కేసీఆర్ ఒకటి తలిస్తే కేంద్రం మరోలా ప్లాన్ చేస్తోందా. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని కేసీఆర్ పదేపదే చెబుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన వేరేగా ఉన్నట్లు కనిపిస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై సహజంగానే కొంత వ్యతిరేకత పెరిగింది. బీజేపీ దూకుడు పెంచింది. దీంతో పోయిన్సారిలా ఎన్నికలకు కేసీఆర్ తొందరపడటం లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ ఇష్టాయిష్టాలతో పనిలేకుండా షెడ్యూల్ కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు జరిగినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదన్నట్లుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.
కేసీఆర్‌కి తెలీకుండా జరగడంలేదు ఈ ప్రయత్నం. ఆయనకు ఈసీనుంచి సంకేతాలున్నాయి. బడ్జెట్ సమావేశాలను నెల ముందే నిర్వహించడం కూడా ముందస్తు సన్నాహాల్లో భాగమేనంటున్నారు. కేసీఆర్ వద్దన్నా ఆసక్తి లేదన్నా ముందస్తుగా ఎన్నికలు నిర్వహించే స్వేచ్ఛ ఎన్నికల కమీషన్‌కి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే కేసీఆర్‌కి పెద్ద సవాలే. ఎందుకంటే టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ స్థాయిలో హడావుడి చేయాలనుకుంటున్నారు కేసీఆర్. అందులో భాగంగా తెలంగాణలోని ఖమ్మంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌లో సభలు నిర్వహించారు. కేసీఆర్ జాతీయపార్టీకి ఇవింకా తొలి అడుగులే. ముందుస్తు ఎన్నికలు అనివార్యమైతే ఏడెనిమిదినెలలకు మించి సమయం ఉండదు. ఇక కేసీఆర్ జాతీయస్థాయిలో దృష్టిపెట్టి హడావుడి చేయడానికి అవకాశాలు లేనట్లే. ఎందుకంటే ఇంటగెలిచాకే రచ్చ గెలవాల్సి ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబరులో జరిగాయి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశాలను కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి అసెంబ్లీ సమావేశాలు 2019 జనవరిలో నిర్వహించారు. సాంకేతికంగా 2024 జనవరిదాకే అసెంబ్లీ కొనసాగే అవకాశం ఉంది. కానీ ఆలోపే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది కేంద్ర ఎన్నికల కమిషన్. బీఆర్ఎస్ దానికి సిద్ధంగా లేకున్నా ఈసీకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి ముందస్తు ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో ఈ రెండుమూడునెలల్లోనే కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేయొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
2023 సంవత్సరాంతంలో మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఉన్న అధికారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని అనివార్యంగా ముందస్తులోకి లాగేలా ఉంది. ఎందుకంటే మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించే విచక్షణాధికారం ఈసీకి ఉంటుంది. ఇదే అధికారంతో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా 2023లోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో ఉంది ఎన్నికల కమిషన్. ఈసీ మూడ్‌ని గమనించిన కేసీఆర్ కేంద్రం ఎత్తుగడను తిప్పికొట్టేందుకు అంతకంటే ముందే అసెంబ్లీని రద్దుచేసి ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు.