సిద్దిపేటలో ఇప్పుడు హరీష్ రావు, కేసీఆర్ మధ్య పోటీ జరిగినా హరీష్ రావే గెలుస్తారు అని.. రాజకీయాల్లో పండిపోయిన ఓ నేత కొన్నాళ్ల కిందట జోస్యం చెప్పారు. ఇది కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది కానీ. సిద్ధిపేట గురించి.. అక్కడి రాజకీయం గురించి తెలిసిన వారికి మాత్రం నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే.. కేసీఆర్ కంటే ఎక్కువగా అక్కడి ప్రజలపై తనదైన ముద్ర వేశారు హరీష్ రావు. ఎమ్మెల్యే అంటే తనలానే ఉండాలని వారితో అనిపించారు. తాను చేసేదే అభివృద్ధి అని అందరితో అనిపిస్తారు. అభివృద్ధి అంటే.. మంచి రోడ్లు.. అందరికీ నీళ్లు ఇలాంటివే కాకుండా.. ప్రజల ఆర్థిక స్థోమత పెంచే విధంగానూ కృషి చేశారు. అక్కడి ప్రజల్లో ఆయన ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందంటే.. ఎప్పుడు పోటీ చేసినా 75 శాతం ఓట్లు ఖాయంగా వస్తాయి. మిగిలిన ఓట్లను ఇతర పార్టీలు పంచుకుంటాయి. హరీష్ రావు అంత బలంగా సిద్దిపేటలో పాతుకపోవడానికి కారణం ఏమిటి ? ఆయనను ఓడించడానికి విపక్షాలు ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ?
సిద్దిపేట నుంచి 1983లో మొదటి సారి కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే మరో రెండేళ్లకే వచ్చిన ఎన్నికలతో కేసీఆర్ తన విజయ ప్రస్థానం ప్రారంభించారు. 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటి సారి గెలిచిన ఆయన తెలంగాణ సాధన కోసం ఢిల్లీ రాజకీయాలకు వెళ్లాలనుకున్న వరకూ గెలుస్తూనే వచ్చారు. ఎప్పటికప్పుడు తన మెజార్టీ పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ సీటును.. తన మేనల్లుడు అయిన హరీష్ రావుకు అప్పగించారు. మొదటి సారి 2004 ఉపఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన హరీష్ రావు.. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మరో ఏడాదికి రెండు దశాబ్దాలుగా అక్కడ ఎమ్మెల్యేగా నిరంతరాయంగా గెలుస్తూ వస్తున్నట్లు అవుతుంది. ఇప్పటికీ ఆయనను ఓడించే శక్తి లేదని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి.
ఎమ్మెల్యేగా హరీష్ రావు సిద్దిపేట ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తున్నారు. పిలిస్తే పలికే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. హరీష్ రావు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కొన్నాళ్లు మంత్రిగా ఉన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ పోరాడుతూనే ఉన్నారు. అయితే నియోజకవర్గ ప్రజల్ని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అక్కడి ప్రజలకు ఎంత భరోసా ఇచ్చారంటే.. ఓ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తే చాలు సమస్య పరిష్కరిస్తారన్న నమ్మకాన్ని ఏర్పర్చుకున్నారు. స్మార్ట్ ఫోన్ల విజృంభణ లేని రోజుల్లో కాయిన్ బాక్స్ ఫోన్ కాల్స్‌కు స్పందించేవారు. ఇప్పుడు జనం వాట్సప్‌లోకి వస్తున్నారు. అర్థరాత్రి.. అపరాత్రి వేళ ఏ ఆపద వచ్చినా.. మంత్రి హరీశ్‌కు వాట్సప్‌కు ఒక పోస్టు పెడితే చాలు. ఆపన్నహస్తం అందుతుంది. ప్రజలకు సాయం చేయడంలో హరీష్ రావు శైలి భిన్నంగా ఉంటుంది. ఇది ఆయనతో ఓటర్లకు వ్యక్తిగత అనుబంధం పెంచిందని చెప్పుకోవచ్చు. ఇందు కోసం హరీష్ రావు పని తనం భిన్నంగా ఉంటుంది. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కనీసం 20 మందినైనా పేర్లు పెట్టి మరీ పిలుస్తారు. స్థాయి, భేదం మరిచిపోయి పల్లె జనంతో కలిసిపోతారు. వాళ్లతో మాట కలుపుతారు. రైతులు, కూలీలు, సాధారణ జనం గుండె లోతుల్లోంచి మాట్లాడుతారు.
నియోజకవర్గంలో హరీష్‌రావుకు కార్యకర్తల మధ్య మధ్యవర్తులు ఉండరు. ప్రతి కార్యకర్తను ఆయన నేరుగా కలుస్తారు. ప్రధాన అనుచరులు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు హరీష్‌రావుకు చేరవేస్తారు. ప్రతి విషయాన్ని ఆయన ఆసక్తితో తెలుసుకుంటారు. అయితే ఎంత మంది ఫోన్ చేసినా స్పందించడానికి హరష్ కూడా మానవమాత్రుడే కాబట్టి.. చివరికి తాను ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. పేద కార్యకర్తలు పెళ్లి కార్డు ఇస్తే భోజనం కోసం బియ్యం పంపడం అతని సంప్రదాయం. సభలు జరిగినప్పుడు కార్యకర్తల మధ్య కూర్చోవడం ద్వారా వారికి క్రమశిక్షణ పాఠాలను పరోక్షంగా చెప్పేస్తారు. ఎవరు శుభకార్యానికి పిలిచినా వెళతారు. ఎంత బిజీగా ఉన్నా… టైం లేదు అనే సాకు మాత్రం కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పరు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ.. హరీష్ రావు ఎంతో.. కార్యకర్తలందరికీ హరీష్ రావు అంతే.
కార్యకర్తల్ని బాగా చూసుకున్నంత మాత్రాన ఓట్లేస్తారా ? మరి సామాన్య ప్రజల సంగతేమిటి ? అంటే.. సిద్దిపేట ప్రజల ఆర్థిక వనరుల్ని పెంచడానికి రాష్ట్రంలో ఏ పథకం పెట్టినా అత్యధిక లబ్ది తన నియోజకవర్గ ప్రజలకు కల్పించడానికే హరీష్ ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థికంగా కుటుంబాల్ని బలవంతుల్ని చేయడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు.
సిద్దిపేట నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయక నియోజకవర్గం. అయితే సాగు పరిస్థితులు ఎలా ఉంటాయో అందరకీ తెలుసు కాబట్టి.. హరీష్ రావు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామాల్లో ప్రజల ఆర్థిక వనరులు పెంచేందుకు కృషి చేశారు. పాడి యూనిట్లు, చిన్న తరహా పరిశ్రమలు సహా.. స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 85 పంచాయతీలు ఉన్నాయి .ఏ పంచాయతీకి వెళ్లినా కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. ప్రతి గ్రామానికి డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, నర్సరీ, ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, రైతు వేదిక ఉంటాయి. ప్రజలు స్వయం ఉపాధి పొంది.. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వ పరంగా ఉండే పథకాలన్నింటినీ సిద్దిపేట ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 85 పంచాయతీలకు గాను కేంద్రం ఇచ్చే అవార్డులు 60 పంచాయతీలకు లభిస్తాయి. ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్చకు ప్రాధాన్యం ఇస్తారు. యువజన సదస్సులు, ప్రభుత్వ పాఠశాలలో యోగ తరగతులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి ముందు ఓ వేప చెట్టు పెంచడాన్నిప్రోత్సహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, అదనపు బోధన ఏర్పాటు చేశారు. మహిళా గ్రామ సభల నిర్వహణ, యువత సన్మార్గంపై చైతన్యం వంటివి చేపడతారు. ప్రజలను ఆర్థికంగా మెరుగుపరిస్తే మనల్ని మర్చిపోతారని రాజకీయ నేతలు అనుకుంటూ ఉంటారు. కానీ హరీష్ మాత్రం..తనను మర్చిపోకుండా అందర్నీ అభివృద్ధి చేస్తున్నారు.
గ్రామాలే కాదు.. నియోకవర్గం మొత్తం ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత ప్రాధాన్యత తన సొంత నియోజకవర్గానికి ఇస్తారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్న సమయంలోనూ తన లాబీయింగ్‌లో నిధులు తెచ్చుకుని సిద్ధిపేటను అద్భుతంగా తీర్చిదిద్దారు. సిద్దిపేట పట్టణం రాష్ట్రంలో సీఎం నియోజకవర్గంకన్నా అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అభివృద్ధి, ఆహ్లాదాలకు ఈ ఊరు అడ్డాగా మారింది. సెంటర్లలో ఏర్పాటు చేసిన అందమైన ఆక్షరణీయమైన కట్టడాలు ప్రజల మనసు దోచుకుంటుకున్నాయి. లైఫ్‌స్టయిల్ మార్పుకి సింబాలిక్‌గా మారింది సిద్ధిపేట పట్టణం. ఆహ్లాదాన్ని పంచే పార్కులే కాదు అద్భుతమైన డిజైన్లకు కేరాఫ్‌గా మారింది. అందమైన ఆహ్లాదకరమైన పట్టణంగా తీర్చిదిద్దాలన్న మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా మున్సిపాలిటీ, సుడాలు పట్టణంలో పలు సుందరీకరణ పనులు చేశారు. ప్రధాన సర్కిల్లో ఏర్పాటు చేసిన డాల్ఫిన్, సీతాకోకచిలుక, నెమలి బొమ్మల ఆకృతులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ల్యాండ్ స్కేప్ గ్రాస్‌తో పచ్చదనం సంతరించుకునేలా ఏర్పాటు చేసి, సర్కిల్ చుట్టూ రేడియం వర్క్ చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ ఫౌంటెన్ల ద్వారా నీటిని వివిధ రంగులతో కనిపించేలా విరజిమ్ముతూ చౌరస్తాలు అందంగా ఆకర్షణీయంగా మారాయి. హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన అందాల డిజైన్లు తమ ప్రాంతంలో కనువిందు చేయడం ఆనందంగా ఉంటుందంటున్నారు ప్రజలు. ఇప్పటికే కోమటి చెరువుపై రోప్సైక్లింగ్ , కదిలే వంతెన సౌకర్యాలు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సిద్దిపేటను.. ఏ కోణంలోనూ వదలకుండా అభివృద్ధి చేశారు హరీ్ రావు.
