కొండా..బీజేపీకి బండ…

By KTV Telugu On 5 May, 2024
image

KTV TELUGU :-

కొండా విశ్వేశ్వర్ రెడ్డి… తెలుగు రాజకీయాల్లో ఇప్పుడాయన పేరు తెలియనివారుండరు. మూడు పార్టీలు మారినా లైమ్ లైట్లో ఉన్నారు. అటు రాజకీయ కుటుంబం, ఇటు వ్యాపార కుటుంబం కావడంతో కులీన వర్గ మాట  తీరుతో ఆయన ఫేమస్  అయ్యారు. ముందువెనుక చూసుకోకుండా మాట్లాడుతున్న ఆయన వల్ల బీజేపీకి తలనొప్పులు వస్తున్నాయని చెబుతున్నారు. ఏం చేయలేక ప్రస్తుతానికి వదిలేశారని అంటున్నారు..

చేవెళ్ల ఆయన  నేటివ్ ప్లేస్. అక్కడే ఒక సారి గెలిచారు. మరో సారి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీ  చేస్తున్నారు. ఆయన బీఆర్ఎస్  తరపున గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు.  ఇప్పుడు బీజేపీ కేండేట్ గా బరిలోకి దిగారు. అంటే ముచ్చటంగా మూడో పార్టీ అన్నమాట. రాజకీయ  నాయకులు పార్టీలు మారడం మాములే  అయినా.. విశ్వేశ్వర్ రెడ్డి తీరు మాత్రం సంప్రదాయ రాజకీయ నాయకులకు విరుద్ధంగా విచిత్రంగా,  వింతగా  ఉంది.  తనను అందరూ బతిమలాడి పార్టీల్లో చేర్చుకుంటున్నారని ప్రతీ  ఒక్కరికీ చెబుతున్నారు. మూడేళ్లు బతిమాలితే తొలుత బీఆర్ఎస్లో చేరానని, కాంగ్రెస్ పార్టీలోనూ అదే పరిస్థితుల్లో చేరాల్సి వచ్చిందని చెబుతున్నారు.  బీజేపీ నేతలు కూడా వచ్చి అభ్యర్థిస్తే ఇప్పుడు పార్టీలో చేరి..లోక్ సభకు పోటీ చేస్తున్నానని  అన్నారు.  పైగా బండి సంజయ్ వచ్చి బీజేపీలో చేరాలని కోరారన్నారు. తాను  చేవెళ్లలోనే ఉన్నానని, పార్టీలు  తన దగ్గరకు వస్తున్నాయే తప్ప  తాను వెళ్లడం  లేదని ఆయన చెప్పుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది…..

విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు అర్థమవుతుందా అన్నది  ఇప్పుడు పెద్ద ప్రశ్నే  అవుతుంది.బీజేపీలో ఉంటూ ఆయన పక్క  పార్టీ వారిని ప్రశంసిస్తున్నారు.ప్రధాని మోదీపై  ఆయన ఒక్క మంచి మాటా మాట్లాడటం లేదు. పైగా ఏం  చేయాలో కూడా పార్టీ నేతలకు ఆయన సుద్దులు చెబుతున్నారని ఒక  టాక్…

కొండాకు సీఎం రేవంత్ అంటే ఇష్టమట. ఆయన ఉంటేనే కాంగ్రెస్ గెలుస్తుందని అప్పట్లో హస్తం పార్టీ పెద్దలకు చెప్పారట. తన జోస్యం  కరెక్టయి… రేవంత్ సీఎం అయ్యారట. ఇప్పుడు  కూడా రేవంత్ మంచి సీఎం  అట. జాగ్రత్తగా పనిచేస్తే రేవంత్ తెలంగాణను ముందుకు తీసుకెళ్లగలరట. ఇవన్నీ  ఆయన కాంగ్రెస్లో  ఉండి మాట్లాడటం లేదు. బీజేపీలో ఉంటూ వదులుతున్న డైలాగ్స్. పైగా లోక్ సభ  ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ ను కలిసి  అభినందిస్తానని కూడా  కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇలాంటి మాటలు అధిష్టానం వరకు తక్షణమే వెళ్లకపోయినా.. స్థానిక బీజేపీ నేతల్లో  మాత్రం టెన్షన్ కు కారణమవుతున్నాయి. మనోడు వాళ్ల పక్షాన మాట్లాడటమేంటని పార్టీ రాష్ట్ర పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. చేబితే వినే రకం కాదని తెలుసుకుని వాళ్లు మౌనం వహిస్తున్నారు. ఆయన్ను కదిలిస్తే పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా  మాట్లాడితే కొత్త సమస్యలు వచ్చి పడతాయని బీజేపీ  తెలంగాణ శాఖ మౌనరాగాలు ఆలాపిస్తూ కుమిలిపోతోంది.

పార్టీ  అభ్యర్థి తమ రాజకీయ  సంస్థ విధానాలను ప్రతిబింబించాలి. ప్రత్యర్థులను  విమర్శించాలి. కొన్ని  సందర్బాల్లో ప్రత్యర్థులు మంచి చేసినా అందులో  తప్పులు వెదకాలి. అప్పుడే సొంత పార్టీ డెవలప్మెంట్ ఖాయం.  కొండా తీరు మాత్రం అందుకు విరుద్ధంగా  ఉంది. మరి ఆయన గురించి  బీజేపీ ఆలోచన ఏమిటో..మోదీకే ఎరుక….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి