సీనియర్ నేతల సరికొత్త రాజకీయ వ్యూహం

By KTV Telugu On 10 March, 2023
image

 

జీవితాంతం రాజకీయాల్లో ఉండి పదవులు అనుభవించి ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమకు సీటు రాదేమోనన్న అనుమానంతో ముందస్తుగానే కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తమ స్థానంలో తమ పిల్లలకో వారసులకో టికెట్ ఇస్తే తాము గెలిపించుకుని ఆనక రిటైర్ అయి ప్రశాంతంగా జీవిస్తామని పార్టీ నాయకత్వానికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అయితే వీరి గోడును పార్టీ అధిష్టానం ఏ మేరకు మన్నిస్తుందో చూడాలంటున్నారు రాజకీయ పండితులు.

రాజకీయ నాయకులు సూపర్ సీనియర్లు అయ్యాక తమ వారసుల్ని బరిలోకి దించుతారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా పలువురు సీనియర్ నేతలు తమ కుమారులు, కుమార్తెలు, కోడళ్ళను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా గ్రౌండ్‌ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటి నుండే ఆ వారసులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ క్యాడర్ కు సంకేతాలు ఇస్తున్నారు. వారసులను పోటీకి దించాలని భావిస్తున్న సీనియర్ నాయకులు ఈ విషయాన్ని అధిష్టానం చెంతకు చేరవేస్తున్నారు. తాము తప్పుకుని యూత్‌కు అవకాశం ఇద్దామని అనుకుంటున్నట్లు హైకమాండ్‌కు చెప్పేశారని ప్రచారం సాగుతోంది. టీ కాంగ్రెస్ లో వచ్చే ఎన్నికల్లో బరిలో దిగడానికి సిద్దంగా వున్న వారసుల లిస్ట్ భారీగానే వుంది.

నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో తన ఇద్దరు కుమారులను పోటీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. లేదంటే ఒక్కరికైనా సీటు ఇప్పించాలనుకుంటున్నారు. పెద్ద కుమారుడు రఘువీర్‌కు మిర్యాలగూడ టికెట్ ఇప్పించేందుకు జానారెడ్డి ట్రై చేస్తున్నారు. తాను పోటీ చేయకుండా నాగార్జున సాగర్ టికెట్ చిన్న కుమారుడు జైవీర్ కు ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారట. కుమారుడు సూర్యకు పినపాక టికెట్ కోసం ములుగు ఎమ్మెల్యే సితక్క లాబీయింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే పినపాక నియోజకవర్గంలో సూర్య విస్తృతంగా పర్యటిస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తన కుమార్తె జయా రెడ్డిని మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయించే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే జయారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ జగ్గారెడ్డి వారసురాలిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ కుమారుడు సాయి శంకర్ నాయక్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా వున్న సాయి శంకర్ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం లేదా ఇల్లెందు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ పరకాల లేదా వరంగల్ తూర్పు నుండి పోటీ చేసేందుకు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష సైతం తండ్రి వారసత్వం అందుకుని మెదక్ పార్లమెంటు లేదా ఆంధోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కుమారుడు దీపక్ వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి లేదా అలంపూర్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారట.

మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పెద్ద కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతుండగా చిన్న కుమారుడు అరవింద్ యాదవ్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి బరిలో వుండేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి గీతారెడ్డి కుమార్తె మేఘన వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి లేదా మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కొడంగల్ నియోజకవర్గం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితో రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి కాకుండా వేరే నియోజకవర్గం నుండి పోటీ చేస్తే కొడంగల్ నుండి తిరుపతి రెడ్డి బరిలో వుంటారని లేకపోతే నారాయణపేటలో పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల కోడలు వైశాలి జనగామ, పాలకుర్తి టికెట్ రేస్ లో వున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీ.కాంగ్రెస్ నేతల వారసుల కోరిక తీరుతుందా తమ వారసులను ఎన్నికల్లో నిలబెట్టి చట్టసభల్లో చూసుకోవాలని ఆశపడుతున్న సీనియర్ నేతల ఆకాంక్షలు నెరవేరుతాయా కుటుంబానికి ఒకే టిక్కెట్‌ అంటున్న కాంగ్రెస్ హైకమాండ్‌ ఈ వారసుల కోరికలను ఎలా తీరుస్తుందో చూడాలి.