తెలంగాణా కాంగ్రెస్‌కు పాత చింతకాయ పచ్చడి మంత్రం

By KTV Telugu On 23 December, 2022
image

ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో క్రమంగా తన ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొందిప్పుడు. కుమ్ములాటలు, అసమ్మతి స్వరాలతో కీచులాడుకుంటూ ఆ పార్టీ నాయకులు నలుగురిలో నవ్వుల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లూ ఏమీ పట్టనట్లుగా ఉండిపోయింది అధిష్టానం. చివరికి టీ కాంగ్రెస్‌ నేతలు రోడ్డెక్కి తన్నుకునే వరకు రావడంతో కళ్లు తెరిచి కాంగ్రెస్ పార్టీను ఉద్ధ‌రించ‌డానికి సీనియర్‌ నాయకుడు, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌కుటుంబీకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ను హుటాహుటిన హైదరాబాద్‌కు పంపించింది. ఈయన రాగానే అందరినీ పిలిచి మీటింగ్‌ పెట్టి మంత్రం వేయగానే అసమ్మతి హాం ఫట్‌ అన్నట్లు మాయం అవుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దాదాపు ద‌శాబ్దం క్రితం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించ‌డంలో ఈ రాజావారి పాత్ర కూడా ఉందని ఆ పార్టీ వాళ్లే చెప్పుకుంటారు. త‌న స‌ల‌హాలు సూచ‌న‌ల‌తో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేసి తాను మాత్రం ఎంచక్కా ఓ యంగ్‌ లేడీని పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టారు.

ఉన్నట్లుండి అధిష్టానం ఆదేశాలతో మ‌ళ్లీ తెరపైకి వ‌చ్చారు. తమ సమస్యలు పరిష్కరించడానికి ఈ వృద్ధ నాయకుడు తప్ప కాంగ్రెస్‌ అధిష్టానికి ఇంకెవరూ దొరకలేదా అని విసుక్కుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ భూత్ బంగ్లాలాగా తయారయ్యింది. పదేశ్ల క్రితం దిగ్విజ‌య్ లాంటి స్వయం ప్రకటిత మేధావుల అతి తెలివితోనే కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా త‌యారైందని అందరికీ తెలుసు. అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ఒకవైపు అసమ్మతిని ప్రోత్సహిస్తూ మరోవైపు సర్దిచెబుతూ మొత్తానికి పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేశారిప్పుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభ‌జిస్తే పార్టీ న‌ష్టపోతుందని తెలిసి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ముందుకెళ్లారు. ఆ తరువాత కూడా పార్టీని కాపాడుకునే ప్రయత్నాలేవీ చేపట్టలేదు. ఇప్పుడు డిగ్గారాజాను పంపించి సమస్యలు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉంటుందని ఎవరికీ నమ్మకం లేదు.