అన్ని వైపులా కష్టాలు..! – BRS – KCR

By KTV Telugu On 5 April, 2024
image

KTV TELUGU :-

బీఆర్ఎస్ కు లోక్ సభ ఎన్నికలు రెండో చావుదెబ్బగా మారబోతున్నాయి. ప్రజా వ్యతిరేకత, నాయకుల పలాయనం ఇప్పుడు  ఇబ్బందికరంగా  మారింది. ఆ పార్టీకి ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాలకు మించి రావని తాజా సర్వేలు చెబుతుండటంతో నేతలకు నిద్రపట్టడం లేదు. వచ్చే రెండు స్థానాలు కూడా ఎక్కడ వస్తాయో తెలీయక బీఆర్ఎస్ పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయి…..

తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితం కానున్నట్లు ఇండియా టీవీ ప్రీ-పోల్ సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఒక్క చోట కూడా గెలవదంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా రెండు స్థానాలకు మించి సాధ్యం కాదని ఆ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొందగా ఈసారి అది మూడు రెట్లు పెరిగి తొమ్మిదికి చేరుకుంటుందని తేలింది. బీజేపీ మాత్రం గతంలో నాలుగు స్థానాల్లో గెలవగా ఈసారి మరో స్థానంలో గెల్చుకుని ఐదుకు పరిమితమవుతుందని, మజ్లిస్ యథావిధిగా ఒక్క స్థానంలో గెలుస్తుందని బుధవారం వెల్లడించిన ప్రీ-పోల్ ఫలితాల్లో వెల్లడైంది. బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం దారుణంగానే ఉంది. నేతలు నిలబడటం లేదు. కార్యకర్తలు నీరసంగా ఉండిపోతున్నారు. ఎవరూ క్షేత్రస్థాయిలో తిరిగేందుకు ఇష్టపడటం  లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. దానితో దిశానిర్దేశం లోపించింది. పార్టీ పరిస్థితి అధోగతిపాలైంది…

జనంలో కూడా తిరిగేందుకు పార్టీ నేతలు ఇష్టపడటం లేదు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వస్తోంది. అక్కడ కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తోంది. కేసీఆర్ కు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానితో ఇప్పుడు ఆయన బయట తిరుగుతారా లేక ఫామ్ హౌస్ కు పరిమితమవుతారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి….

గులాబీ అధినేత కేసీఆర్‌కు సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉండేది. అయితే అధికారం పోవడం, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండటంతో జిల్లాల పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు, అభిమానులు ఒక్కసారిగా తోసుకువస్తుండటంతో నియమించుకున్న సెక్యూరిటీ అదుపు చేయలేకపోతుండడంతో అసహనానికి గురవుతున్నారు. రైతన్న సమస్యలపై పొలంబాట ఒకవైపు… కేడర్‌లో జోష్ నింపేందుకు సభలు మరోవైపు పార్టీ అధినేత నిర్వహిస్తున్నారు. అయితే అక్కడే చిక్కులు వస్తున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు హంగు ఆర్బాటాలు.. ఐదడుగుల దూరంలో ప్రజలు.. కార్యకర్తలు.. రెండంచెల భద్రత వ్యవస్థ ఉండేది. . అధికారం పోగానే ఇప్పుడు కేసీఆర్ బయటకు రావాలి అంటేనే.. సెక్యూరిటీ కష్టాలు ఎదురతున్నాయి. దానికి తోడు కాలి గాయం కూడా ఒకింత ఇబ్బంది పెడుతున్నది. ఇటీవల రైతులను  పలుకరించడానికి కేసీఆర్  వెళ్లినప్పుడు జనం  భారీగా తోసుకురావడంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే  ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్, 13న చేవెళ్ల సభ, 15న మెదక్ ఇలా వరుసగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని తెలిసిన లీడర్లు ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆ సభల్లో సెక్యూరిటీ సమస్యలు అర్థం చేసుకుని తర్వాతి పర్యటనలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా సభలు ఉంటాయని చెబుతున్నారు…

బీఆర్ఎస్ పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. అంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకాలం పార్టీలో బిజీగా తిరిగిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోయారు. ఒకరిద్దరు మిగిలితే వాళ్లు కూడా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. దానితో ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే ఎన్నికల ప్రచారంలో తిరగాలి. ఆయనకు అంత ఓపిక ఉంటుందో లేదో….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి