కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ ?

By KTV Telugu On 28 April, 2024
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.   అమిత్ షా ఇలా ఆషామాషీగా ఆరోపించి ఉండరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రకాల ఆర్థిక సమస్యలున్నాయో అందరికీ తెలుసు.  అయినా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోరాడుతోంది. తమ ఖాతాలు ఫ్రీజ్ చేశారని నగదు లేకుండా చేశారని.. ఆరోపించిన  కాంగ్రెస్ ఇప్పుడు నింపాదిగా ఎ్నికల పోరాటం చేస్తోంది. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సపోర్టేనా ?

ఎన్నికలు అంటే ఎంత ఖర్చో చెప్పాల్సిన పని లేదు. అభ్యర్థులు ఎంత ఖర్చు అవుతుందో రాజకీయ పార్టీలకు అంత కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.  చాలా కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు  ఓ పెద్ద సవాల్ గా మారాయి. గెలవడం కాదు అసలు పోటీ చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు వారి దగ్గర లేకపోవడం అసలు సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో ఐటీ తమ ఖాతాలు ఫ్రీజ్ చేసిందని తమ దగ్గర డబ్బులు లేవని ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. కానీ ఇటీవలి కాలంలో వాటిని మర్చిపోయారు.  ఆర్థిక సమస్యలు లేకుండా  పోరాటం చేస్తున్నారు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది తెలియదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నుంచి వస్తున్న ఆర్థిక మద్దతుతోనే దేశమంతా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే  తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని  అమిత షా కూడా ఆరోపించారు.

ఎన్నికల్లో ఆర్థిక వనరులు సమకూర్చడం అంటే నేరుగా డబ్బు కట్టలు తీసుకెళ్లి ఇవ్వడం కాదు.  మొత్తం  అవసరాలు తీర్చేలా చేసుకోవడం. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవి చేపట్టినప్పటి నుండి వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయాల్లో పండిపోయిన వారికి అర్థమవుతుంది. ఆయన రాగానే శివబాలకృష్ణ అనే ఓ హెచ్‌ఎండీఏ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ గుట్టేమిటో బయటకు తెలిసింది చాలా తక్కువ. కానీ ఆయన చిట్టా బయటకు తీస్తే హైదరాబాద్ లో ఉన్న బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలన్నీ చిక్కుల్లో పడతాయి.  వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు వివాదాల్లో పడిపోతాయి. కానీ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. ఆ బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. తెర వెనుక ఏం జరిగింది ?.

ఇక ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు   మైహోమ్ సిమెంట్స్  భూదాన్ భూముల్ని ఆక్రమించిన వ్యవహారంపై నోటీసులు జారీ చేశారు. అలాగే మేఘా కంపెనీని పట్టుకోవాలే కానీ..తీగ లాగితే ఎన్ని వస్తాయో చెప్పాల్సిన పని లేదు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మేఘా కృష్ణారెడ్డి ఓ సారి రేవంత్ రెడ్డిని ఇంటికెళ్లి కలిశారు. ఈ వ్యవహారంపై చర్యలన్నీ ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. ఎందుకు ముందుకు కదలడం లేదు. తెర వెనుక ఏం జరిగింది ?

జరిగిన పరిణామాలకు..  సిద్దిపేటలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు లింక్ కలుపుకుంటే…  ఇక్కడ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి..తన మార్క్ రాజకీయం చేస్తూ… కావాల్సినంత సాయం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి చేరవేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.  అందుకే అమిత్ షా ఏటీఎం అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయా సంస్థలు ఆర్థిక సాయం చేయడం లేదని ఎవరైనా నమ్ముతారా. ?  అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని ఇలాగే రేవంత్ రెడ్డి సమకూరుస్తున్నారు.   దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది .. ముఖ్యంగా ఆర్థిక పరిపుష్టి ఉన్న రాష్ట్రాలు రెండే.. ఒకటి కర్ణాటక, రెండు తెలంగాణ. కర్ణాటక తోపాటు ఇప్పుడు తెలంగాణ కూడా సహకరిస్తూంటంతో కాంగ్రెస్ కు ఆర్థిక వనరులు అందుతున్నాయి. బీజేపీ నేతలు అదే చెబుతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి