తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆగస్టులో ముహుర్తం – కేసీఆర్

By KTV Telugu On 28 March, 2023
image

రాజకీయ పార్టీలంటే ఎన్నికలు గెలుపోటములే కదా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పార్టీలు నిత్యం వ్యూహాలను రచిస్తుంటాయి. విజయానికి కావాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటుంటాయి. ఈ దిశగా రెండు మూడు ప్రధాన పార్టీల మధ్య నిరంతర సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల పదవీకాలం అంటే ఈ ఏడాది డిసెంబరులోపు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. నిజానికి జనవరి నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీ కదలికలు కూడా ఆ దిశగా సంకేతాలిస్తున్నాయి.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడో నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆగస్టులో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన హితబోధ చేశారట. కేసీఆర్ మనసులో మాటను అర్థం చేసుకున్న పార్టీ నేతలు చాపకింద నీరులా పనిచేసుకుంటూ పోతే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాత్రం అసలు సంగతిని జనంలోకి వదిలారు. ఆగస్టుకు రెడీగా ఉండాలంటూ కేసీఆర్ చెప్పారని ఆయన ఆదేశాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని రెడ్యా నాయక్ అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో కేసీఆర్ ఈ మాటలు అన్నారట. పైగా బీజేపీ కూడా తొందరపడుతోందని ఎన్నికల దిశగా రాష్ట్రాన్ని పుష్ చేసే ప్రయత్నంలో ఉందని కేసీఆర్ వెల్లడించారట. అంటే రెండు పార్టీలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని కాంగ్రెస్ ఎప్పుడో ప్రకటించింది.

నిజానికి కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ హరీష్ రావు సహా మంత్రులంతా ఎప్పటినుంచో ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. ఆత్మీయ సమ్మేళలనాలు నిర్వహించడం కూడా కేడర్ ను సిద్దం చేసుకోవడం కోసమేనని చెబుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో కొన్ని బెడిసి కొడుతున్నా పార్టీ అందుకు వెనుకాడటం లేదు. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ నేతలను కొందరు కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించారని అంటున్నారు. అలాంటి వారిని గుర్తించి వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రగతి భవన్లోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లోపు కేసీఆర్ బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. కేడర్ జారిపోకుండా చర్యలు తీసుకోవడం మొదటి వ్యూహమంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే వేర్వేరు కోణాల్లో సర్వేలు చేయించారు. వాటన్నింటినీ విశ్లేషించి సమగ్ర నివేదిక త్వరలోనే తనకు అందించాలని కేసీఆర్ ఆదేశించారు. సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించి చాలా రోజులైంది. అయితే కొందరికి మొండిచేయి చూపించడం మాత్రం ఖాయమంటున్నారు. పని తీరు సరిగ్గా లేని వారికి మాత్రమే బయటకు దారి చూపిస్తారని వారికి కూడా సరిగ్గా ఎన్నికల ముందు మాత్రమే ఆ సంగతి చెబుతారని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్న లోటు పాట్లపై ఏప్రిల్ మొదటి వారం లోపు నివేదికలు రావాలని కేసీఆర్ ఆదేశించారు. దాని ఆధారంగా జూన్ మొదటి వారంలోపు తప్పులను సరిదిద్దే ప్రక్రియ పూర్తవుతుంది. 60 రోజుల వ్యవధిలో అన్ని వర్గాలను సంతృప్తి పరిచే ప్రక్రియను ఫైనలైజ్ చేయాలని గులాబీ దళపతి భావిస్తున్నారు.

కేసుల విషయంలో కూడా బెంగ వద్దని కేసీఆర్ తమ పార్టీ నేతలను ఆదేశించారట. కవితను అరెస్టు చేస్తారని కొందరు భయపడుతున్నారని అలాంటిదేమీ జరగదని చెప్పారట. కసికొద్దీ కవితను అరెస్టు చేస్తే బీజేపీకే నష్టమని కేసీఆర్ అంటున్నారట. ఇప్పటికే కక్షసాధింపు పార్టీగా బీజేపీకి దేశవ్యాప్తంగా పేరు వచ్చిందని ఇంకా తప్పులు చేసుకుంటూ పోతే వాళ్లకే నష్టమని అంటున్నారట చూడాలి మరి.