మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన లోక్ సభా నియోజకవర్గం అది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతమది. ఇప్పుడు అభివృద్ధికి పర్యాయపదంగా మారిన మెదక్ లో పార్టీల మధ్య వైరం తారా స్థాయికి చేరింది. బీఆర్ఎస్ ను కంచుకోటగా ఉన్న మెదక్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ నియోజకవర్గంలో గెలవడమంటే.. బీఆర్ఎస్ స్ట్రాంగ్ మేన్ హరీష్ రావును మట్టి కరిపించడమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….
లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రధాన పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. గత ఆరు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలవలేదు. ఈసారైనా కచ్చితంగా గెలుపుబావుటా ఎగరవేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. గెలుపుగుర్రం కోసం వడపోత ప్రారంభించింది. మెదక్ లో 1998 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ గెలుపొందలేదు. చివరిసారిగా ఎం. బాగారెడ్డి గెలిచారు. ఆ తర్వాత 1999లో బీజేపీ, 2004, 2009, 2014, 2014 ఉప ఎన్నికలతో పాటు 2019లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాంతో ఈసారి ఎలాగైనా మెదక్ లోక్ సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మిగిలిన స్థానాలతో పోలిస్తే మెదక్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ కు భిన్నమైన పరిస్థితులు సవాలు విరుసురుతున్నాయి. ఈ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. మెదక్ పరిధిలోకి సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, సిద్దిపేటకు మాజీ ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానితో బీఆర్ఎస్ కు మెదక్ కంచుకోటగా మారిన నేపథ్యంలో ఆ కోటకు బీటలు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మెదక్ నియోజకవర్గం కోసం చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల వెల్లువ తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వాళ్లు ఇప్పుడు మెదక్ వైపుకు చూస్తున్నారు..
కాంగ్రెస్ తరఫున మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు పోటీ పడుతున్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు సైతం అందాయి. టికెట్ కోరుతున్న వారిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన … లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా
సిద్దిపేటకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన బండారి శ్రీకాంతరావు, దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మద్దుల సోమేశ్వర్ రెడ్డిలు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మరో వైపు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా వున్నారు.
గతంలో రామాయంపేట, మెదక్ అసెంబ్లీ నియోజవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన హన్మంతరావు పేరును మల్కాజిగిరితో పాటు మెదక్ లోక్ సభ స్థానంలోనూ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. హరీష్ రావును దెబ్బకొట్టాలంటే తన వల్లే సాధ్యమవుతుందని హన్మంతరావు చెప్పుకుంటున్నారు. పైగా ఇద్దరి మధ్య చాలా కాలంగా వైరం ఉంది. హన్మంతరావు పలు పర్యాయాలు హరీష్ రావుపై ఆరోపణలు చేశారు…
ఒకవైపు మెదక్ పార్లమెంట్ స్థానంలో పాగా వేయడం, మరో వైపు మాజీ మంత్రి హరీశ్ రావు ను టార్గెట్ చేసేలా ద్విముఖ వ్యూహంతో మాజీ బిఅర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సన్నిధిలో హరీష్ రావుపై ఓ రేంజ్ లో ఆయన విరుచుకుపడ్డారు. మెదక్ ను ముంచేసి సిద్దిపేటను డెవలప్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు.చేతిలో చిల్లిగవ్వ లేని హరీష్ రావు ఇప్పుడు కోట్లకు పడగెత్తారన్నారు.హరీష్ రావు అంతుచూస్తానని హెచ్చరించారు. సిద్దిపేటలో నిద్రాణంగా పడున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హన్మంతరావు చుట్టూ తిరుగుతున్నారు. ఆయన్ను సిద్దిపేట పిలుచుకుని వచ్చి మీటింగులు పెడుతున్నారు. మెదక్ లోక్ సభా స్థానాన్ని మైనంపల్లికి కేటాయించాలని సిద్దిపేట నేతలు డిమాండ్ చేస్తున్నారు. మైనంపల్లి మాత్రమే హరీష్ రావును దెబ్బకొట్టగలరని అక్కడి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోని కాంగ్రెస్ నేతల్లోనూ అదే ఆలోచన ఉంది…
లోక్ సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలంటే మెదక్ లో గెలవడం తప్పనిసరి. గ్రామీణ నియోజకవర్గం నుంచి అర్బన్ గా మారుతున్న మెదక్లో జనం ఆలోచన కూడా మారుతోంది. అందుకే ఓటర్లు తమ వైపుకు వస్తారని హస్తం పార్టీ విశ్వసిస్తోంది. పైగా బీఆర్ఎస్ ఫ్యామిలీని మట్టి కరిపించేందుకు మెదక్ లో గెలవడం అనివార్యమన్న అభిప్రాయం కలుగుతోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…