తెలంగాణ అసెంబ్లీపై కన్నేసిన ఎంపీలు

By KTV Telugu On 25 December, 2022
image

తెలంగాణలో ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయాలు తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. తెలంగాణ నుంచి లోక్‌సభ సభ్యులుగా ఉన్న పలువురు ఎంపీలు ఈసారి ఎంపీ పదవులపై ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మళ్లీ ఎంపీగా పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బండి సంజయ్ వేములవాడ లేదా కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటుగా మల్కాజ్ గిరీ పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారు. ఇకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ కిషన్ రెడ్డిని లోక్ సభకే పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే ఆయన కుటుంబ సభ్యులు అంబర్ పేట నుంచి పోటీ చేసే ఛాన్స్‌ ఉంది. ఇక భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటికే అనౌన్స్‌ చేసేశారు. నల్లగొండ జిల్లాకే చెందిన మరో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారని సమాచారం. నిజమాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి, అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోథ్‌, లేదా ఆసిఫాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా అసెంబ్లీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజేంద్రనగర్‌నుంచి, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత మరో చోటు నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇలా ఎంపీలందరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో ఆయా సీట్లలో పోటీచేయాలని ఎంతోకాలంగా ఆశలు పెట్టుకున్న నాయకుల్లో ఆందోళన పెరిగిపోతోంది.