తెలంగాణ కేబినెట్లో తొలగింపు సైరన్ మోగుతోంది. కొందరు మంత్రులను సాగసంపుతారని తెలుస్తోంది. ఏడాదిన్నరగా కొందరు మంత్రుల తీరు బాగోలేదని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించపోవడం, జనంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు చర్యలు చేపట్టకపోవడంతో కేసీఆర్ మంత్రుల పట్ల కొంత అసహనానికి లోనవుతున్నారు. కలెక్షన్లు చేసుకోవడం వ్యక్తిగత పరపతిని పెంచుకోవడం తప్ప మంత్రులు ప్రభుత్వానికి గానీ పార్టీకీ గానీ ఉపయోగపడిందేమీ లేదన్న చర్చ జరుగుతోంది. సీఎం అంతర్గతంగా జరిపించిన సర్వేల్లో కూడా కొందరు మంత్రుల పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిపోయింది. దానితో ఇక ఎన్నికల వేళ వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లుగా ప్రగతి భవన్ వర్గాల సమాచారం.
తిరుగుబాటు చేసిన ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగించి చాలా రోజులైంది. ఆయన స్థానంలో మరోకరికి ఇంకా అవకాశం ఇవ్వలేదు. మంత్రి మల్లారెడ్డి తీరు కూడా కేసీఆర్ కు నచ్చడం లేదు. తరచూ ఆయన మాటలు పార్టీ వర్గాల్లోనే విమర్శలకు దారితీయడంతో పాటు కామెడీలకు అవకాశం ఇస్తుంది. ఆయన తొడలు కొట్టడం లాంటి చిల్లర పనులు చేస్తున్నారని సీఎం ఆగ్రహం చెందుతున్నారు. పైగా ఇప్పుడు మేడ్చల్ జిల్లాకే చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఆయనపై తిరుగుబాటు చేశారు. ఆయనతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రిని పంపించేస్తారని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన ఆ మంత్రి తన పని చేయకుండా కాలం గడుపుతున్నారని కేసీఆర్ కు ఫిర్యాదులు అందాయి. మరో ఇద్దరు మంత్రుల నెత్తిన కూడా కత్తి వేలాడుతోందని చెబుతున్నారు. అందులో ఒకరు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మంత్రిగా సమాచారం అందుతోంది.
సంక్రాంతి నాటికి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండొచ్చు. జనవరి మూడో వారంలో మంచి రోజు చూసుకుని కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారని చెబుతున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన వెంటనే ఆ పనిచేస్తారని కేసీఆర్ సెంటిమెంట్లు తెలిసిన వాళ్లు చెబుతున్నారు. సంక్రాంతి నెలలో మంచి రోజు లేదని భావిస్తే మాత్రం ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేస్తారు. ఏదైనా సరే ఫిబ్రవరి లోపే మంత్రివర్గంలో మార్పులు ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే ఆలస్యమైందని అంటున్నారు.
ప్రమాణ స్వీకారం చేసే వారిలో కొందరిపేర్లు ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్న బాల్క సుమన్ పేరు మొదటి వరుసలో ఉంది. సీనియర్ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మాజీ స్పీకర్ మధుసూధనాచారి, బండ ప్రకాశ్ కు కూడా ఈ సారి కెబినెట్లో అవకాశం రావచ్చు. ప్రాంతాలు సామాజికవర్గాల వారీగా లెక్కలు చూసుకునే కేసీఆర్ తన మంత్రివర్గంలో మార్పులు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాల్క సుమన్, మధుసూధనాచారి నిత్యం కేసీఆర్ వెంట నీడలా తిరుగుతూ ఆయన దృష్టిలో పడ్డారు. బీసీల లెక్కలు వేసుకుని బండ ప్రకాశ్ కు మంత్రివర్గంలో చోటు ఇస్తారని భావిస్తున్నారు.