తెలంగాణ బీజేపీ పనైపోయినట్లే

By KTV Telugu On 31 May, 2023
image

తెలంగాణ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఒక్క సారిగా తిరగబడింది. నిన్నటిదాకా మా పార్టీలోకి వెల్లువలా వస్తారు. ఇంత మంది నాయకులు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ లాంటి నేతలు ప్రకటనలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మా పార్టీ నుంచి వారెవరూ వెళ్లడం లేదని చెప్పుకోవాల్సి వస్తోంది. అంటే ఎంతో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. తమపై జరుగుతున్న ప్రచారంపై చాలా మంది బీజేపీ నేతలు గుంభనంగా ఉన్నారు. ఖండించడానికి ఆసక్తి చూపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ బీజేపీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకూ తెచ్చి పెట్టుకున్న హైప్ అంతా క్రమంగా కోల్పోతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇలా చెప్పుకుంటూ పోతే నిన్నగాక మొన్న బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరు కూడా జంపింగ్‌ల జాబితాలోకి ప్రచారంలోకి వచ్చేసింది. ఇక పార్టీలో చేరిపోతారని చెప్పుకున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టమయింది. చివరికి చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వారు పార్టీలో చేరకపోగా తననే పార్టీ మారమని మోటివేట్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మోటివేషన్ ఫలిస్తుందా లేదా అన్నసంగతి పక్కన పెడితే ఈటల రాజేందర్ మాటలు బీజేపీ దుస్థితికి అద్దం పడుతున్నాయి. హరీష్ రావు కూడా అదే అంటున్నారు. బీజేపీ పనైపోయిందని ఈటల రాజేందరే చెబుతున్నారని అంటున్నారు. బీజేపీ చేరికల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేరు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన కొంత కాలం నుంచి పార్టీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. దీంతో ఆయన మొక్కుబడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని తాను అమెరికాలో ఉన్నానన్నారు. ఇలాంటి ప్రకటనలు పార్టీ మారబోయే వారి నుంచి ఎక్కువగా వస్తూంటాయి. అందుకే గాన్ కేస్ అన్నట్లుగా బీజేపీ నేతలు ఓ నిర్ధారణకు వస్తున్నారు.

బీజేపీలో ఉక్కపోతుకు గురవుతున్న నేతల విషయంలో రేవంత్ రెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్ ఓ రేంజ్ లో ఉంది. ఆయన పేర్లు పెట్టి మరీ పిలుస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణ బీజేపీపై రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ప్రారంభించారు. ఇప్పటి వరకూ తెచ్చి పెట్టుకున్న హైప్ అంతా తుడిచి పెట్టుకుపోయేలా చేసేందుకు ఆయన పార్టీ నేతల మార్పు గురించి ప్రచారం ప్రారంభించారు. అదే సమయంలో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. చేరతామన్న వారు కూడా ఆగిపోయారు. చేరే వాళ్లు ఎవరూ చేరకపోగా అందులో ఉన్న నేతల్ని కూడా ఇతరులు మోటివేట్ చేసి ఆ పార్టీలో ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి పోదాం రండి అని చర్చించుకునేలా రాజకీయం మారిపోయింది. బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరగడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్లు ఖరారు చేస్తే టిక్కెట్ దొరకని ప్రముఖ నేతలంతా బీజేపీలోకి వస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడంతా వారు గాంధీ భవన్ ముందు క్యూ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ త్వరలోనే టిక్కెట్లు ఖరారు చేయబోతున్నారు. సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు ఇస్తే చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. మఖ్యంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మరింత ఎక్కువగా ఈ సమస్య ఉంది. బలమైన నేతలు మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి సహా చాలా మంది నేతల పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. వీరందరితో కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన రాజకీయ పరిచయాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు.

బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయిన తర్వాత పార్టీ బలోపేతం అయింది. అయితే అది బలోపేతం కాదు హైపే. ఎందుకంటే వచ్చిన విజయాలన్నీ వ్యక్తుల ఆధారంగానే వచ్చాయి. కానీ బండి సంజయ్ ఇమేజ్ మాత్రం హైకమాండ్ వద్ద పెరిగింది. ఇదే అదనకు తనకు మాత్రమే పేరు వచ్చేలా తనకు మాత్రమే ఇమేజ్ వచ్చేలా బండి సంజయ్ ప్లాన్ చేసుకున్నారు. పాదయాత్ర చేశారు. ఇతర నేతలకు ప్రెస్ మీట్లు పెట్టే చాన్స్ కూడా ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే నేతల్లో అసంతృప్తి పెరిగిపోవడానికి కారణం అయింది. బీజేపీలో ఇటీవలి కాలంలో కొంత మంది సీనియర్లు చేరారు. ఈటలా రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా మరికొంత మంది చేరారు. వారెవరూ బీజేపీ సిద్ధాంతాలపై ఆసక్తితో చేరలేదు. రాజకీయ అవసరాల కోసమే చేరారు. బండి సంజయ్ ఏకపక్ష వ్యవహారశైలి వారికి నచ్చడం లేదు. బండి సంజయ్ పూర్తిగా మత రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన తీరు వల్ల కేసీఆర్ బలపడతారని బీజేపీ కాదని వారు చెబుతున్నారు. కారణం ఏదైనా బండి సంజయ్ ను మార్చాలని వారంతా పట్టుబట్టారు. కానీ బీజేపీ హైకమాండ్ వినలేదు.

ఇటీవల బీజేపీ – బీఆర్ఎస్ మధ్య బాండింగ్ పెరుగుతోందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కేవలం కేసీఆర్ ను ఓడించాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కొంతమంది బీజేపీలో చేరారు. కాంగ్రెస్ వల్ల కాదని బీజేపీ మాత్రమే ఓడించగలుగుతుందని వారు నమ్మారు. దీనికి కారణం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటమే. బెంగాల్ లో బీజేపీ చేసిన రాజకీయం తరహా తెలంగాణలోనూ చేస్తారని అనుకున్నారు. కేసులు అరెస్టులతో బీఆర్ఎస్ ను బలహీనం చేస్తారనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేకపోయింది. కవిత జోలికి ఈడీ రాకపోతూండటంతో ఏదో జరుగుతోందని బీజేపీలో చేరిన నేతలకు అనుమానం వచ్చింది. అందుకే ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ బంధంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడినట్లుగా కనిపిస్తూండటంతో వారికి మరింత ఉత్సాహం వచ్చింది.

మొత్తంగా బీజేపీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనో జాతీయ రాజకీయాల కోణంలోనో కానీ తెలంగాణ బీజేపీని చివరి క్షణాల్లో నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా ఆ పార్టీ నేతలు ఇంత కాలం పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ముందు ముందు పరిస్థితి మారదా అంటే మారే చాన్స్ ఉందని అనుకోవచ్చు. కానీ అలా మారాలంటే అసాధారణ చర్యలుండాలి. బీజేపీ హైకమాండ్ దానికి సిద్ధంగా ఉందా అన్నదే కీలకం.