“బండి” చుట్టూ.. శత్రువులు

By KTV Telugu On 23 January, 2023
image

ఎదుగుతోన్న కొద్దీ శత్రువులూ పెరుగుతారు. అందులోనూ రాజకీయాల్లో మరీనూ.చుట్టూరా ఉన్న నేతలే మనల్ని దాటి ఎక్కడ ఎదిగిపోతాడో అని తొక్కేద్దామని చూస్తారు. దానికోసం ఎన్ని కుయుక్తులైనా పన్నుతారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దీనికి అతీతేడేం కారు కదా. ప్రస్తుతం తెలంగాన బిజెపిలో బండి సంజయ్ కు శత్రువులు రోజు రోజుకీ పెరుగుతున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమతులైన బండి సంజయ్ రావడం రావడమే వార్తల్లో మెరిశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగంగానే భాగ్యలక్ష్మీ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లిన బండి సంజయ్ చేసిన విన్యాసం కేసీయార్ గుండెల్లోనే గుబులు పుట్టించింది . ఒకే ఒక్క కార్యక్రమంతో పెద్ద హీరో అయిపోయారు బండి సంజయ్.

సమయస్థూర్తితో మాట్లాడ్డంలో బండి సంజయ్ రూటే వేరు. పంచ్ లపై పంచ్ లు విసరడంలో ఆయనది ప్రత్యేక స్టైల్.
బండి సంజయ్ ఎంట్రీకి ముందు కేసీయార్ పై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడేవారు రేవంత్ రెడ్డి. బండి వచ్చాక రేవంత్ ను అందరూ మర్చిపోయారు. అంతటి ముద్ర వేసుకున్నారు బండి సంజయ్. ఇక గ్రేటర్ ఎన్నికలను భుజస్కంథాలపై వేసుకున్న బండి సంజయ్ పార్టీ నాయకత్వం కూడా నమ్మలేని విజయాలతో అదరగొట్టారు. మొదటి సారి బండి సంజయ్ ని చూస్తే కేసీయార్ కూడా కొద్దిగా ఉలిక్కి పడ్డారంటారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత బండి సంజయ్ జోరు మరింతగా పెరిగింది పార్టీలో తక్కువ కాలంలోనే ఎక్కువ గ్లామర్ సంపాదించుకున్న నేతగా ఎదిగిపోయారు.
అది సహజంగానే పార్టీలోని చాలా మంది సీనియర్లకు కంటగింపు అవుతుంది.

తెలంగాణా బిజెపిలో తనకన్నా చాలా సీనియర్లు అయిన నేతల కన్నా కూడా బండి సంజయ్ ప్రసంగాలు కానీ వాక్చాతుర్యం కానీ అమోఘం అంటారు రాజకీయ పరిశీలకులు. హుజూరా బాద్ ఎన్నికల్లో ఘన విజయంలోనూ బండి సంజయ్ పాత్ర తక్కువదేమీ కాదు. అన్నింటినీ మించి ఇటీవల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించింది. ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఘన విజయం సాధించడంలో బండి సంజయ్ పాత్ర మామూలుది కాదు. ఆ మాట ఎవరో అనాల్సిన అవసరం లేదు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే సభకు తరలి వచ్చిన శ్రేణులను జనాలను చూసి ముచ్చటపడిపోయారు. శభాష్ సంజయ్ అంటూ బండిని భుజం తట్టి మెచ్చేసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం ఓ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ బండిసంజయ్ ని ఉద్దేశించి ఆయన వెంకయ్యనాయుడంతటి నాయకుడు అవుతారు అన్నారట.

ఈ పొగడ్త బండి సంజయ్ కి ఆనందాన్నిస్తుంది. అదే సమయంలో ఆయన ప్రత్యర్ధులకు అసూయనీ, భయాన్నీ, కోపాన్నీ కలిగిస్తాయి. ఆయనకు ఇప్పటి వరకు ప్రత్యర్ధులు లేకపోవచ్చు. కానీ ఎన్నికల ఏడాదిలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటోన్న తరుణంలో బండి సంజయ్ నేరుగా ప్రధాని గుడ్ లుక్స్ లోకి వెళ్లిపోవడం పార్టీలోని సీనియర్లకు నిద్రలేకుండా చేస్తోందంటున్నారు. ఎందుకంటే బిజెపి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికోసం చాలా మందే పోటీ పడతారు. వారిలో రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు కూడా ఉంటారు. అయితే ఈ నేతల్లో ఎవరి గురించి ఏనాడూ ఒక్క పొగడ్త చేయని మోదీ బండి సంజయ్ ని మెచ్చుకున్నారంటే మోదీ దృష్టిలో బండి సంజయ్ తురుమ్ ఖానే కదా అంటున్నారు బండి సంజయ్ వర్గీయులు.
అందుకే బండి సంజయ్ ని ఎన్నికల లోపు ఎలా వెనక్కి నెట్టాలా అన్న కుట్రలు అప్పుడే మొదలైపోయాయని కమలనాథుల్లోనే గుస గుసలు వినపడుతున్నాయి.