టీ.కాంగ్రెస్ లో బకరాల గేమ్ !

By KTV Telugu On 24 August, 2023
image

KTV TELUGU ;-

తెలంగాణ కాంగ్రెస్ లో దరఖాస్తుల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అంతవరకు బాగా ఉంది. టైమ్ కూడా బాగానే ఇచ్చారు కాకపోతే దరఖాస్తులు చేసుకుంటే టికెట్ వస్తుందా. ఇప్పుడు పాతుకుపోయిన నాయకులను కాదని వేరే వాళ్లకు టికెట్ ఇస్తారా. కాంగ్రెస్ లో అది సాధ్యమా… ఇదీ పెద్ద ప్రశ్నే…

ఫీజు కట్టు, దరఖాస్తు పెట్టు అన్నంత ఈజీగా టికెట్ రాదు. 50 వేల రూపాయలు రుసుము చెల్లించిన ప్రతీ ఒక్కరి చేతిలో బీ ఫార్మ్ పెట్టేయ్యరు.ప్రొసీజర్ ఉంటుందా అంటే ఏమో చెప్పలేమనే అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొందరు నేతలు ఇప్పటికే పాతుకుపోయారు. వారిని కదిలించి వేరొకరికి టికెటివ్వడం అంత సులభం కూడా కాదు. మరి ఈ తంతు ఎందుకు…

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల రేస్‌ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దాంతో, గాంధీభవన్‌ కోలాహలంగా మారింది. ఎమ్మెల్యే టికెట్‌ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు లీడర్లు. తమ బలాబలాలను ప్రస్తావిస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎప్పట్నుంచి పార్టీలో ఉన్నారో?. ఎంత లాయల్టీగా ఉన్నారో? పార్టీ కోసం ఏమేం చేశారో? నియోజకవర్గంలో ఎంత పట్టుందో? సామాజికంగా ఉన్న ప్లస్‌లు!, ఇలా దేన్నీ వదలకుండా సకల అస్త్రాలను అప్లికేషన్‌లో పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు 25వ తేదీ వరకు అర్జీలు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. దరఖాస్తు రుసుమును యాభై వేల రూపాయలకు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే 25 వేలు చెల్లిస్తే చాలు.. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ మొట్టమొదట దరఖాస్తు దాఖలు చేశారు. వనపర్తి నుంచి పోటీ చేసేందుకు ఎంపీపీ మెఘా రెడ్డి రెండో దరఖాస్తు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఈ ప్రక్రియపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాతుకుపోయిన పాత కాపులను కాదని ఇతరులకు టికెట్లు ఇస్తారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. కొండగల్ నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్న తరుణంలో ఆయనకు బదులుగా ఇతరులను ఎంపిక చేసే వీలుందా అని ఆశావహులు నిలదీస్తున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డికి బదులు వేరొకరికి ఇస్తారా. శ్రీధర్ బాబు టికెట్ ఇతరులకు ధారాదత్తం చేసే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశించిన టికెట్ వేరొకరికి ఇవ్వగలరా.. పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను కాదని వేరే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది. అలా గీతారెడ్డి, దామోదరం రాజనర్సింహ లాంటి వారికి టికెట్లు ఇవ్వకుండా కొత్తవారిని ప్రోత్సహించే అవకాశాలు లేవు. ఒకరిద్దరికి మార్చినా పార్టీలో తిరుగుబాటు ఖాయమన్న భయాలూ ఉన్నాయి. గత ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఆపేస్తే ఆయన అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసి టికెట్ తెచ్చుకున్నారు. చివరకు ఓడిపోయారు.

ఈ దరఖాస్తుల ప్రక్రియ పార్టీలో సిన్సియర్ కార్యకర్తలను బకరాలను చేసేందుకేనన్న చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యయుతంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని చెప్పేందుకే ఈ పని చేపట్టారని అంటున్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోతూ, అందరికీ అవకాశాలు ఇస్తామని కలరింగ్ ఇవ్వడం కోసం హడావుడి చేస్తున్నారని ఒక వాదన ప్రచారంలో ఉంది. అంతకు మించి జరిగేదేమీ లేదు. పార్టీలో ఎంత సిన్సియర్ గా పనిచేసినా లాబీయిస్టులకే అవకాశాలుంటాయని కాంగ్రెస్ లో మొదటి నుంచి వినిపిస్తున్న మాట. అలా కాదని ఎక్కువసార్లు పదవులను అనుభవించిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది. అది ఎప్పటికీ జరగదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి