కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ పాత వాసనలు పోవని అంటారు. ఎన్ని రకాలుగా పార్టీ రూపాంతరం చెందినా గ్రూపు తగదాలు, ఒకరిని ఒకరు కిందకు లాక్కునే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయంటారు. పదవుల కోసం ఎంతకైనా తెగించే నేతలు మంచి, చెడు,ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడేస్తుంటారంటారు. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే పనిచేస్తున్నారు..
“తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గూ శరం ఉందా? గత ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చారు.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ ఆయనకు పదవి కేటాయించారు”.. ఈ మాటలన్నది ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకుడు కాదు.. తుమ్మల నాగేశ్వరరావు వ్యతిరేకి అంతకన్నా కాదు. ఈ మాటలన్నది అధికార పార్టీ ఎమ్మెల్యే. ఆయన పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పైగా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ మంత్రి అని గుర్తు చేసినప్పటికీ రాజగోపాల్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. పైగా తుమ్మల ఉద్యమకారుడు కాదు కదా.. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా.. అని రాజగోపాల్ రెట్టించి మాట్లాడటం..ఆయనలో ఫ్రస్టేషన్ కు నిదర్శనం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.
కోమటిరెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.వందరోజుల్లోనే ఆయనలో అసహనం పెరిగిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి అధిష్టానం నుంచి హామీ రాకపోవడంతో మనసు వికలమై ఇష్టానుసారం ఆయన మాట్లాడుతున్నట్లుగా ఉంది. రాజగోపాల్ వ్యాఖ్యల కారణంగా తుమ్మల బాగా నొచ్చుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్….
తుమ్మల టీడీపీలో ఉండేవారు. మంత్రిగా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన ఆయనకు కాలం కలిసొచ్చి మంత్రి అయ్యారు. రాజగోపాల్ మధ్యలో బీజేపీలోకి వెళ్లి పరిస్థితిని అర్థం చేసుకుని మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే తుమ్మల, పొంగులేటి లాంటి ఔట్ సైడర్స్ కు మంత్రి పదవి ఇచ్చి తనకు ఎందుకు ఇవ్వరన్నది ఇప్పుడు రాజగోపాల్ ను వేధిస్తున్న సమస్య. దానితో పిచ్చిపిచ్చిగా మాట్లాడేస్తున్నారు. ఇంకెన్నాళ్లు వేచి చూడాలి అన్నట్లుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రతీ ఒక్కరిపై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కుటుంబానికి రెండు మంత్రిపదవులు ఏమిటని ఎవరైనా అడిగితే వారిపై ఎగిరెగిరిపడుతున్నారు. ఈ క్రమంలోనే తుమ్మల సహా కొందరిపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నిజానికి చాలా విషయాల్లో తుమ్మలకు సౌమ్యుడన్న పేరుంది. తన రాజకీయం, తన పని, ప్రజల సంక్షేమం తప్ప..ఇతరుల విషయాల్లో ఆయన జోక్యం చేసుకోరు. ఎవరినీ పల్లెత్తు మాట అనరు. అలాంటి తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడంపై రాజగోపాల్ వ్యాఖ్యలతో కొంత నొచ్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ తనను ఎందుకు టార్గెట్ చేశారని తుమ్మల వాపోతున్నారట. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా చేరడంతో ఆయన ఆగ్రహానికి, అసహనానికి లోనైనట్లుగా తెలుస్తోంది…
రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటి? ఉన్నట్టుండి తుమ్మలపై విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటనేది అంతు పట్టకుండా ఉంది.ఆయన వ్యాఖ్యల వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. పైగా తుమ్మల లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిపై విమర్శలు చేయడం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గుందా అని అధిష్టానాన్ని నిలదీసినట్లు మాట్లాడటం కూడా ఇప్పుడు రాజగోపాల్ ను ఇరకాటంలో పెట్టే అంశమే అవుతుంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…