కాంగ్రెస్, బీజేపీల్లో   ఆశావహుల సందడి

By KTV Telugu On 25 August, 2023
image

KTV TELUGU :-

భారత రాష్ట్ర సమితి  అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసి కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో కాకరేపింది. రెండు జాతీయ పార్టీలు ఊహించని విధంగా తానే ముందస్తుగా 115 మంది అభ్యర్ధులతో జాబితా విడుదల చేయడం ద్వారా కాంగ్రెస్, బిజెపిలకు నిద్రలేకుండా చేసింది బి.ఆర్.ఎస్. అటు కాంగ్రెస్, బిజెపిలు కూడా  అభ్యర్ధుల ఎంపికకు  నడుం బిగించాయి. రెండు జాతీయ పార్టీల్లోనూ బి.ఆర్.ఎస్. కు గట్టి పోటీని ఇవ్వబోయేది కాంగ్రెస్సే. అందుకే ఎక్కువ మంది  టికెట్ కోసం  గాంధీభవన్ లో ఓ దరఖాస్తు  సమర్పించుకుంటున్నారు. బిజెపిలో ఇంకా అంత హడావిడి కనపడ్డం లేదు.

హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సందడే సందడి. రాష్ట్రం నలుమూలల నుండి కాంగ్రెస్ టికెట్ కోరుకుంటోన్న వారంతా మందీ మార్బలాలతో గాంధీభవన్ కు తరలి వస్తున్నారు. ఆగస్టు 25 వరకు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా   పిసిసి  ప్రకటించడంతో అందరూ   ఆసక్తిగా గాంధీ భవన్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మూడు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరో మూడు వందల వరకు దరఖాస్తులు రావచ్చునని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఔత్సాహికులైన అభ్యర్ధులే కాదు అగ్రనేతలు కూడా  దరఖాస్తు సమర్పించాలి.

కాంగ్రెస్ పార్టీలో జోష్ రోజు రోజుకీ పెరుగుతోంది. మరో వైపు తెలంగాణా భారతీయ జనతా పార్టీ కూడా హల్ చల్ చేస్తోంది. ప్రధాన పోటీ కాంగ్రెస్-బి.ఆర్.ఎస్. ల మధ్యనే ఉంటుందని బిజెపి  నేతలకూ తెలుసు. అయినా తామే అధికారంలోకి రాబోతున్నామని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీయార్ పై  నిప్పులు చెరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ఓటమి ఖాయమని కేసీయార్ ముందుగానే గ్రహించారు కాబట్టే ఒకేసారి 115 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేసి చేతులెత్తేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బి.ఆర్.ఎస్. లో టికెట్లు రాని వారు..బిజెపిలో ఉండీ లాభం లేదనుకున్నవారు..కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో అడుగు పెట్టాలనుకున్నవారు అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే  బి.ఆర్.ఎస్. అభ్యర్ధులు ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఆయా నియోజక వర్గాల్లో బి.ఆర్.ఎస్. ను ఓడించగల బలమైన అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో పడింది. గెలిచే పరిస్థితి లేకపోతే ఎంత సీనియర్ అయినా టికెట్ ఇవ్వద్దని కాంగ్రెస్ హై కమాండ్ ఒక వ్యూహాన్ని రూపొందించుకుంది. కర్నాటకలో సక్సెస్ అయిన ఆ ఫార్ములానే తెలంగాణాలో అమలు చేయడానికి రెడీ అయ్యింది.

కాంగ్రెస్-బి.ఆర్.ఎస్. ల మధ్య రహస్య డీల్ ఉందని.. రెండు పార్టీలూ మిత్ర పక్షాలేనని బిజెపి ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కూడా ఇలాంటి ఆరోపణే చేస్తోంది. బిజెపి బిఆర్ఎస్ లు రెండూ ఒక్కటే అని కాంగ్రెస్ అంటోంది. అందుకే ఢిల్లీ లిక్కర్ మాఫియా కేసులో  కేసీయార్ తనయ కవిత దొరికినా..ఛార్జ్ షీట్లో ఆమె పేరు ఉన్నా ఆమెను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. లిక్కర్ మాఫియా కేసులో ఈడీ విచారణకు వెళ్లిన కవిత లోక్ సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని  ఆందోళన చేశారు. ఇపుడు తెలంగాణా బిజెపి అధ్యక్షుడు దాన్నే ప్రశ్నిస్తున్నారు. లోక్ సభలో 33 శాతం సీట్లు మహిళలకు ఇవ్వాలన్న కవిత తెలంగాణాలో తమ పార్టీలో మహిళలకు కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎందుకిచ్చారో చెప్పాలని నిలదీశారు

కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా తన తొలి జాబితా విడుదల చేయబోతోంది. ఇప్పటికే టికెట్లు ఖాయం అనుకున్న సీనియర్ నేతల పేర్లతో తొలి జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత  దశల వారీగా  జాబితాలు విడుదల చేసుకుంటూ పోవాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. పార్టీల్లో టికెట్లు రాని అసంతృప్తులను తమవైపు ఆకర్షించుకుని అప్పుడే జాబితా విడుదల చేయాలన్న లెక్కతో ఉందంటున్నారు. ఈ సారి బిజెపిలో ఎంపీ స్థాయి నేతలు ముందుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారని అంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి