మంత్రి తలసాని కుమారుడికి ఈడీ నోటీసులు

By KTV Telugu On 22 November, 2022
image

తెలంగాణలో ప్రస్తుతం పోటాపోటీ దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇటు సిట్‌ దర్యాప్తు.. అటు ఈడీ దర్యాప్తు… ఇది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బృందం. రెండూ వేరు వేరు కేసులే అయినా కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య కాక రేపుతోంది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నమోదైన కేసును సిట్‌ సీరియస్‌గా దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ తో పాటు కేరళలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్యుడు డా.జగ్గుస్వామి కేరళలోని భారత్‌ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్‌ వెల్లాపల్లి, కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లు విచారణకు రావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో వీరి వాంగ్మూలాల నమోదు కీలకం కానుంది. అయితే కేవలం న్యాయవాది శ్రీనివాస్‌ ఒక్కడే విచారణకు హాజరయ్యారు.

ఆయనకు స్వామీజీతో ఉన్న సంబంధాల గురించి హైదరాబాద్‌కు ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేయడం గురించి అధికారులు ప్రశ్నించారు. కొంతకాలంగా సింహయాజితో తాను పూజలు చేయించుకుంటున్నానని పూజల కోసమే టికెట్‌ బుక్‌ చేశానన్న చెప్పారు శ్రీనివాస్‌. ఇదే సమయంలో చికోటి ప్రవీణ్ కేసినో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. నేపాల్ లో బిగ్ డాడీ పేరుతో నిర్వహించిన కేసినోకు వెళ్లినట్టుగా భావిస్తున్న వారికి వరుసగా నోటీసులు పంపుతూ విచారణ చేస్తోంది. ఇదే అంశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్ ఈ రోజు ఈడీ ముందు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ విచారణకు హరీశ్ హాజరయినట్టు సమాచారం.

తలసాని సోదరులు తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లు కూడా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించారు. ఈడీ విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మొత్తానికి అటు సిట్‌, ఇటు ఈడీ పోటాపోటీ విచారణతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల్లో అలజడి మొదలైంది. ఈ విచారణ పేరుతో ఎవరెవరిని పిలుస్తారో అని భయం పట్టుకుంది.