలు చేస్తున్నారు. సింగరేణిని కూడా ప్రైవేటీకరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అందుకే హైదరాబాద్‌తో పాటు మంచిర్యాల భూపాలపల్లి కొత్తగూడెం రామగుండం కేంద్రాల్లో మహాధర్నాలు నిర్వహించేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే సింగరేణి ప్రైవేటీకరణ అనేది నిజమా కేంద్రం నిజంగానే ప్రైవేటీకరణ చేస్తోందా బీఆర్ఎస్ ఈ ప్రచారాన్ని ఇంత ఉద్ధృతంగా ఎలా చేయగలుగుతుంది.
సింగరేణి అతిపెద్ధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటి. ఇది ఏ ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనా రాష్ట్ర ప్రభుత్వ సంస్థనా అంటే కార్పొరేట్ రూల్స్ ప్రకారం ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పాల్సిందే. సింగరేణి సంస్థలో రాష్ట్ర వాటా 51శాతం కాగా కేంద్రం వాటా 49 శాతం. రాష్ట్ర ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యం . ఈ విషయం వరకూ చాలా స్పష్టత ఉంది బీజేపీ ముందు నుంచి ఇదే వాదన వినిపిస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి వచ్చినప్పుడు ప్రధాని మోదీ కూడా ఇదే చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లైవేటీకరణపై కేంద్రం చాలా స్పష్టంగా ఉంది. తాము చెప్పినట్లుగా ప్రైవేటీకరణ చేస్తామని అంటోంది. కానీ తెలంగాణ సింగరేణి దగ్గరకు వచ్చే సరికి మాత్రం ప్రైవేటు పరం అనే ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేస్తోంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం పదే పదే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఆందోళనల కారణంగా ప్రజల్లోనూ ఓ రకమైన అనుమానం ప్రారంభమైంది. అన్నింటినీ అమ్మేస్తున్న కేంద్రం సీక్రెట్ గా సింగరేణిని కూడా అమ్మేస్తుందా అన్న అనుమానాలకు వస్తున్నారు. బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వీటిని పెంచుతోంది.
అసలు ఏ ప్రతిపదికన బీఆర్ఎస్ సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపిస్తోందనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఒక్కటే కారణం అదే బొగ్గు గనుల వేలం. దేశవ్యాప్తంగా బొగ్గు గనులను వేలం పాటల ద్వారా పెట్టుబడిదారులకు కేంద్రం కేటాయిస్తోంది. ప్రస్తుతం ఆరో రౌండ్ వేలంపాట ప్రక్రియ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 133 బొగ్గు బ్లాకులతోపాటు ఐదో విడతలో మిగిలిపోయిన 8 బ్లాకులను కలిపి మొత్తం 141 బ్లాకుల వేలం ప్రక్రియ జరుగుతోంది. వీటిలో సింగరేణి పరిధిలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణి పరిధిలోని పనగడప సత్తుపల్లి బ్లాక్-3 శ్రావణపల్లి కల్యాణిఖని బ్లాక్-6 ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్లాకులు సింగరేణి పొందాలంటే సింగరేణి కూడా ప్రైవేటు సంస్థలతో పోటీపడాలి. లేకపోతే బొగ్గు బ్లాకులు ప్రైవేటుకు వెళ్లిపోతాయి ప్రైవేటు సంస్థలతోపాటు సింగరేణి కూడా పాల్గొనవచ్చని కేంద్రం చెప్తున్నది. ఇందులో పాల్గొనటంపై సింగరేణి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బొగ్గు బ్లాకులను నామినేషన్‌పై కేటాయించాలని కొత్త చట్టంలో కేంద్రానికి ఉన్న విచక్షణ అధికారాలను వినియోగించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతోపాటు సింగరేణి కోరింది. కానీ కేంద్రం అంగీకరించడం లేదు.
కాంగ్రెస్ హయాంలో బొగ్గు గనుల కేటాయింపులో భారీ అవినీతి జరిగిందన్న కారణం కేటాయింపుల్లో కేంద్రం మార్పులు చేసింది. బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు కూడా కేటాయింపులు చేయకుండా ఎవరైనా వేలంలో పాల్గొని దక్కించుకునేలా కొత్త చట్టం చేసింది. ఇది 2015లోలనే చేసింది. బొగ్గు గనుల వేలం విషయంలో కేంద్రం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2015ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అప్పుడు కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు ఉన్న బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ ఈ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటు వేసింది. బీఆర్‌ఎస్ ఎంపీలు 14 మంది నాడు ఎంపీగా ఉన్న కవితతోపాటు అందరూ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఎంఎండీ యాక్ట్ చట్టరూపం పొందింది. 2020లో కమర్షియల్ మైనింగ్ అంశాన్ని చట్టంలో చేర్చారు. దీని ప్రకారమే ఇప్పుడు కేంద్రం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడు రాజకీయం మారిపోయింది పార్లమెంట్‌లో తాము మద్దతిచ్చిన చట్టం ప్రకారం బొగ్గు గనుల వేలం వేస్తున్నా అది సింగరేణి ప్రైవేటీకరణే అని బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తోంది.
సింగరేణికి బొగ్గు గనులు ఉండాలి అవి ఉంటేనే వ్యాపారం జరుగుతుంది. ఇప్పటికి అయితే సింగరేణిగి బొగ్గు గనుల కొరత లేదు. కానీ భవిష్యత్‌లో ఇలా సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులన్నీ ప్రైవేటు లో వేలం పాటలో పాడుకుంటే సింగరేణి పరిస్థితి ఏమిటి అన్నది ప్రధాన సందేహం. ఈ వేలంలో సింగరేణి పాల్గొంటే నాలుగు బ్లాకులు సింగరేణికే దక్కుతాయి. అప్పుడు ప్రైవేటీకరణ ముచ్చటే ఉండదంటున్నారు. కానీ వేలంలో సింగరేణి పాల్గొనడంపై ఇంకా సందేహాలు ఉన్నాయి. అదే సమయంలో కేంద్రం కూడా చట్టంలో ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి సింగరేణికి బొగ్గు గనులు కేటాయించవచ్చు. ఇలా ఎవరూ తగ్గకుండా ఎవరు రాజకీయం వారు చేస్తున్నారు. సింగరేణిని రాజకీయ సుడిగుండంలో నెడుతున్నారు.