బీజేపీ, కాంగ్రెస్ సమర్పించు ట్యాపింగ్ రాజకీయం – Tapping Politics

By KTV Telugu On 29 March, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ట్యాపింగ్ హాట్ టాపిక్ అవుతోంది.   విచారణలో ప్రణీత్ రావు ఏం చెబుతున్నారో కానీ..  బయట జరిగే ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో ఉంది. నిన్నటిదాకా కాంగ్రెస్ అయితే ఇప్పుడు బీజేపీ కూడా జత కలుస్తోంది. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటోంది. బీజేపీ ఆరోపణ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. కేంద్రం మీద ఉన్న ట్యాపింగ్ ఆరోపణలు.. నిఘా ఆరోపణలు.. పెగాసస్ వ్యవహారం కళ్ల ముందుకు వస్తుంది మరి. తెలంగాణ వరకూ కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై దాడికి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకుంటున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో బయటకు కనిపించని కాంబినేషన్లు వర్కవుట్ అవుతున్నాయి.  ఉప్పు నిప్పుగా ఉన్నట్లుగా కనిపించే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక కలిసి పని చేస్తున్నట్లుగా దృశ్యం ఆవిష్కృతమవుతోంది.  బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ బాధిత పార్టీలే అన్న విషయం బయటపడుతోంది. రోజులు గడిచేకొద్ది ట్యాపింగ్ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ విషయమై రేవంత్ రెడ్డి ఇప్పటివరకు నోరుమెదపలేదు. అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీయార్ పాలనసైనే పదేపదే ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. కానీ ఇప్పటి వరకు  బయటకువచ్చినవన్నీ నిరూపణ కాని విషయాలే.

కేంద్రమంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండ్ కో మాత్రం ట్యాపింగ్ లో కీలక నిందితుడు కేసీయారే అని గట్టిగా ఆరోపిస్తున్నారు. కిషన్ రెడ్డితో పాటు మెదక్ ఎంపీ అభ్యర్ధి రఘునందనరావు కూడా కేసీయార్, హరీష్ రావు, కవితలపై కేసులు నమోదుచేసి విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా ట్యాపింగ్ అంశంలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడిని తానే అంటున్నారు. అంటే ట్యాపింగ్ అంశంలో కేసీయార్ కు వ్యతిరేకంగా తమతో పాటు రేవంత్ ను కూడా బీజేపీ కలుపుకుంటోందనే అనుకోవాలి. కిషన్ మీడియాతో మాట్లాడుతు తమపార్టీలో ప్రతి ఒక్కరి ఫోన్నును కేసీయార్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని మండిపడ్డారు. రియాల్టర్లు, వ్యాపారస్తులతో పాటు పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించి బ్లాక్ మెయిల్ చేసినట్లు కిషన్ తీవ్రంగా ఆరోపించారు.

విచారణను పోలీసు అధికారుల పాత్రకే పరిమితం చేయకుండా కేసీయార్, హరీష్, కవిత, వెంకట్రామరెడ్డిపైన కూడా కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని కిషన్, రఘుతో పాటు కాంగ్రెస్ నేతలు పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు తనతో పాటు కుటుంబసభ్యుల ఫోన్లను కూడా కేసీయార్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని ఆరోపించారు.

ఏ విషయంలో అయినా కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధాలు ఎలాగుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఇపుడు ట్యాపింగ్ అంశంలో మాత్రం రెండుపార్టీల నేతలు కలిసి కేసీయార్ నే టార్గెట్ చేస్తున్నారు. అంటే కేసీయార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు కలిసినట్లుగానే చెప్పుకోవాలి. ఇప్పటివరకు ట్యాపింగ్ అంశంలో అరెస్టులు, విచారణ పోలీసు అధికారులకు మాత్రమే పరిమితమైంది. అలాంటిది తాజాగా మాజీమంత్రి యర్రబెల్లి దయాకరరావు పాత్రపైన కూడా ఆరోపణలు మొదలైయ్యాయి. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో పోటీచేసిన యర్రబెల్లి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన యశస్వినీ రెడ్డి ఆమె అత్త ఝాన్సీరెడ్డి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరిపైనా ఇలా ఆరోపణలు  రెండు పార్టీల నేతలు కలిసి చేస్తున్నారు.

బీజేపీపై గతంలో కేటీఆర్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. దేశంలో దాదాపు 10 వేల మందికిపైగా ఫోన్లలో పెగాసస్ ఉంది.  తమ విషయాలు అన్నీ మోడీ తెలుసుకుంటున్నారు.  కిషన్ రెడ్డి ఫోన్‌ను కూడా ప్రధాని మోదీ ట్యాప్ చేస్తున్నారు.. అని కేటీఆర్ ప్రకటించారు .  ఒక్క కేటీఆర్ కాదు..  ఇటీవల   మీ ఫోన్లపై దాడి చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లకు యాపిల్ నుంచి మెసెజులు వచ్చాయి .  అప్పుడు కూడా వివాదాస్పదమయింది. పెగాసస్ వాడిందని న్యాయమూర్తులు సహా ఎంతో మందిపై నిఘా పెట్టారని కొన్ని సంచలన కథనాలు వెలుగులోకి వచ్చాయి.  అప్పుడు కేంద్రం ఉలిక్కి పడింది. విచారణ చేయిస్తామని చెప్పింది.  కేంద్రం మాత్రమే కాదు.. బరితెగించిన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని  ఫోన్ ట్యాపింగ్.. హ్యాకింగ్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ హ్యాకింగ్ చాలా ఎక్కువగా ఉందని చాలా కాలం క్రితమే బయటపిడింది.  ఏపీలో అయితే  ప్రతిపక్ష నేతలపై కాకుండా సొంత నేతలపై నిఘా పెట్టారని.. కోటంరెడ్డి బయట పెట్టారు. తన ఆడియోను ట్యాపింగ్ చేసి రికార్డు చేసిన అంశాన్ని బయట పెట్టారు.   ఇంటలిజెన్స్ డీజీ సీతారామాజనేయులుపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. విపక్ష నేతలకు అసలు ప్రైవసీనే లేకుండా పోయింది.  వీరు ఇలా చేశారు.. రేపు మరొకరు వచ్చి అంతకు మించి చేస్తారు. ఈ ఘోరాలు… నిబంంధనల ఉల్లంఘనలు అలా జరుగుతూనే ఉంటాయి.  కానీ దొరికిన వారే దొంగ అన్నట్లుగా ఆ పనులు చేసిన వారు కలిసి రాజకీయాలు చేయడమే ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి