బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. టీఆర్‌ఎస్‌గా ఉన్నన్నాళ్లూ ఇలాంటి వైపరీత్యం ఎప్పుడూ లేదే అంటూ అగ్రనేతల్లో అంతర్మధనం మొదలైనట్లే ఉంది. కేసీఆర్‌కి ఎప్పుడూ గులాబీ నేతలు, ఎమ్మెల్యేలు ఎదురుతిరిగిన దాఖలాలే లేవు. ఒకప్పుడు ఆ దుస్సాహసం చేసినవారు రాజకీయంగా తెరమరుగైపోయారు. అందుకే అసంతృప్తి ఉన్నా సమస్యలున్నా ఎప్పుడూ ఎవరూ బాహాటంగా నోరుమెదిపింది లేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కారుపార్టీలోనూ సీన్ మారింది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మీడియాముఖంగా అధినాయకత్వానికి తమ వేదన, నివేదన వినిపించడం మామూలు విషయం కాదంటున్నారు.
మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు గట్టిగానే గొంతెత్తారు. ఒక్క మల్లారెడ్డికే ఈ అసంతృప్తి పరిమితమని ఎవరూ అనుకోవడంలేదు. కేసీఆర్ కేబినెట్‌లోని మరికొందరు మంత్రుల తీరుపై ఎమ్మెల్యేల్లో ఉన్న అసహనం లావాలా తన్నుకొచ్చేలా ఉంది. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ ఏకపక్ష నిర్ణయాలపై పార్టీనేతల్లో అసంతృప్తి ఉంది. నిజామాబాద్ మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేలను కలుపుకుని వెళ్లలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. జగదీష్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితారెడ్డితో పాటు మరికొందరిపైనా పార్టీ ఎమ్మెల్యేలు, నేతల్లో అసంతృప్తి ఉన్నా ఎప్పుడూ బయటపడలేదు.
పైకి అంతా బానే ఉన్నట్లు కనిపిస్తున్నా బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా అసంతృప్తులు బాగానే ఉన్నాయి. అసలే ఐటీదాడులతో బుర్ర వేడెక్కి ఉన్న మల్లారెడ్డి ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉలిక్కిపడ్డారు. ఇంటి సమస్యని త్వరలో పరిష్కరించుకుంటామంటూ డ్యామేజ్ కంట్రోల్ పనిలో పడ్డారు. తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటానని వాళ్లని ఇంటికి ఆహ్వానిస్తానని రాజీకొచ్చారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అధినాయకత్వం మీద భయం భక్తి ఉన్నాయి. ఇక ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మీడియాకి ఎక్కటంతో ఇంటి పరువు బజారునపడింది. రచ్చగెలవాలనుకుంటున్న కేసీఆర్‌కి ఇంటిపోరు మొదలైంది.