ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఆర్ అంటే రఘురామ కృష్ణరాజు అనే ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన 2019లో వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి సొంతపార్టీ వైసీపీపైనే యుద్ధం ప్రకటించి రోజు వారి రచ్చబండ నిర్వహించేవారు. జగన్ ను గద్దె దించేవరకు ట్రిపుల్ ఆర్ నిద్రపోలేదు. కట్ చేసి చూస్తే…ఇప్పుడు తెలంగాణలోనూ ఒక ట్రిపుల్ ఆర్ ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆయన పేరు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. తనకు ఎమ్మెల్సీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపైనే ఆయన ఆరోపణలు సంధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది…
బీఆర్ఎస్ హయాంలో తీన్మార్ మల్లన్న చాలా అగ్రెసివ్ గా ఉండేవారు. రోజు వారీగా ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఆయనపై కేసీఆర్ రెండు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఐనా మల్లన్న పట్టు వీడలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి మరింత పట్టుదలగా పనిచేస్తూ కేసీఆర్ పై యుద్ధం ప్రకటించారు. దానితో మల్లన్న అందరి దృష్టిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను పార్టీలో చేర్చుకున్న కొద్దిరోజులగా విజయం సాధించడంతో మల్లన్న అధికార పార్టీ సభ్యుడయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెటిచ్చి ఆయన్ను గెలిపించుకుంది. కాంగ్రెస్ పార్టీ అంత సాయం చేసినా మల్లన్న మాత్రం తన పాత బుద్ధులను మానుకోలేకపోతున్నారు….
మల్లన్నది ఉమ్మడి నల్గొండ జిల్లా. అక్కడి రాజకీయాల్లో తలదూర్చేందుకు మల్లన్న ప్రయత్నించారు. బీసీ మంత్రం పఠించే మల్లన్న అగ్ర కులాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నల్లొండ జిల్లాను ఆరు రెడ్డి కుటుంబాలు శాసిస్తున్నాయని వాటి అంత చూస్తానని మల్లన్న ఓ ప్రకటన చేశారు. ఈ సంగతి కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఏరి కోరి తెచ్చుకున్న నాయకుడు కావడంతో ఆయన్ను ఏమీ అనలేకపోతున్నారు..పైగా మల్లన్నకు బ్లాక్ మెయిలర్ అన్న పేరు కూడా ఉంది. తన యూ ట్యూబ్ ఛానెల్ ను అడ్డం పెట్టుకుని ఆయన పలువురు నేతలను బ్లాక్ మెయిల్ చేస్తారు..
పిలిచి ఆదరించిన సీఎం రేవంత్ రెడ్డి పట్ల మల్లన్న అమర్యాదకరంగా ప్రవర్తించారు… బీసీలకు రాజ్యాధికారం కోరుకోవడంతో తప్పులేదు. కాకపోతే ఆ మాట చెబుతూ మల్లన్న చేసిన కామెంట్స్ మాత్రం ఎవ్వరికీ రుచించలేదు, అందరి విమర్శలకు పాలయ్యారు. త్వరలో బీసీ ముఖ్యమంత్రి వస్తారంటే బావుండేది. ఆ మాటను వదిలేసి సీఎం రేవంత్ రెడ్డిని డైరేక్టుగా టార్గెట్ చేశారు. త్వరలో బీసీ నాయకులు సీఎం పదవిని చేపడతారని అంటే బావుండేది. ఆ సంగతి వదిలేసి.. తెలంగాణకు రేవంత్ రెడ్డే ఆఖరి అగ్రకుల సీఎం అని మల్లన్న ప్రకటించేశారు. దానితో రెడ్డి సామాజికవర్గంలో మల్లన్న పట్ల ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది…
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి టార్గెట్ గా మల్లన్న డైలాగులు వదులుతున్నారు. పొంగులేటి అత్యంత అవినీతిపరుడని ఆరోపించిన మల్లన్న, అసలు ఆయన దగ్గరకు ఎవ్వరినీ రానివ్వరని కూడా చెప్పారు. తెలంగాణలో కాంట్రాక్టులన్నీ పొంగులేటి చేస్తున్నారని, అవినీతి లేకుండా కాంట్రాక్టులు లేని పరిస్థితి తెచ్చారని మల్లన్న ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాను ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని కూడా మల్లన్న ప్రకటించేశారు.
మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందనే చెప్పాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీకి ఇబ్బంది కలిగే చర్యలేమీ చేపట్టకూడదని రాష్ట్ర అధినాయకత్వం నిర్ణయించింది. అందుకే మల్లన్నపై చర్యలు తీసుకోవడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి……
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…