ఎవరికి వారే యమునా తీరే.

By KTV Telugu On 11 October, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితులు, వింత పరిణామాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించేందుకు కూడా నేతలు పెద్దగా ఇష్టపడటం లేదు. ఎవరి పరపతిని వారు పెంచుకుంటూ పోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు. పైగా ప్రెస్ మీట్స్ పై ఆంక్షలు పెట్టినట్లుగా అధిష్టానం ప్రతినిధులు వ్యవహరించడంతో మిగతా నేతలకు కంపరం పుట్టుకొస్తోంది. పార్టీ లైన్ ను బట్టి మాత్రమే మాట్లాడాలని అధిష్టానం ప్రతినిధులు షరతులు పెట్టడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. పార్టీ ఆఫీసులో కాకుండా ప్రెస్ క్లబ్బులో కూర్చుని హైడ్రాను, మూసి ప్రక్షాళనను విమర్శించారు. దీనితో పార్టీలో ఆ రెండు అంశాలపై భిన్నాభిప్రాయాలున్నందునే ఆయన రాష్ట్ర కార్యాలయంలో కాకుండా ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారన్న చర్చ జరుగుతోంది.

లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఆ బలాన్ని పెంచుకునేందుకు క్షేత్రస్తాయిలో పూర్తిగా పట్టు సాధించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నించడం లేదు. ఎనిమిది మంది ఎంపీలు, అదే స్థాయిలో ఎమ్మెల్యేలున్న పార్టీగా బీజేపీ చెలామణి కాలేకపోతోంది. ముఖ్యంగా శాసనసభాపక్షంలో సమస్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శాసనసభ కమిటీ సభ్యత్వాల గురించి కూడా అప్పట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత మహేశ్వర్ రెడ్డికి శాసనసభా పక్ష నాయకుడి పదవి ఇచ్చి మమ అనిపించారు. ఐనా మిగతా వాళ్లు ఆయన్ను పట్టించుకునే పరిస్థితి లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ అసలు ఎవ్వరినీ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అనవసరంగా సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ పార్టీ టికెట్ ఇప్పించామని అధిష్టానం ప్రతినిధులు వాపోతున్నారు.

లోక్ సభ సభ్యుల్లోనూ ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని ఆశించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అదేమంటే సొంతబలంపై గెలిచానని ఆయన చెప్పుకుంటున్నారు. మరో ఎంపీ రఘునందన్ రావు అయితే ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసినంతగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. తన వల్లే బీజేపీ నడుస్తున్నట్లుగా రఘునందన్ వ్యవహారం ఉందని పార్టీలో కొందరు అంటున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఢిల్లీపై దృష్టి పెట్టి.. రాష్ట్ర శాఖను పట్టించుకోవడం లేదని తేలిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధోగతిపాలు కావడం ఖాయమని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి బలం పెరగకుండా వాపు నుంచి బలుపు అనుకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అధిష్టానం పట్టించుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందో లేదో చూడాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి