తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. 17 లోక్ సభ స్థానాలున్న తెలంగాణాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దానికోసం ప్రతీ నియోజక వర్గంలోనూ బలమైన అభ్యర్ధిని బరిలో దింపాలని భావిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన సీనియర్లలో కొందరిని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తోంది. తెలంగాణా కాంగ్రెస్ లో జోష్ పెంచేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణా నుండి పోటీ చేయించాలని పార్టీ వ్యూహకర్తలు నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనికి సోనియా గాంధీ అంగీకరించారో లేదో తెలీలేదు. ఆమెతో పాటు ప్రియాంక గాంధీ పేరు కూడా వినపడుతోంది.
తెలంగాణాలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మజ్లిస్ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తోన్న హైదరా బాద్ నియోజక వర్గాన్ని మినహాయిస్తే మిగతా 16 నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్ధులను వెతికే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్ నాయకత్వం. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చినా వరుసగా రెండు ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ మూడో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అదే విధంగా కేంద్రంలో వరుసగా రెండు ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ మరో నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని పంతంగా ఉంది. అందుకోసం ప్రతీ రాష్ట్రంలోనూ తన బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. అందులోభాగంగా తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించింది.
పార్టీలో జోష్ నింపడానికి పార్టీ సుప్రీమ్ లీడర్ సోనియా గాంధీని తెలంగాణాలో ఏదో ఒక నియోజక వర్గం నుండి పోటీ చేయించాలని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి దాకా ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన మల్కాజగిరి లోక్ సభ నియోజక వర్గం నుండి సోనియా గాంధీని బరిలో దింపాలని భావిస్తున్నారు. దీని ప్రభావం దక్షిణ భారతంపై బానే ఉంటుందని అది కాంగ్రెస్ కు కలిసొస్తుందని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న సోనియా గాంధీ తెలంగాణా నుండి పోటీకి సై అంటారా లేదా? అన్నది తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక వేళ సోనియా గాంధీ ససేమిరా అంటే ప్రియాంక గాంధీని అయినా పోటీ చేయించాలని వారు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలతో ప్రియాంక గాంధీ బాగా కనెక్ట్ అయ్యారు.
గాంధీ కుటుంబ సభ్యులు దక్షిణాది నుండి పోటీ చేయడం కొత్తేమీ కాదు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తనయ ఇందిరాగాంధీ 1980లో తెలంగాణా నుంచి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మెదక్ లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు.జనతా పార్టీ నాయకుడు జైపాల్ రెడ్డి పై ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇందిరాగాంధీ ఎన్నికల బరిలో ఉండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఫలితంగా 42 లోక్ సభ స్థానాలున్న ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలు గెలుచుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులు తెలంగాణా నుంచి పోటీ చేస్తే పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. సోనియా గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేయడం ఖామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీయే కాదు భారతీయ జనతాపార్టీ కూడా తెలంగాణాపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి అగ్రనేతల్లో ఒకరిని తెలంగాణా నుండి బరిలో దించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కానీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ తెలంగాణా నుండి బరిలో దిగితే పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో సంచలన విజయాలు సాధించిన బిజెపి వచ్చే ఎన్నికల్లో కనీసం 9 స్థానాలైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అది నిజం చేసుకోవాలంటే నరేంద్ర మోదీ ఇక్కడి నుండి పోటీ చేయాలని తెలంగాణా బిజెపి నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు చెబుతున్నారు. దీనిపై మోదీ , అమిత్ షాలు తమ నిర్ణయాన్ని ఇంతవరకు ప్రకటించలేదంటున్నారు.
హైదరాబాద్ లోక్ సభ స్థానం కొన్నేళ్లుగా మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉంటోంది. ఈ సారి దాన్ని బ్రేక్ చేసి అక్కడ పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుండి పోటీ చేసి ఓటమి చెందిన ఫిరోజ్ ఖాన్ ను హైదరాబాద్ లోక్ సభ నియోజక వర్గం నుండి బరిలో దింపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్, బిజెపిలో తెలంగాణాలో లోక్ సభ స్థానాలపై గురి పెట్టాయి. మరో వైపు భారత రాష్ట్ర సమితి సైతం లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉందంటున్నారు. రెండు జాతీయ పార్టీలతో పాటు బి.ఆర్.ఎస్. కూడా రాబోయే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో లోక్ సభ ఎన్నికలు హోరా హోరీగా సాగే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పండితులు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…