ప్రజల్ని ఆదరిస్తారు.. కార్యకర్తల్ని గౌరవిస్తారు.. అభివృద్ధి చేస్తారు.. అన్నీ ప్లస్ పయింట్లేనా ? హరీష్ రావుకు మైనస్ పాయింట్లు లేవా ?. ఆయనను ఓడించలేరా ?
రాజకీయాల్లో గెలుపునకు అభివృద్ధి ప్రాతిపదిక కాదు. కానీ హరీష్ రావు మార్క్ రాజకీయంలో అదే ప్రాతిపదిక అయింది. అదే సమయంలో హరీష్ రావు తన మార్క్ రాజకీయం చేశారు. ప్రత్యర్థిని ఎక్కడా ఎదగనీయలేదు. ఎంత బలవంతుడికైనా … బలమైన ప్రత్యర్థి ఉంటే.. ఆటోమేటిక్ గా గట్టి పోటీ ఉంటుంది. తన నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా ఏ ఒక్క నాయకుడ్ని ఎదగకుండా చేయడంలో హరీష్ రావు వందకు వంద మార్కులు సాధించారు. సాధారణంగా నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా ఉండాలంటే తన పార్టీలోనే పోటీ లేకుండా నేతలు చూసుకుంటూ ఉంటారు. కానీ హరీష్ రావు భిన్నమైన రాజకీయ నాయకుడు. ఇతర పార్టీల్లోనూ నేతలు ఎదగకుండా చూస్తారు. ఎదుగుతారు అనుకున్న వారిని అప్పటికప్పుడు నియంత్రించేస్తారు. దానికి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తారు. ఫలితంగా సిద్దిపేట నుంచి ఓ ప్రముఖ నేత రాష్ట్ర రాజకీయాల్లోకి రాలేదు.
సిద్దిపేట నియోజకవర్గం హరీష్ రావుకు పుట్టుకతో కంచుకోట కాదు. దాన్ని ఆయన అలా మార్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ పోటీ చేసినా హరీష్ రావే గెలుస్తారన్నతంగా పట్టు సాధించారు. ఇది ఆయన నాయకత్వ లక్షణం. కానీ నిజంగా కేసీఆర్ పోటీ చేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. కేసీఆర్ కాదు.. హరీష్ కు తగ్గనేత అని భావించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తారు. ఇటీవల హరీష్ రావుపై ఆగ్రహంతో .. మైనంపల్లి హన్మంతరావు సిద్దిపేటనూ హరీష్ సంగతి చూస్తానని హెచ్చరించారు. హనుమంతరావు కూడా మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తే. అంత ఆషామాషీగా ఆయన ఆ మాటలు మాట్లాడరు. ఖచ్చితంగా హరీష్ రావు అక్కడ వంద శాతం అజేయడు కాదు.. ఇప్పుడున్న రాజకీయాల్లో మాత్రం అజేయుడు. ఇతర పార్టీలు సిద్దిపేటపై ఆశలు వదిలేసుకున్నాయి. అందుకే హరీష్ రావు మొదటే గెలుస్తున్నారు. అలా కాకుండా ఒకే నేతను ప్రోత్సహించినట్లయితే .. ఫైర్ ఉన్న లీడర్ అక్కడ దృష్టి పెట్టినట్లయితే.. ప్రజల్లో మార్పు వస్తుంది. కానీ ఆ వచ్చే నాయకుడు హరీష్ రావు కన్నా ప్రజల్లో ఎక్కువ నమ్మకం కలిగించగలగాలి.
సిద్దిపేట ప్రజలు ఇప్పుడు ఓ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. హరీష్ రావు కాకపోతే మరెవరు అనే ప్రశ్న వస్తే వారికి సమాధానం దొరకడం లేదు. అలాంటి సమధానం దొరకకుండా హరీష్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఉన్నంత కాలం ఆయనను ఓడించడం అసాధ్యం కావొచ్చనేది రాజకీయవర్గాల విశ్లేషణ.
రాజకీయాల్లో గెలుపోటములు ప్రత్యర్థుల్ని బట్టే ఉంటాయి. ఓ బలమైన నేతపై పోటీ పడాలంటే.. అంతకంటే ఎక్కువ బలమైన నేత ఉండాలి. అలాంటి నేత వచ్చే వరకూ హరీష్ రావు.. గెలుస్తూనే ఉంటారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…