నిజం నిప్పులాంటిదంటారు. నిజాన్ని నిజంలా చూడాలంటారు. కాకపోతే అన్ని సందర్భాల్లో నిజం నచ్చకపోవచ్చు. నిజంగా అది నిజమేనా అన్న అనుమానం రావచ్చు, క్రాస్ చెక్ చేసుకుంటే తప్పేముందన్న ఫీలింగ్ కలగొచ్చు. మనం చేస్తున్నదేమిటి కనిపిస్తున్న ఫలితమేమిటన్న అయోమయ స్థితి రావచ్చు, దానితో మనసు పరిపరివిధాలుగా పోవచ్చు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన రూటు మార్చుతున్నారు….
ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంది.పార్టీ వారిపైనే అనుమానం ఉంది. తన ఛరిస్మా తప్పితే ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిందేమీ లేదన్న డౌట్సు ఉన్నాయి. ఎన్నికల విషయంలో తాను తప్పటడుగులు వేస్తున్నానేమో అన్న భయమూ నెలకొంది. భయం నిజం కాకూడదంటే క్షేత్రస్థాయి పరిస్థితులను తాను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. అందుకే సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. ముందస్తుగా ప్రకటించిన అభ్యర్థుల్లో ఎవరి దమ్ము ఎంత ఉందో తేల్చుకుంటున్నారు….
కేసీఆర్ గంభీరంగా కనిపించొచ్చు. తనకు తిరుగులేదన్న నమక్మాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుండొచ్చు. బీఆర్ఎస్ పేరుతో దేశాన్నే ఏలాలనుకుంటున్న తనకు తెలంగాణ ఒక లెక్కా అన్న విశ్వాసం ఉండొచ్చు. ఐనా తనకు అలవాటుగా చేయించుకున్న సర్వేలే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 115 మంది అభ్యర్థులను ముందే ప్రకటించి ప్రచారానికి అవకాశం ఇచ్చినా ఏదో తేడా కొడుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం అంత సులభం కాదని, టఫ్ ఫైట్ ఖాయమని సర్వేలు తేల్చేస్తున్నాయి. దానికి కారణాలు కూడా సహేతుకంగానే అనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు బొటాబొటీ మెజార్టీ రావడం కూడా కష్టమని సర్వేలు తేల్చేసిన తరుణంలో ఐదేళ్ల పాలనపై అనుమానాలు కలుగుతున్నాయి. సంక్షేమ పథకాలు, ఇతర స్కీముల అమలు తీరులో తలెత్తిన లోపాలు బీఆర్ఎస్ విజయానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని, ప్రజల్లో వారి పట్ల వ్యతిరేకత ఉందని తెలిసి కూడా తిరుగుబాటుకు వెనుకాడి కేసీఆర్ సిట్టింగులకు టికెట్లు ఇచ్చారు. అదే ఇప్పుడు శాపమై కూర్చోంది. పైగా వరుసగా రెండు సార్లు అధికారాన్ని చెలాయించిన పార్టీకి స్వతహాగా కాస్త వ్యతిరేకత కూడా ఉంటుంది.
కేసీఆర్ ఇప్పుడు రూటు మార్చారు. ఇంటెలిజెన్స్ సర్వేలకు కొత్త రూపు ఇస్తున్నారు. ఒక జిల్లోలోని ఇంటెలిజన్స్ అధికారులను వేరే జిల్లాలకు పంపి వారి ద్వారా సర్వేలు చేయిస్తున్నారు. నల్లొండ అధికారులు మహబూబ్ నగర్ లో సర్వే చేస్తున్నారు. మహబూబాబాద్ అధికారులు నిజామాబాద్ లో లెక్కలు తీస్తున్నారు. ఆదిలాబాద్ అధికారులు రంగారెడ్డిలో తిరుగుతున్నారు. దీని వల్ల ముందు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో నిజానిజాలు బయట పడతాయని కేసీఆర్ విశ్వాస్తున్నారు. ఈ నెలాఖరు లోగా సర్వేలు తెప్పించుకుని వాటిని విశ్లేషించి తనముందుంచాలని ఉన్నతాధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని కీలక జిల్లాలు కూడా ఆయనకు అనుమానంగా ఉన్నాయి. అందులో నల్లొండ, ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అనివార్యత ఉందని కేసీఆర్ అనుమానిస్తున్నారు. ఆ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోందని ఆయనకు ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. ఇండిపెండెంట్ గా పది పన్నెండు బృందాలు చేసిన సర్వేల్లో నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని తేలడంతో కేసీఆర్ ఒకింత టెన్షన్లో పడ్డారు . కాంగ్రెస్, వామపక్షాల పొత్తు ఫైనలైజ్ అయితే ఆ రెండు జిల్లాలపై ప్రభావం ఎలా ఉంటుందన్నది సర్వే రిపోర్టుల్లో చేర్చాలని ఇంటెలిజెన్స్ అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
నిజానికి కేసీఆర్ బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఆయన అదనపు బాధ్యతలు కూడా అప్పగించారని సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ పరిస్థితిపై సర్వే చేయడంతో పాటుగా పబ్లిక్ ఒపీనియన్ ను పార్టీకి అనుకూలంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఆయన ఆదేశించారు. బీఆర్ఎస్ విధానాలను, ప్రజలకు చేసిన మేలును చాపకింద నీరులా ప్రచారం చేయాలని సూచించారు. దాని వల్ల చాలా వరకు నెగిటివిటీ తగ్గుతుందని నమ్ముతున్నారు. అవసరమైతే ఇంటెలిజెన్స్ అధికారులకు నిధులు సమకూర్చుతామని కూడా హామీ ఇచ్చారట. ఈ క్రమంలో అవసరమైతే 20 నుంచి 25 శాతం మంది అభ్యర్థులను మార్చేందుకు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…