ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ సన్నాహాలు

By KTV Telugu On 16 November, 2022
image

తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యూహాలు మామూలుగా ఉండవు.

తాను వేసే ఎత్తులకు ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా చిత్తయిపోవాల్సిందే. ఇప్పుడు సీఎం మరో బ్రహ్మాండమైన ఎత్తు వేయబోతున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌లకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గ‌తంలో కూడా ఆయన ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి రెండో సారి అధికారంలోకి వచ్చారు. ఈ సారి కూడా అలాంటి వ్యూహంతోనే ముందుకెళుతార‌నే ప్ర‌చారం జరుగుతోంది. అందుకోసమే ఈ నెల 15న కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న టీఆర్ఎస్ లెజిస్లేటివ్, అలాగే పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం నిర్వ‌హిస్తున్నార‌ని భావిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించడంతో ప్రజలు తమవెంటే ఉన్నారనే విషయం కేసీఆర్‌కు అర్థమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లెజిస్లేటివ్‌, పార్ల‌మెంట‌రీ స‌భ్యుల‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గంతో సంయుక్త స‌మావేశం నిర్వ‌హించి కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన నేప‌థ్యంలో మొద‌ట తెలంగాణ‌లో బ‌లాన్ని నిరూపించుకోవాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మామూలుగా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది జ‌ర‌గాలి. ఇప్పుడు కేసీఆర్‌ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే. ప‌ది నెల‌లు ముందుగా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. ఇకపోతే కేసీఆర్‌ ఎప్పటికప్పుడు తన ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై క్షేత్ర‌స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. అలాగే దేశ రాజకీయ పరిస్థితులు, ప్రజల మూడ్‌ను కూడా ఆయన అధ్యయనం చేస్తున్నారు. అలాగే జ్యోతిష్యాన్ని బ‌లంగా నమ్మే కేసీఆర్‌కు ఎవరైనా పండితుడు ఫ‌లానా స‌మ‌యంలో ఎన్నిక‌లు జ‌రిగితే మ‌ళ్లీ అధికారం ద‌క్కుతుంద‌ంటే కేసీఆర్ ఆ మాటలను తూచాతప్పకుండా అమలు చేస్తారని అందరికీ తెలుసు. అసలు కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది ఆయన ఆధ్వర్యంలో జరగనున్న కీల‌క స‌మావేశం తరువాతే తెలిసే అవకాశం ఉంది.