ఫైనల్ టార్గెట్ కేసీఆర్

By KTV Telugu On 1 June, 2024
image

KTV TELUGU :-

ప్రత్యర్థిని బలంగా కొట్టాలి. లేవకుండా కొట్టాలి. అన్ని వైపుల నుంచి కొట్టాలి.రాజకీయంలో ఇదీ  ఎవరికైనా తొలి  పాఠం, మలి పాఠం కూడా. సీఎం రేవంత్ రెడ్డి ఇదే పాఠాన్ని రోజు వారీ చదువుతున్నట్లున్నారు. తన  చిరకాల ప్రత్యర్థి అయిన మాజీ సీఎం కే.చంద్రశేఖర్  రావును, ఆయన కుటుంబాన్ని మరోసారి రాజకీయాల్లో లేచి నిలబడకుండా దెబ్బకొట్టేందుకు  రేవంత్ వ్యూహరచన చేస్తున్నారు.అది ఫోన్ ట్యాపింగ్  కేసు అయినా, మేడిగడ్డ ప్రాజెక్టు అయినా, తెలంగాణ తల్లి విగ్రహమైనా సరే  ఎక్కడా కేసీఆర్ పేరు కనిపించకుండా చేయాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలపై విచారణలు మెరుపువేగంగా సాగుతున్న తీరు  రేవంత్ రెడ్డి ఆలోచనా విధానానికి దర్పణం పడుతున్నాయి…

తెలంగాణ రాజకీయం ఇప్పుడు విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి దాటిపోయింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు పోయి ప్రత్యక్ష కార్యాచరణ మొదలైంది. సీఎం రేవంత్  రెడ్డి ద్విముఖ వ్యూహాన్ని  అమలు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మార్కు ఎక్కడ కనిపించకూడదన్నది మొదటి వ్యూహమైతే, కేసీఆర్ నాటి అరాచకపాలనను ఎండగట్టి కోర్టుకీడ్వడం రెండోదని చెప్పాలి. కేసీఆర్ ఎంపిక చేసిన‌.. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం నుంచి రాష్ట్ర అధికారిక చిహ్నం వ‌ర‌కు.. స‌మూలంగా మార్పులు చేస్తున్నారు. ప్ర‌స్తుతం రేవంత్ ప్ర‌భుత్వం తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంలో మార్పులు చేయించింది. దానిని తొలినాళ్ల‌లో అప్ప‌టి సీఎం కేసీఆర్ ముచ్చ‌ట‌ప‌డి మ‌రీ.. చేయించుకున్నారు. దీనికి ఆయ‌న పెద్ద అధ్య‌య‌న‌మే చేయించారు. అనేక విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. మా త‌ల్లి మాయిష్టం అంటూ.. కౌంట‌ర్లు ఇచ్చారు. అంటే.. ఒక ర‌కంగా.. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని చూస్తే.. వెంట‌నే కేసీఆర్ గుర్తుకు వ‌స్తారు. ఇదే.. ఇప్పుడు మార్పున‌కు దారితీసింద‌నే.. వాద‌న వినిపిస్తోంది.ఇక‌, రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అధికార చిహ్నంలో ఓరుగ‌ల్లు కోట ముఖ చిత్రం ఉంది. ఇది రాజ‌కీయ వంశాల‌కు చిహ్న‌మ‌ని.. కాబ‌ట్టి తొల‌గిస్తున్నామ‌ని అన్నారు. అంతేకాదు.. ఇప్పుడు మ‌రిన్ని మార్పులు చేయిస్తున్నారు. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీనిని కూడా జూన్ 2 న ఆవిష్క‌రించనున్నారు. ఇప్పుడు దీనిలోనూ కేసీఆర్ జాడ‌లు క‌నిపించ‌వ‌నే వాద‌న వినిపిస్తోంది.ఇక కేసీఆర్ చేయని మరో పని రేవంత్ చేస్తున్నాయి. కేసీఆర్ చేద్దామనుకుని వాయిదా  వేసిన తెలంగాణ అధికారిక గీతాన్ని రేవంత్ రెడ్డి సిద్ధం చేయిస్తున్నారు. అందెశ్రీ రాసి, కీరవాణి  సంగీతం  అందించిన ఈ గీతాన్ని  జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆవిష్కరిస్తారు…

కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు  మంచి గేమ్ పాయింట్ గా  చెప్పుకోవచ్చు. ఆ కేసు విచారణను వేగవంతం చేయడంతో పాటు అందులో పలువురి పేర్లను వెల్లడించడం ద్వారా కేసీఆర్ ను అందరికీ శత్రువును చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు పత్రికాధిపతులు కూడా ఉన్నారు…..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావువాంగ్మూలాన్ని వ్యూహాత్మకంగా బయటపెట్టడం, మీడియాలో దానికి విస్తృత ప్రచారం కల్పించడం ఇప్పుడు కేసీఆర్ ను కార్నర్ చేయడానికేనని తెలుస్తోంది. పోలీసులను పావుగా వాడుకుని బీఆర్ఎస్ అధినేత అమలు చేసిన అనేక  ఎత్తులను వెల్లడించడం ద్వారా..  ఏకకాలంలో పలు వర్గాలపై కేసీఆర్ ఎలా కక్షసాధింపుకు ప్రయత్నించారో చెప్పకనే చెప్పారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనకు ముందు, ఆ  తర్వాత జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీంటినీ ఒకే వాగ్మూలంలో చేర్చడం ద్వారా కూడా కేసీఆర్ ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టారో గుర్తుకు తెచ్చారు. అందులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి కూడా ఉండటంతో మీడియాకు,  కేసీఆర్ కు ఉన్న పాత శత్రుత్వం మళ్లీ తెరమీదకు  తెచ్చినట్లయ్యింది. ఈ క్రమంలో మీడియాకు కేసీఆర్ పట్ల సింపథీ లేకుండా చేసినట్లవుతుందన్నది రేవంత్ రెడ్డి ప్లాన్. మొత్తం వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే కాకుండా మాజీ మంత్రి హరీష్ రావును కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పక తప్పదు. కేసీఆర్, కేటీఆర్ కంటే బీఆర్ఎస్ కేడర్లో హరీష్ రావు పవర్  ఫుల్ అని రేవంత్ రెడ్డి విశ్వసిస్తున్నట్లు సమాచారం…

మేడిగడ్డ వ్యవహారంలో కూడా రేవంత్  కాస్త వేగం పెంచారు. వరదలు వచ్చే  నాటికి మరమ్మత్తులు పూర్తిచేయాలని ఆదేశించడం  ద్వారా ప్రాజెక్టులో లొసుగులను రోజువారీ బయటకు తీస్తున్నారు.ఇన్ని లోపాలు ఉన్నాయా అని జనం చర్చించుకునే  అవకాశాన్ని కల్పించారు. దీనితో ఇప్పుడు కేసీఆర్ కు ఆయన పరివారానికి దిక్కుతోచడం లేదనే  చెప్పాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి