కేసీఆర్ తప్పే చేస్తున్న రేవంత్ !

By KTV Telugu On 22 June, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో  రెండు టర్మ్ లలో కేసీఆర్ పాటించిన సంప్రదాయాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనుకుంటోంది.   బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని అనుకుంటున్నారు.  ఇందు కోసం చర్చలు పూర్తి చేశారు. బడ్జెట్ సమావేశాలకు ముందే విలీనం  పూర్తి చేస్తారని అంటున్నారు. అదే జరిగితే రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పునే చేసినట్లు.  తెలిసి మరీ చేసిన తప్పుతో భవిష్యత్‌లో ఆయన రాజకీయ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ కమ్ సీఎంగా డబుల్ రోల్ పోషిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ స్థీరీకరణ అనే కాన్సెప్ట్ ను ఏకకాలంలో అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వలస నేతలకు టిక్కెట్లు ఇచ్చారు.  ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 సీట్లు గెలిచింది. అయితే ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బైపోల్ వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సో సంఖ్య 38కి తగ్గింది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.  ఇప్పుడు 35 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఇందులో 22 మంది హస్తం పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ఎల్పీ విలీనమవుతుంది. అలా విలీనం అయితేనే అనర్హతా వేటు పడదు. లేకపోతే నిర్ణయం తీసుకోవాల్సిందే.

ఈ విషయం పక్కన పెడితే అసలు రేవంత్ ఇప్పుడు ఎమ్మెల్యేల్ని ఆకర్షించాల్సిన అవసరం ఏముంది ?.   పార్టీలో పదవులు లేదా ప్రభుత్వంలో నామినేటెడ్ ప దవులు.. ఇంకా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి చేరే వారు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి నేతలే రేవంత్ రెడ్డికి అతి పెద్ద సవాల్ .  తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అండ్ టీం .. ఏటికి ఎదురీది గెలిచారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న వారంతా కాగ్రెస్ పార్టీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డిన వాళ్లే. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని నమ్మిన వాళ్లే.  బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఇలాంటి నేతలు కూడా కారణం. బీఆర్ఎస్ అధినేత వద్ద ఉన్న అలుసును ఆసరాగా చేసుకుని.. వారు చేసిన వ్యవహారాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. నిజానికి ఇదే అతి పెద్ద సమస్య. ఇప్పుడు గేట్లు ఎత్తి ఈ సమస్యను తన నెత్తి మీద వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.

పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన వారి ఫలం వలస నేతలు కొట్టేసేలా చేరికలు ఉంటున్నాయి.  పార్టీ కోసం కష్టపడిన వారు ఉన్నారు. దశాబ్దం పాటు పార్టీ కోసం కష్టపడిన వారు.. అసలు పార్టీకి భవిష్యత్తే ఉండదన్న భావన వచ్చినప్పటికీ పార్టీని వదిలి పెట్టని వారు ఉన్నారు. వారిలో చాలా మంది గ్రామ, మండల స్థాయిలోనే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బలంగా ఉందన్న భావన రావడానికి లీడర్లు పోయినా క్యాడర్ పోలేదని అనుకోవడమే. అది నిజం కూడా. ఇప్పుడు .. బీఆర్ఎస్ నేతలంతా పోలోమని కాంగ్రెస్ లోకి వస్తే.. మరి వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అందర్నీ గుర్తిస్తామని రేవంత్ చెబుతున్నారు. కానీ అది మాటల్లో అంత తేలిక కాదు.

పాతిక మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. మరి వారి మీద పోటీ చేసి ఓడిపోయిన వారి సంగతేంటి ?. వారు పార్టీకి లాయల్ గా ఎలా ఉండగలరు ? వాళ్లెవరూ బీఆర్ఎస్‌ను గెలిపించలేదని గుర్తుంచుకుంటే చాలు ! చేరుతున్న వారు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించలేదు. గతంలో బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచిందంటే… అది పూర్తిగా సెంటిమెంట్ మహిమ. అప్పట్లో అభ్యర్థి ఎవరు అన్నది కాదు.. కారు గుర్తు ఉన్నదా లేదా అన్నది చూసుకుని ఓట్లేశారు జనం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఆ కారు గుర్తు నేతలు ఎప్పుడూ ఆ పార్టీని గెలిపించలేదు. గెలిచి చూపించిన కాంగ్రెస్ పార్టీకి వారు చేసేదేమీ ఉండదు. కానీ.. బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయవచ్చు. ఈ వ్యూహంతో తమ కుంపటికి నిప్పుపెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. గతంలో కేసీఆర్ అదే చేసి నష్టపోయారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్ున్నారు.

అధికారం ఎక్కడ ఉంటే నేతలు అక్కడ ఉంటారు. కానీ వారిని చేర్చుకోవాలా వద్దా అన్నది తెలివిగా నిర్ణయించుకోవాలి. లేకపోతే జరిగే నష్టాన్ని అంచనా వేయలేరు. రేవంత్ ఈ విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి