కాంగ్రెస్ లోకి మరో 13 మంది ఎమ్మెల్యేలు… ?

By KTV Telugu On 2 July, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాటిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ బాగానే పనిచేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.చిటికేస్తే వచ్చి  చేరుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. మరింత  మంది వచ్చి చేరతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పైగా భయం వద్దు, ఎవరేం చేసుకోలేరు వచ్చి చేరండంటూ కాంగ్రెస్ నేతలు ఆఫరిస్తున్నారు. అంత కష్టం ఏమొచ్చిందీ, అసలెందుకు చేరుతున్నారు లాంటి ప్రశ్నలు  వేసుకుంటే…బీఆర్ఎస్ లో  ఉండలేకపోవడమే కారణమా, అధికార పార్టీలో ఉంటే మంచిదన్న ఆలోచనా అన్న చర్చ వస్తే రెండోదే కరెక్టన్న వాదన వినిపిస్తోంది. అంతరించి పోతున్న బీఆర్ఎస్ పార్టీలో ఉండే కంటే… జాతీయపార్టీ కాంగ్రెస్లోకి వెళితే ప్రయోజనం  ఉంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అతి త్వరలో మరికొందరి చేరికలు ఖాయమని  కూడా సంకేతాలు అందుతున్నాయి.

ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు.  ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వరుస మీటింగులు పెట్టి  వారిని  బతిమాలి, బామాలినా.. బీఆర్ఎస్లో ఉండేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో యాదయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ప్రభుత్వ సుస్థిరతకు ఎమ్మెల్యేల చేరికలు అవసరమంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించి 24 గంటలు గడవక ముందే యాదయ్య చేరిక చోటుచేసుకోవడం గమనార్హం.  ఎమ్మెల్యే యాదయ్య చేరిక విషయాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం చివరి దాకా గోప్యంగా ఉంచింది. యాదయ్య పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నా ఆయన ఖండిస్తూ వచ్చారు.నాలుగు రోజుల క్రితం కేసీఆర్ తో జరిగిన మీటింగులో  కూడా యాదయ్య పాల్గొన్నారు. తర్వాత వ్యూహాత్మకంగా ఢిల్లీ వెళ్లిపోయి  కాంగ్రెస్లో చేరారు. ఆయన కాంగ్రెస్ లో చేరిన ఆరో  బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవుతారు.  ఇప్పుడు బీఆర్ఎస్ బలం 32కి పడిపోయింది. అందులో కూడా చాలా మంది ఉండరనే చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ అధిష్టానం   ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఎంత మంది ఉంటారో, ఎంతమంది ఊడతారో అర్థం కాని దుస్థితిలో ఉంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంటామన్న భయం వారిలో మెదులుతోంది. అయితే ఆ పార్టీకి అసలు సీనే లేదని, మరో ఏడాది ఏడాదిన్నర ప్రాంతానికి బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుందని రాజకీయ  వర్గాల్లో వినిపిస్తోంది…

గులాబీ దళపతి కౌన్సిలింగ్   పనిచేయడం లేదు. రెక్కలు కట్టుకుని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటిలో వాలిపోతున్నారు. తెలంగాణ భవన్ టు గాంధీ భవన్ స్పెషల్ బస్సులు వేసినట్లుగా లీడర్లు చెక్కేస్తున్నారు. రేవంత్  కోటరీలో అత్యంత సన్నిహిత వ్యక్తులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజువారీ మాట్లాడుతున్నారు. తమను  త్వరగా చేర్చుకోవాలని కోరుతున్నారు. అందుకు కాంగ్రెస్  వైపు నుంచి సానుకూల స్పందన వస్తోంది. సమయం వచ్చినప్పుడు చేర్చుకుంటామని ఎవరూ తొందర పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇప్పటికే ఆరుగురు చేరడం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును కాంగ్రెస్ చేజిక్కించుకోవడం చకచకా   జరిగిపోయాయని అంతే వేగంతో మరింత మందిని చేర్చుకుంటామని చెబుతున్నారు. త్వరలోనే దశలవారీగా 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే చేరికలన్నీ బహిరంగమే అయినందున ప్రత్యేకంగా పేర్లు ప్రకటించాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆఖరుకు బీఆర్ఎస్ పార్టీలో  ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని కాంగ్రెస్ వర్గాలు సవాలు చేస్తున్నాయి. ఆ ఐదుగురు ఎవరన్నది కూడా ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదని వివరణ ఇస్తున్నాయి…

బీఆర్ఎస్ నుంచి చేరికల కోసం కాంగ్రెస్ అధిష్టానం కొన్ని మార్గదర్శకాలు కూడా జారి చేసినట్లు తెలుస్తోంది. వచ్చిన తర్వాత పది కాలాల  పాటు పార్టీలో ఉంటారనుకునే వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వాళ్లు ఏమైనా  పనులు చేయాలని అడిగితే తిరస్కరించుకూడదని సూచించింది. అప్పుడే తమ పట్ల విశ్వాసం పెరిగి పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లుగా మంత్రి పదవులు ఇవ్వలేకపోయినా వచ్చినందుకు తగిన న్యాయం చేస్తారన్న విశ్వాసం మాత్రం ఉంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి