సీఎం కేసీఆర్‌పై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు

By KTV Telugu On 26 January, 2023
image

రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని అన్నారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది అన్నారు గవర్నర్. వైద్యం, ఐటీ రంగాల్లో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ అనుసంధానమై ఉందన్నారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్‌ రైలును కేటాయించిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోందన్నారు.

గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భనన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వారిలో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తుందని గవర్నర్‌ తమిళిసై వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పరోక్షంగా సీఎం కేసీఆర్‌కు చురకలంటించారు. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. కొందరికి నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తానంటూ కామెంట్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ విశేషమైన సహకారం అందిస్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. పనిలో పనిగా సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు గవర్నర్. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని నేషనల్ బిల్డింగ్‌ను అభివృద్ధి అంటారని గుర్తు చేశారు. కొందరికి ఫామ్ హౌస్‌లు కాదు అందరికి హౌస్‌లు ఉండాలి అన్నారు.

మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదని అన్నారు తమిళిసై. రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని అన్నారు. తెలంగాణతో తనకున్నది మూడేళ్ల అనుబంధం కాదని పుట్టుకనుంచే ఉందని అన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలను గర్తు చేశారు. కొంతకాలంగా ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య అంతరం పెరిగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా కారణంగా పరేడ్‌ గ్రౌండ్‌లో రిపబ్లిక్‌ వేడుకలు నిర్వహించడం వీలుకాదాని రాజ్‌భవన్లోనే నిర్వహించుకోండని ప్రభుత్వం గవర్నర్ కార్యర్శికి లేఖరాసింది. అయితే పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు నిర్వహించాల్సిందేనంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో రాజ్‌భవన్‌లో రిపబ్లిక్‌ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరుకాలేదు.