ఏమిటీ ట్యాపింగ్, ఎందుకీ ట్యాపింగ్, ఎలాగీ ట్యాపింగ్.. ఈ ప్రశ్నలకు వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో గింగురులు తిరుగుతున్నాయి. పాత్రధారులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తుంటే..అసలు సూత్రధారులు ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై ఇప్పటికే ఆరోపణలు రాగా.. ఆయన చేశారా.. చేయించారా..లేక ఆయన వెనుక ఉండి వేరే ఎవరైనా చేయించారా అన్న కోణంలో వేగంగా దర్యాప్తు జరగాలని బీజేపీ సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి…
ప్రణీత్ రావు ఒక్కరే కాదు.. చాలా మంది పోలీసు అధికారులు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్లు చేసిన అరాచకాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. విదేశాల్లో ఉన్న పోలీసు అధికారులను, మీడియా పెద్దలను రప్పించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్న తరుణంలో పాత్రధారులపై పూర్తి స్పష్టత పొందే ప్రయత్నం జరుగుతోంది. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న బయటకు వినిపిస్తున్న పేర్లు ఇవి మాత్రమే అయినా..తెరవెనుక ఉన్న అసలు జనం ఇంకా బయటకు రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా సాగించిన ఫోన్ ట్యాపింగ్‌లో తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్మెల్సీ పేరు వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ టూల్స్, రిమోట్ యాక్సెస్ టూల్ కొనుగోలుకు సదరు ఎమ్మెల్సీ కూడా నిధులను సమకూర్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సాయంతో ఎస్‌ఐబీలో టెక్నికల్ కన్సల్టెన్సీ సేవలు అందించే రవిపాల్ ద్వారా ఆ పరికరాలను తెప్పించారని తేల్చారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు.. సదరు ఎమ్మెల్సీ ఖర్చుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్సీ మాట పోలీసు విభాగంలో బాగా చెల్లుబాటయ్యేదని హోంశాఖలో చర్చ జరుగుతోంది. కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఆయన చెప్పిన పనిని చెప్పినట్లు చేయడానికి సిద్ధపడేవారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు సదరు ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చి, విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎస్‌ఐబీలో ప్రణీత్‌రావుకు రెండు గదులను కేటాయించి, 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్‌ట్యాపింగ్‌లు చేసినట్లు ఇప్పటికే దర్యాప్తులో తేలింది. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాల్లోనూ వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు రూఢీ అయ్యింది.
కేసీఆర్ వర్సెస్ రేవంత్ రేంజ్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కదలికలు, ఫోన్ సంభాషణలు వినేందుకు ఈ ట్యాపింగ్ నిర్వహించారు. ఆ పని బీఆర్ఎస్ వ్యవస్థాపకుడికి తెలుసని కూడా అధికార వర్గాల్లో వినిపిస్తున్న మాట….
ఓటుకు నోటు కేసులో రేవంత్ ను ఒక సారి జైలుకు పంపారు. అయినా ఆయనపై కసి తగ్గలేదని వీలైనన్ని కేసులు పెట్టేందుకు ప్రయత్నించారని టాక్. దానికి సంబంధించిన సమాచారం సేకరించేందుకు, రాజకీయంగా రేవంత్ కదలికలను పసిగట్టేందుకు కూడా ట్యాపింగ్ జరిగిందని కొత్తగా తెరపైకి వచ్చిన అంశం. ఇందు కోసం హైదరబాద్లోని రేవంత్ నివాసానికి దగ్గర్లోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ప్రణీత్ రావు తన కార్యకలాపాలను కొనసాగించారు. ట్యాపింగ్ పరికరాలను సమర్థంగా వినియోగించేందుకే రేవంత్ ఇంటి దగ్గర రూములు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇంట్లో అందరి ఫోన్లు ట్యాప్ చేశారని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆంతరంగిక సమాచారాన్ని కూడా సేకరంచలిగారని తెలుస్తోంది. దీని వెనుక రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి రమేష్ హస్తం ఉందని దాదాపుగా నిర్థారణకు వచ్చాయి. మరి కేసీఆర్ సంగతేమిటి అన్న ప్రశ్న తలెత్తుంది. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంత పకడ్బందీగా ట్యాపింగ్ జరిగి ఉండకపోవచ్చన్న చర్చ కూడా ప్రస్తావనకు వచ్చింది. సంతోష్ కు నోటీసులిచ్చి ప్రశ్నిస్తే కేసీఆర్, కేటీఆర్ రేంజ్ లో ఎంత ట్యాపింగ్ జరిగిందో కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కాస్త సాఫ్ట్ గా ఉన్నప్పటికీ, బీజేపీ ఊరుకునేందుకు సిద్ధం లేదు. ట్యాపింగ్ వ్యవహారంతో అవినీతి అంశం కూడా ముడిపడి ఉందని.. దీనిపై న్యాయవిచారణ జరిపితేనే నాటి సీఎం, డీజీపీ, ఉన్నతాధికారుల జోక్యం ఎంతనే విషయం బయటపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. బీఎల్ సంతోష్ లాంటి బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు….
ట్యాపింగ్ కేసులో హ్యండ్ ఉన్న ప్రతీ ఒక్కరినీ తక్షణమే పట్టుకుని జైలుకు పంపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ నేరుగానే కేసీఆర్ పై ఆరోపణలు చేస్తోంది. ట్యాపింగ్ ను ఆసరాగా చేసుకుని రియల్టర్లు, వజ్రాల వ్యాపారులు, సెలబ్రిటీలను బెదిరించినట్లు కూడా దర్యాప్తులో తేలింది. ఆ సంగతి కూడా త్వరగా తేల్చగలిగితే.. చాలా మంది అధికారులు,నేతలు జైలుకు వెళ్లడం ఖాయం. చూడాలి మరి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…