కేసీఆర్ కొత్త గేమ్.. బీజేపీకి టెన్షన్

By KTV Telugu On 17 November, 2022
image

ముందస్తు ముచ్చట లేదంటూనే కేసీఆర్ కొత్త ఆటకు తెరతీశారా ? ఎమ్మెల్యేల్లో కొనుగోలు వ్యవహారానికి ట్రిస్ట్ ఇచ్చారా ? నేరుగా తన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లే ఎందుకు చెబుతున్నారు ? బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహం ఫలిస్తుందా ?

బీజేపీపై దూకుడు పెంచిన కేసీఆర్
కల్వకుంట్ల కవితనే పార్టీ మారాలని అడిగారంటున్న సీఎం
ఈడీ, సీబీఐ దాడులు పెరిగే అవకాశం ఉందని లెక్కలు

బీజేపీపై గులాబీ దళపతి ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద పెద్ద బాంబులు పేల్చారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు అంతు పంతు లేకుండా పోయిందని ఆరోపించారు. తన కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ మారమని అడిగారని ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. పైలట్ రోహిత్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ వైపుకు లాగే ప్రయత్నం బట్టబయలు కావడంతో కేసీఆర్ చెబుతున్నదీ నిజమే అనిపించే వీలుంది. బీజేపీ చెప్పుచేతల్లో ఉండకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ అంటున్నారు. అయినా తాటాకు చప్పుళ్లకు భయపడాల్సిన అవసరం లేదని అంటూ మనకూ కూడా దర్యాప్తు సంస్థలున్నాయని కేసీఆర్ గుర్తు చేశారు.

స్టింగ్ ఆపరేషన్ కు విశ్వసనీయత కల్పించే ప్రయత్నం
బీజేపీకి ఇతర పార్టీ నేతలను లాక్కునే హాబీ ఉందని చెప్పడం
గతంలో ములాయం కోడలికి కాషాయ కండువా

కవితను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేసీఆర్ చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును ప్రచారం చేయడం అందుకేనని ఆయన పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. కవిత బీజేపీతో చేరితే కేసుల విచారణ ఆగిపోతుందని దేశంలో ఇప్పుడు అదే జరుగుతోందని ఆయన సందేశమిస్తున్నారు. పైగా బీజేపీకి సొంత బలముండదని ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను లాక్కుని శక్తిమంతమైన పార్టీగా అవతరించిందని కేసీఆర్ వాదన. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ ను బీజేపీ కొంత కాలం క్రితం తమ పార్టీకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ములాయం మరణంతో ఖాళీ అయిన మెయిన్ పురి స్థానానికి అఖిలేష్ వైఫ్ డింపుల్ పోటీ పడుతుండగా ఆమెను ఓడించే ఉద్దేశంతో బీజేపీ తరపున అపర్ణా యాదవ్ ను రంగంలోకి దించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణలో కూడా బీజేపీ ఉత్తరప్రదేశ్ గేమ్ ఆడాలని చూస్తోందని కేసీఆర్ అనుమానిస్తున్నారు. భయపెట్టి బెదిరించి కవితను చేర్చుకుని తన కుటుంబ సభ్యులపైనే పోటీ చేయించాలన్నది బీజేపీ ప్లాన్ గా కేసీఆర్ అనుమానిస్తున్నారు.

కేసీఆర్ ఆరోపణలపై బీజేపీ రియాక్షన్ ఏమిటో
ఫామ్ హౌస్ కేసును లైట్ తీసుకున్న టీ బీజేపీ
కవిత వ్యవహారంలోనూ కమలం కామెడీ చేసే అవకాశం

కేసీఆర్ తాజా ఆరోపణలపై బీజేపీ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. నిజానికి పైలట్ రోహిత్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు బయటపడినప్పుడు బీజేపీ ఎలాంటి తొట్రుపాటును ప్రదర్శించలేదు అబ్బో ఇలాంటివి చాలా చూశామన్నట్లుగా ప్రవర్తించింది. ఆ నలుగురిలో ముగ్గురు వేరు పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరిన వారని అలాంటి ఎమ్మెల్యేల తీరును పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీ బీజేపీ సమాధానమిచ్చింది. నెత్తిన రూపాయి పెడితే అర్థరూపాయి విలువలేని ఎమ్మెల్యేలను ఎవరైనా డబ్బులిచ్చి చేర్చుకుంటారా అని బీజేపీ నేతలు ఎదురు ప్రశ్నలు వేశారు. ఇప్పుడు కవిత వ్యవహారంలోనూ అదే సమాధానం రావచ్చు. ముఖ్యమంత్రి కూతురు అయి ఉండి కూడా నిజామాబాద్ లోక్ సభా స్థానంలో ఓడిపోయిన కవితను చేర్చుకుని అదనపు లగేజీ ఎవరు మోస్తారని బీజేపీ కౌంటరిచ్చే అవకశాలున్నాయి.