తెలంగాణ స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ

By KTV Telugu On 5 June, 2024
image

KTV TELUGU :-

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్లీ క్రియాశీలం కాబోతోంది. ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి లబ్ధిపొందే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి క్షేత్రస్థాయి బలం పుంజుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరుండి మరీ తెలంగాణ నేతలను ప్రోత్సహిస్తున్నారు….

పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జూన్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బీసీ రిజర్వేషన్ల విషయం తేలకపోవడం, కులగణనకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో తర్జన భర్జన పడుతోంది. కులగణన వివరాల ప్రకారం కాకుండా.. కేవలం ఓటరు జాబితాలో పేర్కొన్న కులాల వారీగా రిజర్వేషన్లను లెక్కగట్టి ఎన్నికలకు వెళ్తే.. కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరోవైపు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ పూర్తయితే ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అప్పటిలోగా కులగణనపైనా స్పష్టత వస్తుందని, అక్టోబరులో ఎన్నికలను నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో జరిగిన తెలంగాణ టీడీపీ సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జయకేతనం ఎగురవేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు.

ఏపీలో గెలుస్తామన్న ధీమా  టీడీపీలో కనిపిస్తోంది.  దానితో తెలంగాణలో కూడా విస్తరించాలన్న కోరిక బలపడుతోంది.పైగా ఏపీలో బిజీ అయ్యే లోపు తెలంగాణ శాఖను సెట్ చేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబును వెంటాడుతూ వచ్చింది. అందుకే పార్టీ తెలంగాణ శ్రేణులతో మీటింగ్ పెట్టారు. వారికి తొలి పరీక్షగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ఆదేశించారు….

అక్టోబరులో ఎన్నికలు అంటే ప్రిపరేషన్ కు కూడా మంచి సమయమే ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. పార్టీని అన్ని విధాలుగా డెవలప్ చేసేందుకు, పూర్వ వైభవం తెచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో కూడా చంద్రబాబు సమక్షంలో చర్చ జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ వెళ్లిపోయిన తర్వాత పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసే అంశం కూడా టీటీడీపీ మీటింగులో చర్చకు వచ్చింది.  తెలంగాణ‌లో పార్టీ ప‌ద‌వుల ప్ర‌క్షాళ‌న వంటివాటిపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. బలహీనతలను తొలగించుకోవాలని  ప్రయత్నిస్తున్నారు.  ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కూడా.. పార్టీలో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. త‌న‌కు చంద్ర‌బాబు గురువు కాదంటూ.. రేవంత్ రెడ్డి కొంత గ‌ట్టిగానే ఒక మీడియా ప్రతినిధికి స‌మాధానం ఇచ్చారు. దీంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు కూడా హ‌ర్ట్ అయ్యారు. రేవంత్ వాడిన  పదజాలం సహేతుకంగా లేదని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కాలగమనంలో అలాంటివి జరుగుతుంటాయని చంద్రబాబు వారికి సర్దిచెప్పారు. ఆ దిశగా ఆలోచించే బదులు పార్టీని బలోపేతం చేసే అంశాన్ని  పరిశీలించాలని సూచించడంతో నేతలు మెత్తబడ్డారు….

తెలంగాణలో టీడీపీ గెలిచి చాలా రోజులైనప్పటికీ రాష్ట్రంలో కేడర్ బలమున్న పార్టీగానే పేరుంది.  దిశానిర్దేశం చేసే వారు లేక పార్టీ కకావికలమైపోయిందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీని  వీడి వెళ్లిపోయిన కొందరు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న చర్చ ఊపందుకున్న మాట వాస్తవం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి