ఎన్నికల సీజన్ లో ఆయారాం గయారాంలకు కొదవ ఉండదు. ఓ పార్టీలో ఐదేళ్లు కష్టపడి.. పక్క పార్టీలో టిక్కెట్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. టిక్కెట్లు ఖరారు చేయడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేరికల్ని ప్రోత్సహిస్తోంది. అభ్యర్థుల్ని ఖరారు చేసినా ఇతర తాయిలాల్ని చూపించి బీఆర్ఎస్ కూడా నేతల్ని ఆకర్షిస్తోంది. కానీ అసలు బీజేపీ వైపే చూసే వారు కనిపించడం లేదు. టిక్కెట్లు ఇస్తామన్నా పట్టించుకోవడం లేదు. అందుకే చేరికలతో గాంధీభవన్, తెలంగాణ భవన్ బిజీగా ఉంటే… శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ మాత్రం వెలవెలబోతోంది .
రాజకీయాల్లో విధేయతకు చోటు లేదు. పార్టీలో తాము చూపించిన విధేయతకు తగ్గట్లుగా పదవులు వస్తే సరి లేకపోతే… ఎంత విధేయత చూపించారో అంత కంటే ఎక్కువగా తెగిడి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. బీఆర్ఎస్ లో టిక్కెట్ల కోసం చూసిన వారికి… కాంగ్రెస్ లో చాన్స్ దొరుకుతోంది. వారంతా కండువాలు కప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ లో చాన్స్ రాని వారు.. కోపంతో బీఆర్ఎస్ కండువా కప్పించుకుంటున్నారు. కానీ ఎవరూ బీజేపీలో చేరాలని అనుకోవడం లేదు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో చేరికలు పెరిగాయి. రాహుల్ పర్యటనలో ప్రతీ గంటకూ ఒకరు చొప్పున చేరుతూనే ఉన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాగ్రెస్‌లో చేరారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మరో కార్పొరేటర్ అయిన ఆయన భార్య తో పాటు అనుచరులంతా కాంగ్రెస్‌లో చేరారు. శేరిలింగం పల్లి నుంచి మరో కీలక నేత … బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. వీరికి శేరిలింగంపల్లి, కూకట్ పల్లి టిక్కెట్లు ఖరారు చేస్తారని చెబుతున్నారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. మండవ వెంకటేశ్వర్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి కూడా చేరేందుకు సిద్ధమయ్యారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు సైతం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక పలువురు మాజీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు . ఇక స్థానిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ చేరిన వారంతా మెల్లగా వెనక్కి వస్తున్నారు. బీఆర్ఎస్ అసంతృప్తులు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉండటంతో వారి కోసం పని చేయడం ఇష్టం లేని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు, మున్సిపల్ పదవుల్లో ఉన్న వారు పార్టీ వీడి పోవడం… బీఆర్ఎస్‌కు షాక్ లాంటిదే.
మరో వైపు భారత రాష్ట్ర సమితిలోనూ చేరికలు తగ్గడం లేదు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ లో చేరికలు ఎక్కువగా ఉండటానికి కారణం బీఆర్ఎస్ లో అభ్యర్థులు ఫైనల్ కావడం. పార్టీలో చేరే వారికి.. ఎలాంటి టిక్కెట్లు ఆఫర్ చేయడం లేదు. మూడో సారి పార్టీ గెలిచిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని హామీతో చేర్చుకుంటున్నారు. మల్కాజిగిరికి చెందిన నందికంటి శ్రీధర్ వంటి వారికి వెంటనే పదవులు వచ్చాయి.. ఇతరులు ఆశావహ దృక్పథంతో చేరుతున్నారు. కాంగ్రెస్ లో కష్టపడి.. చివరి క్షణంలో తమకు టిక్కెట్లు దక్కని వారు… బీఆర్ఎస్ పిలుపుతో కారెక్కిపోతున్నారు. కొంత మంది సీనియర్లను కూడా ఆకర్షిస్తున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి వారు పార్టీలో చేరారు. రావులకు .. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదైనా … బీఆర్ఎస్ కూడా… ఆకర్ష్ ప్రయోగించో.. ఆఫర్లు ఇచ్చో…. చేరికల విషయంలో మాత్రం ..కాంగ్రెస్ తో పోటాపోటీగా ఉండే ప్రయత్నం చేస్తోంది.
అయితే అటూ ఇటు కాని పరిస్థితి బీజేపీకే ఏర్పడింది. చేరికలతో బలపడిపోతామని మొదటి నుంచి అంచనాల్లో ఉన్న ఆ పార్టీ వైపు ఎవరూ చూడటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మినహా బలమైన అభ్యర్థులు లేకపోవడం…ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవవటం, ఇతర పార్టీల నుంచి చేరికలు లేకపోవడంతో అభ్యర్థుల ప్రకటన కూడా చేయలేకపోతున్నారు. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను వెతుక్కోవడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. మొన్నటిదాకా బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనీ, ఒంటరిపోరుతో రాష్ట్రంలో సునామీ సృష్టించబోతున్నామని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే ఢిల్లీలో మంతనాల మీద మంతనాలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బీజేపీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిందన్న వాదన వినిపిస్తోంది.
తెలంగాణలో ముఖాముఖి పోరు ఉందని… రాజకీయ నేతలుకూడా గట్టిగా నమ్ముతున్నారు. మొదటి రెండు పార్టీల్లో ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీల చేరిపోతున్నారు. మూడో పార్టీ అయిన బీజేపీ వైపు చూడటం లేదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి