digvijay singh
తెలంగాణ కాంగ్రెస్ లో జూనియర్, సీనియర్ పంచాయతీ ఇప్పట్లో తెగెలా లేదు. అధిష్టానం ప్రతినిధిగా దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చి చర్చలు జరిపినా ప్రయోజనం కనిపించడం లేదు. ఫిర్యాదులు వినడం తప్పతే ఇప్పటికిప్పుడు ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదని తేలిపోయింది. ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న తరుణంలో డిగ్గీ రాజా కొందరిపై సీరియస్ అయినా పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు. వారి ధోరణిని మార్చుకునే అవకాశాలు లేవు.
సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ అన్యాయం జరిగిందని గాంధీభవన్‌కి వచ్చిన ఓయూ విద్యార్థి సంఘం నేతలను ఉద్దేశించి ఎక్కడ అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే అనిల్ నిలదీశారు. దీంతో రెండు వర్గాల మధ్య పెరిగిన మాటామాట పెరిగింది. గల్లాలుపట్టి మరీ ఒకరినొకరు నెట్టేసుకున్నారు. మధ్యలోకి వెళ్లి సర్దిచెప్పబోయిన మల్లు రవిని కూడా తోసేశారు. జై కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్ దొంగల నుంచి పార్టీని కాపాడండి అని కొందరు నినాదాలు కూడా ఇచ్చారు. నిజానికి ఇటీవలి కాలంలో సీనియర్లపై అనిల్ ఆరోపణలు సంధిస్తున్నారు. పార్టీలో వాళ్లకు వచ్చిన లోటేమిటో చెప్పాలని అడుగుతున్నారు. దానితో కొందరు నేతలు అనిల్ పై ఎన్ఎస్యూఐ కార్యకర్తలను రెచ్చగొట్టినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే సీనియర్లు, జూనియర్ల గొడవను పరిష్కరించ లేక అధిష్టానం నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు విద్యార్థి సంఘం కూడా వచ్చి చేరడంతో కొత్త తలనొప్పులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పైగా దిగ్విజయ్ గాంధీ భవన్లో ఉండగానే గల్లాలు పట్టుకొని కొట్టుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి చేయి దాటి పోతుందన్న ఆందోళనకు కారణమవుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు గ్రూపులు కనిపిస్తున్నాయి. మొదటిది రేవంత్ రెడ్డి గ్రూపు గత ఐదారేళ్లుగా పార్టీలో చేరిన వారిని కూడా ఇప్పుడు ఆ గ్రూపులో పడేశారు. వాళ్లలో సీతక్క లాంటి వారిని లెక్క గట్టుకోవాలి. వారికి మల్లు రవి మెయిన్ లీడర్ రెండోది సీనియర్ల గ్రూపు. ఇప్పుడిప్పుడే వారికి జీ-9 అని పేరు వస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నాయకులు ఆ గ్రూపులో ముఖ్యులు. మరోటి తటస్థంగా ఉంటున్న గ్రూప్. ఎవరితోనూ సంబంధం లేకుండా నాలుగు మంచి మాటలు చెబుతూ కాంగ్రెస్ లో విభేదాలు లేవని చిన్న సమస్యలు అవే పరిష్కారమవుతాయని చెప్పే గ్రూప్. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి లాంటి వాళ్లు ఆ గ్రూపుగా చెప్పొచ్చు దిగ్విజయ్ సింగ్ ఆ మూడు గ్రూపులతోనూ మాట్లాడారు.
దిగ్విజయ్ సింగ్ కు ఎవరి ఫిర్యాదులు వాళ్లు అందజేశారు. సీనియర్లు రేవంత్ కు వ్యతిరేకంగా భారీ నివేదికలే ఇచ్చారు. భట్టి విక్రమార్క గంటకు పైగా డిగ్గీ రాజాతో విడిగా మాట్లాడారు. ఏమిటీ రోడ్డున పడి కొట్టుకోవడం అని దిగ్విజయ్ వారిని సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. మీడియా ముందు మాత్రం ఎవరికి వారు ఏమీ తెలియనట్లుగా అంతా పాజిటివ్ గానే ఉన్నట్లు చెప్పుకున్నారు. కాంగ్రెస్ లో కోవర్టులు లేరని చెప్పారు. అభిప్రాయబేధాలే తప్ప విభేదాలు లేరని కూడా గొప్పగా చెప్పేశారు.
కాంగ్రెస్ లో అంతర్గత సమస్యలు ఎంత సహజమో పరిష్కారమూ అంత కష్టమని అందరికీ తెలుసు. అధిష్టానం ప్రతినిధి వచ్చి పది మందితో మాట్లాడినంత మాత్రాన రాత్రికి రాత్రే పరిష్కారమై పోతుందని చెప్పలేం. అధిష్టానానికి కూడా ఆ సంగతి బాగానే తెలుసు. గ్రూపులుగా విడిపోయి పార్టీని రోడ్డున పడేసే వారిని నిలువరించేందుకు చర్చలు ఒక మార్గమని చాలా రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. నిత్యం ఉండే ప్రతినిధి కాకుండా మరో నేతను పంపితే ఏదో మార్పు రాబోతోందని అసమ్మతి వర్గం సంతోషపడుతుందన్నది ఒక అంచనా. చర్చలు జరిపిన ప్రతినిధి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడి వారు అధిష్టానం నిర్ణయం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మరిచిపోతారు. మహా అయితే ఒకరద్దరికీ పదవులు ఇచ్చి వారి అసంతృప్తిని చల్లార్చుతారు. ఇంతలో కొత్త సమస్యలు వస్తాయి. పాత సమస్యలు మరిచిపోతారు. కాంగ్రెస్ అంటే అదే మరి.