తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ పెరుగుతోంది. ముందు నుంచి ఉన్నవారికి, కొత్తగా వచ్చి చేరిన వారికీ మధ్య రాపిడి మొదలైనట్లు చెబుతున్నారు. ఆశావహులు ఎక్కువ కావడంతో సీఎ రేవంత్ కూడా ముందు వెనుకా ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే మంత్రి వర్గ విస్తరణ తేదీపై ఇంకా స్పష్టత రావడం లేదు….ఎప్పుడు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది….
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సందడి ముగిసింది. నిన్న మొన్నటి వరకు.. మోగిన మైకులు మూగ బోయాయి. ఇక, ఇప్పుడు సర్కారు విషయంలో సందడి మొదలైంది. మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం.. ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ సహా 12 మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతానికి కేబినెట్లో మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తి చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అంతలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. దీంతో ఈ ఎన్నికల అనంతరం ఖాళీలను భర్తీ చేస్తా మని.. పార్టీ నుంచి సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో అధిష్టానం దృష్టిలోపడేందుకు చాలా మంది నాయకులు ఎన్నికల వేళ చెలరేగి మరీ పనిచేశారు. వీరితోపాటు.. మరి కొందరు కాంగ్రెస్ అధిష్టానాన్ని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. వీరిలో సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉన్న దానం నాగేందర్ కూడా ఉన్నారు. ఆయన బీఆర్ ఎస్‌లో గెలిచి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే ఎంపీగా కూడా టికెట్ దక్కించుకున్నారు. కానీ, సికింద్రాబాద్‌లో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఆయన కూడా మంత్రి వర్గ రేసులో ఉన్నారు. కుల సమీకరణల్లో భాగంగా కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు మంత్రిపదవి కోసం ప్రయత్నిస్తున్నారు….
ఆరు పదవులు అరవై మంది ఆశావహులు అన్నట్లుగా ఉందీ ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత ఆశావహుల్లో కూడా ఎక్కడ చూసినా రెడ్లే కనిపిస్తున్నారు. పైగా మంత్రిపదవి ఇస్తే కాంగ్రెస్ లో చేరతామని ఆఫరిచ్చే వాళ్లూ తయారయ్యారు..
సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా మంత్రిపదవిని ఆశిస్తున్నారు.అవసరమైతే రాహుల్ గాంధీతో చెప్పించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పార్టీ నుంచి మారి వచ్చేందుకు సిద్ధమేనని.. అయితే..తనకు కూడా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. వీరంతా రెడ్డి సామాజికవర్గం వారేనని మరిచిపోకూడదు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా ఎంపిక చేసి ఎమ్మెల్సీ పదవినిచ్చి మంత్రిని చేయాలన్న డిమాండ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఎలాంటి పదవులు లేని కొందరు నేతలు కూడా తమకు ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రిని చేయాలని ఎదురుచూస్తున్నారు. దానితో ఏం చేయాలో రేవంత్ కు పాలుపోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొందరు ఎదురుచూస్తున్నా మరింత జాప్యం జరగొచ్చని కూడా సీఎంకు అత్యంత సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. మంత్రివర్గ విస్తరణ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడితే పార్టీకి ఇబ్బంది అవుతుందని రేవంత్ ఆలోచిస్తున్నారట. అందుకే మరికొన్ని రోజులు ఆగడమే మంచిదని, ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు..
తొలి మంత్రివర్గంలో కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలకు అన్యాయం జరిగింది. అందుకే ఎప్పుడు విస్తరణ జరిగినా ఆ రెండు జిల్లాలకు సముచిత స్థానం లభిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ను పూర్తిగా దెబ్బకొట్టే వీలుంటుందని కూడా లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికి మాత్రం మంత్రివర్గంలో ఏ మార్పూ ఉండకపోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…