తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారేమో అని అనుమానంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అన్నారు. తన వద్ద పెండింగ్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన బిల్లుల గురించి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ బిల్లులను తానే ఉద్దేశపూర్వకంగా ఆపానని ప్రభుత్వం తప్పుగా ప్రచారం చేస్తోందని అన్నారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. వాటిలో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. కొత్త రిక్రూట్’మెంట్ బోర్డు అంశంలో క్లారిటీ కావాలని ప్రభుత్వాన్ని వివరణ అడిగానని చెప్పారు. అంతమాత్రానికే తాను ఆ బిల్లును ఆపానని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డు పెడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది తన సందేహమని అన్నారు.
ఫామ్ హౌస్ కేసులోనూ రాజ్ భవన్‌ను లాగాలని చూశారని గవర్నర్ ఆరోపించారు. తుషార్ గతంలో నా ఏడీసీగా పని చేశారని.. తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో తీసుకొచ్చారని అన్నారు. ఆయన తన ఏడీసీగా పని చేసినంత మాత్రానా రాజ్ భవన్‌ను ఈ కేసులోకి లాగుతారా అని ప్రశ్నించారు. రాజ్ భవన్ ముందు ఆందోళన చేసేలా విద్యార్థి జేఏసీ ని ఎవరు రెచ్చగొడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లాగా రాజ్ భవన్ గేట్లు మూసివేయలేదని తమిళిసై అన్నారు. ఎవరొచ్చినా ఎంత మందొచ్చినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ వివరించారు. అంతకుముందు కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై వివరణ ఇవ్వాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ లేఖ రాశారు. అపాయింట్మెంట్ లభించగానే గవర్నర్‌ను కలిసి బిల్లుపై సందేహాలు నివృత్తి చేస్తామని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.