తెలుగుదేశం పార్టీ 41వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల గతిని మార్చేసిన తెలుగుదేశం పార్టీ మార్చేసింది. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్రనేతల్లో అత్యధిక మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వారే. ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఎక్కువ మంది టీడీపీ నుంచి పయనం ప్రారంభించిన వారే. అయితే తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం ఉనికి దాదాపుగా లేదు. కానీ ఇప్పుడు మళ్లీ తాము పూర్వ వైభవం సంపాదించుంటామని సభలు పెడుతున్నారు. అది సాధ్యమేనా.
ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. ఓ ప్రాంతీయ పార్టీ వరుసగా రెండు సార్లు ఓడిపోతే ఇక ఆ పార్టీ చరిత్రలో కలిసిపోవడమే. ఇప్పటికే ఎన్నో పార్టీలు అలా కలిసిపోయాయి. కానీ టీడీపీ మాత్రం వరుసగా రెండు సార్లు ఓడినా అత్యంత ఘోర పరాజయాలు చవి చూసినా ఎప్పటికప్పుడు ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వస్తూనే ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలోకి తెచ్చింది టీడీపీ. స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించినది తెలుగుదేశం. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీవీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం మునసబు వంటి ఫ్యూడల్ వ్యవస్థలను రద్దుచేసి బడుగు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేసింది తెలుగుదేశం. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు.
తెలుగుదేశం పార్టీ ఎదుర్కోని సంక్షోభం అంటూ లేదు. తొలి సారి పార్టీ గెలిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నాదెండ్ల భాస్కర్ రావు కారణంగా దెబ్బకు అధికారం కోల్పోయినంత పనైంది. అ తర్వాత ఎన్నికల్లో ఓటములు వచ్చాయి. అత్యంత ఘోరమైన ఓటములు వచ్చాయి. ఎన్టీఆర్ నుంచి టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది. ఈ మధ్యలోనే రాష్ట్ర విభజన కూడా జరిగింది. దీంతో చంద్రబాబు ఏపీకి పరిమితమయ్యారు. తెలంగాణకు నాయకత్వ సమస్య ఏర్పడింది. నిజానికి టీడీపీని లీడ్ చేయడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు ఉన్నారు. కానీ కేసీఆర్ కొట్టిన రాజకీయ దెబ్బలకు వారంతా చెల్లా చెదురు కావాల్సి వచ్చింది. దాంతో టీడీపీ తెలంగాణలో ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ఆంధ్రా పార్టీగా ముద్రవేయడంలో కేసీఆర్ అనూహ్య విజయం సాధించారు. ఆదే టీడీపీకి మైనస్‌గా మారింది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ తన పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో చంద్రబాబు మరోసారి వ్యూహాలు పన్నుతున్నారు. వెంటనే ముదిరాజ్ నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నియమించారు. వయసు రీత్యా ఇబ్బంది పడుతున్నా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీడీపీ ఊపందుకుంది. అనూహ్యంగా చేరికలు పెరిగాయి. ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించారు. లీడర్లు ఎవరూ లేకపోయినా క్యాడర్‌కు కొదవలేదని నిరూపించారు. హైదరాబాద్ నడిబొడ్డున సభ నిర్వహిస్తున్నారు. కొంత మంది సీనియర్లు తిరిగి రావొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆంధ్రాతోపాటు తెలంగాణపైనా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా రాజకీయంగా మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వరుసగా తమకు సానుకూలంగా ఉన్న జిల్లాలో పర్యటించి బలోపేతం చేయాలనే భావనలో ఉన్నారు. టీడీపీ నుంచి బలమైన నాయకులుగా ఉన్న వారు వేరే పార్టీలకు వలస వెళ్లినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో టీడీపీకి గతమెంతో ఘన చరిత్ర ఉంది. అంత మాత్రాన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చేసుకున్నందున ఇక టీడీపీని ప్రజలు ఆదరిస్తారని అనుకోవడానికి లేదు. ఎదుకంటే ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. టీడీపీ క్యాడర్ మొత్తం మూడు పార్టీల వైపు వెళ్లిపోయింది. వారు టీడీపీపై అభిమానం చూపించవచ్చు కానీ ఓటింగ్ వరకూ రాకపోవచ్చు. అప్పటి టీడీపీ నేతలు ఎక్కువ మంది బీఆర్ఎస్‌లో ఉన్నారు. అందుకే ఆ పార్టీకే ఎక్కువ మంది టీడీపీ ఓటర్లు వెళ్లారు. ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనడితేనే టీడీపీ బలపడుతుంది. టీడీపీ బలపడితే ఆటోమేటిక్‌గా బీఆర్ఎస్ బలహీనపడుతుంది కానీ అదంతా సులువు కాదు. కానీ రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు.