తెలంగాణాలో రాబోయేది మన ప్రభుత్వమే అని కమలనాధులు తెలంగాణా బిజెపి నేతలకు కావల్సినంత ధైర్యాన్ని ఇచ్చారు. ఎన్నికల ఏడాదిలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు తెలంగాణా బిజెపి నేతలను హస్తిన రప్పించిన బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణాలో మరింత దూకుడు ప్రదర్శించాలని దిశా నిర్దేశనం చేసింది. నేతలంతా ఒక్కతాటిపై ఉండాలని హితబోధ చేసింది. దేశమంతటా కాషాయ జెండా ఎగరేసిన బిజెపి దక్షిణాదిలో కర్నాటక దాటి మరో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చాలా కాలంగా పట్టుదలగా ఉంది. అందుకోసమే తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతల ద్వయం మోదీ-షాల చూపు కూడా తెలంగాణాపైనే ఉంది. అందుకే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఇటీవల హైదరాబాద్ లోనే నిర్వహించి తమ ఉద్దేశాన్ని చాటుకుంది బిజెపి.
తెలంగాణా బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ని నియమించిన తర్వాత పార్టీలో కచ్చితంగా ఊపు వచ్చింది. గతంలో బిజెపి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే అనే పేరుండేది. ఇపుడు దాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్తున్నారు బండి సంజయ్. విడతల వారీగా బండి సంజయ్ చేనపట్టిన పాదయాత్రలు తూటాల్లాంటి మాటలతో సంజయ్ చేసే ప్రసంగాలు పార్టీని ప్రజలకు చేరువ చేస్తున్నాయి. అయితే అధికారంలోకి రావడానికి అవి మాత్రమే సరిపోవని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పార్టీకి కొత్త అధ్యక్షుని నియమించే సమయం ఆసన్నం కావడంతో దానిపై చాలా మంది సీనియర్ల దృష్టి పడింది.
ఇతర పార్టీల నుండి బిజెపిలోకి వచ్చిన కొందరు నేతలు అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారు. బి.ఆర్.ఎస్. నుండి బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్న కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి వంటి నేతలు కీలక పదవి కోసం తమ తమ స్థాయిల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒక వేళ బండి సంజయ్ కే మరోసారి అధ్యక్ష పదవిని ఇస్తే పార్టీలో సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారిందంటున్నారు రాజకీయ పండితులు.
సంజయ్ ను తప్పించాలని చాలా మంది సీనియర్లు హస్తిన స్థాయిలో అడ్డుపుల్లలు వేస్తున్నారు. అయితే వారి మాటలకు హైకమాండ్ ఏ పాటి విలువను ఇస్తుందనేది తెలీదు. ఒక వేళ వారి మాటను కాదని సంజయ్ నే ఆ పదవిలో కొనసాగిస్తే సహాయ నిరాకరణకు కూడా సీనియర్లు వెనుకాడరని అంటున్నారు. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో సీనియర్లంతా కష్టపడి పార్టీని గెలిపిస్తే క్రెడిట్ మాత్రం బండి సంజయ్ ఎగరేసుకుపోతారు కాబట్టి తమకు పేరు రానపుడు పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేయాల్సిన అవసరం లేదన్న భావనలో కొందరు ఉన్నట్లు అధిష్టానానికి ఉప్పందింది. జనంతో మమేకం అవ్వాలని పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలు అన్ని నియోజకవర్గాల్లోనూ సరిగ్గా అమలు కావడం లేదన్న ఫిర్యాదులూ పైకి వెళ్లాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సిన అవసరాన్ని గుర్తించిన పార్టీ అధిష్ఠానం అందుకే తెలంగాణ బిజెపి నేతలను అర్జంట్ గా ఢిల్లీ పిలిపించింది. అమిత్ షానే వారితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా కూడా ఉన్నప్పటికీ తమ అజెండా ఏంటో అమిత్ షానే నేతలకు వివరించినట్లు సమాచారం.
కాంగ్రెస్-బి.ఆర్.ఎస్.లు కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణా బిజెపి నేతలు పేర్కొన్నట్లు తెలిసింది. ఆ కుట్రలను తిప్పికొట్టాలంటే కార్నర్ మీటింగ్స్ పై దృష్టి సారించాలని జనంతో కలిసిపోవాలని అగ్రనేతలు సూచించారు. ప్రత్యేకించి కేసీయార్ కుటుంబ పాలన నుండి వారి దోపిడీ నుండి తెలంగాణా రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని ప్రజలకు భరోసా ఇవ్వాలని నేతలు సూచించారు. గతంతో పోలిస్తే తెలంగాణాలో ఇపుడు బిజెపి ఎంతగానో బలపడిందని రాష్ట్ర బిజెపి నేతలు ఆధారాలతో సహా వివరించినట్లు సమాచారం. తెలంగాణాలో పార్టీ పటిష్టానికి నేతలు అనుసరిస్తోన్న విధానాలను మెచ్చుకుంటూనే అవి మాత్రమే సరిపోవని మరింత దూకుడుతో ముందుకు పోవాలని అమిత్ షా సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. బి.ఆర్.ఎస్. ని మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీని దాని పన్నాగాలను కూడా ఎండగట్టాల్సిందేనని నాయకత్వం హితబోధ చేసిందంటున్నారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి కుంభకోణాలు పెరిగిపోతాయని అదే బిజెపికి అధికారం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ తో ఎక్కడ లేని అభివృద్ధిఈ జరుగుతుందని ప్రజలకు భరోసా ఇవ్వాలని సూచించారు.
ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష పదవి కోసం సీనియర్లు పోటీ పడ్డంలో తప్పులేదుకానీ తమకి రాకపోతే పార్టీకి నష్టం తెచ్చేలా వ్యవహరించాలని మాత్రం అనుకోకూడదని చెప్పినట్లు సమాచారం. ఎవరికి పదవిని ఇచ్చినా మిగతా నేతలంతా కూడా సహకరించాలని అంతిమంగా పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే ఆ తర్వాత చాలా పదవులు వస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ కు పార్టీ అగ్రనేతల మద్దతు ఉందని ఆయన వర్గం ధీమాగా ఉంది. ప్రత్యేకించి బండి సంజయ్ పనితీరును సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే భుజం తట్టి మరీ మెచ్చుకున్నారు. అంచేత కొందరు సీనియర్లు సహకరించకపోయినా బండి సంజయ్ దూసుకుపోతారని ఆయన వర్గం వాదిస్తోంది. అయితే అధ్యక్ష పదవిని ప్రకటించే వరకు మౌనంగా ఉండి ఆతర్వాత భవిష్యత్ గురించిన ఆలోచనలు చేయచ్చనేది సీనియర్ల అభిప్రాయంగా చెబుతున్నారు. అయితే మొదట్నుంచీ బిజెపిలో ఉన్న నేతలయితే పదవి వచ్చినా రాకపోయినా క్రమశిక్షణతోనే ఉంటారు. అదే బయటి పార్టీల నుంచి వచ్చిన నేతలయితేనే పదవులు రాకపోతే పార్టీలు మారే ఆలోచనలు చేయచ్చని వారంటున్నారు. అటువంటి వారు పార్టీని వీడినా తమకి నష్టం లేదని వారంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో తెలంగాణా బిజెపి నేతల్లో కొత్త ఉత్సాహం అయితే వచ్చిందంటున్నారు రాజకీయపరిశీలకులు.