టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోడానికి ఇప్పటి నుంచే మేనిఫెస్టోను రెడీ చేసే పనిలో పడింది. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన టీ కాంగ్రెస్ మరో 7 డిక్లరేషన్లు ప్రకటించేందుకు సిద్దమయింది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ తన సెంటిమెంట్ నెంబర్ 9 కలిసొచ్చేలా 9 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్ కు సానుకూలంగా ఫలితాలు వస్తాయని హస్తం నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో కూడా గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఓటర్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయడానికి పీసీసీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 9 అంశాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉంటుందని చెబుతున్నారు. మేనిఫెస్టోలో ఉండబోయే అంశాలను ముందుగా పీసీసీ డిక్లరేషన్ల రూపంలో విడుదల చేస్తుంది. అలా ఇప్పటికే వరంగల్ జిల్లాలో రైతు సంఘర్షణ సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ను విడుదల చేసింది. ఇటీవల సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభ పెట్టి యూత్ డిక్లరేషన్ ను ప్రకటించింది.
రానున్న నాలుగు నెలల్లో 7 డిక్లరేషన్లను విడుదల చేయనున్నారు హస్తం నేతలు. అందులో ముందుగా ఓబీసీ డిక్లరేషన్ ఉండనుంది. బీసీ జనగణన, ఓబీసీ రిజర్వేషన్ పెంపు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. వీటితోపాటు బీసీ కులాల అభ్యున్నతికి కాంగ్రెస్ ఏం చేస్తుందనేది డిక్లరేషన్ లో పొందుపర్చనున్నారు. త్వరలో బీసీ సంఘర్షణ సభ పెట్టి బీసీ డిక్లరేషన్ ను ప్రకటించడానికి హస్తం నేతలు సిద్ధం అవుతున్నారు. ఇక 50 శాతం ఓటు బ్యాంకు వున్న మహిళల కోసం డిక్లరేషన్ ప్రకటించాలని డిసైడ్ అయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, మహిళా అభ్యున్నతికి ప్రాధాన్యత, ఆర్ధిక చేయూత, మహిళలకు భద్రత లాంటి అంశాలతో మహిళా డిక్లరేషన్ సిద్ధమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లు కూడా ప్రకటించాలని ప్లాన్ చేసింది. గతంలో దళిత గిరిజన దండోరా పేరుతో 6 నెలల పాటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడా సమావేశాలు కొనసాగబోతున్నాయి. ఆ సమయంలో ఎస్సీ, ఎస్టీ లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను డిక్లరేషన్ల రూపంలో విడుదల చేయనున్నారు. ఉద్యోగులకు, కార్మికులకు కర్షకులకు కలిపి మరో డిక్లరేషన్ ఉండనుంది. కేసీఆర్ పాలనలో చేసిన మోసాలను వివరించి వారికీ కాంగ్రెస్ ఏం చేస్తుందనే అంశాలతో ఉద్యోగులు, కార్మికుల డిక్లరేషన్ ఉంటుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పై ప్రత్యేకంగా కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల చెయ్యాలనే ఆలోచనతో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో డిక్లరేషన్ రూపంలో ప్రకటించనుంది.
మొత్తం 9 డిక్లరేషన్లు కలిపి కాంగ్రెస్ మేనిఫెస్టోగా విడుదల చెయ్యడానికి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆయా డిక్లరేషన్లను రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ ప్రిపేర్ చేసే పనిలో ఉంది. రేవంత్ రెడ్డికి తొమ్మిది సెంటిమెంట్ నెంబర్ కావడంతో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా తొమ్మిది అంశాలను చేర్చేలా చూస్తున్నారు పైగా గాంధీ భవన్ లో ఆయన కూర్చునే రూమ్ నెంబర్, తిరిగే కార్ నెంబర్ కూడా 9 అని చెబుతున్నారు. ముందుగానే డిక్లరేషన్ లు ప్రకటించడానికి కూడా ఒక కారణం ఉంది. 2018 ఎన్నికల్లో మేనిఫెస్టో ఆలస్యం కావడంతో పార్టీ హామీలు జనంలోకి వెళ్లక ఓడిపోయామంటున్నారు. అందుకే ఈ సారి జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. వరస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక గెలుపు కొత్త ఊపునిచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు సమన్వయంతో, సహకారంతో మంచి ఫలితాలు సాధించారు. అక్కడి నేతలు చాలా పరిపక్వతతో వ్యవహరించారు. ఎవరూ ఏకపక్ష నిర్ణయాలకు ఒంటెద్దు పోకడలకు వెళ్లకుండా సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి కాంగ్రెస్ విజయం కోసం కష్టపడ్డారు. అందుకే కర్ణాటక ఫార్ములా తెలంగాణలో అమలు చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విభేదాలు బయట పడుతున్నాయి. రేవంత్ ను ఏకాకిని చేసేందుకు కొందరు సీనియర్లు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. కొందరు నేతలు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వారిని దారికి తీసుకురాగలిగితే జనాన్ని తమ వైపుకు తిప్పుకోవడం కష్టమేమీ కాదని కాంగ్రెస్ పెద్దల నమ్మకం. అప్పుడే మేనిఫెస్టోలో అంశాలు జనంలోకి వెళ్తాయి.