తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది ప్రజా తీర్పును కోరబోతోంది. కేబినెట్ టీమ్ ఐదేళ్లుగా గేమ్ ఆడింది. ఈ గేమ్‌లో ప్రజల్ని మెప్పించారా లేదా అన్నది త్వరలో జరగబోయే ఎన్నికల్లో వారు తీర్పు ఇస్తారు. మెప్పిస్తే మళ్లీ అధికారంలోకి వస్తారు. డిజప్పాయింట్ చేస్తే ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. అయితే ఎలాంటి ఫలితం వచ్చినా క్రెడిట్ అయినా బాధ్యత అయినా సరే తీసుకోవాల్సింది కెప్టెన్. ఆటల్లో టీమ్ మొత్తం బాగా ఆడాలి అలాగే కెప్టెన్ వ్యూహాలు వర్కవుట్ అవ్వాలి అప్పుడే విజయం లభిస్తుంది. రాజకీయాల్లోనూ అంతే మిగతా కేబినెట్ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యాక్టివ్ గా ఉందని నిరూపించాలి కెప్టెన్ కూడా దానికి తగ్గట్లుగా రాజకీయ వ్యూహాలను అమలు చేయాలి. అన్నీ వర్కవుట్ అయితేనే విజయం లభిస్తుంది. తెలంగాణ టీమ్‌కు కెప్టెన్ కేసీఆర్ మరి పాలనలో తన టీమ్ సభ్యులకు మంచి దిశానిర్దేశం చేసి అవసరమైనప్పుడు ముందు ఉండి నడిపించారా ప్రజల్ని మెప్పించారా రాజకీయంగా తన వ్యూహాలతో అందరి మైండ్ బ్లాంక్ చేసి తిరుగులేని కెప్టెన్ అని నిరూపించుకున్నారా.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రియల్ కెప్టెన్. నిజం చెప్పాలంటే ఆయన కేబినెట్లో మంత్రులు ఎంత మంది ఉన్నా ఏ నిర్ణయమైనా కేసీఆర్ కనుసన్నల్లోనుంచి జరగాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ మొదటి మంత్రి వర్గం ఎలా అయితే కేసీఆర్ కనుసన్నల్లో నడిచిందో రెండో మంత్రి వర్గమూ అంతే. అయితే గత రెండేళ్లుగా కేసీఆర్ అత్యంత కీలకమైన విషయాల్లోనే జోక్యం చేసుకుంటున్నారు. మిగతా బాధ్యతలు కేటీఆర్ హరీష్ రావులకు ఇస్తున్నారు. అయినప్పటికీ కీలకమైన అంశాలపై ఆయన సూపర్ విజన్ తప్పనిసరిగా ఉంటుంది. ఎలా చూసినా తెలంగాణలో జరిగిన ప్రతీ మంచీ చెడూకు బాధ్యత క్రెడిట్ కేసీఆర్‌దే. రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత గత నాలుగున్నరేళ్ల పనితీరును అవలోకించి చూస్తే కెప్టెన్ కేసీఆర్‌లో ఎక్కడో స్పార్క్ మిస్సయిందని అనిపించక తప్పదు.
గత నాలుగున్నరేళ్ల కాలంలో పరిపాలన పరంగా చూస్తే కేసీఆర్ ఫస్ట్ క్లాస్ మార్కులు చాలాసులవుగా తెచ్చుకున్నారని అనుకోవచ్చు. వచ్చిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించారా లేదా అన్న విషయం పక్కన పెడితే వాటి ప్రభావం ప్రజలపై ఉండకుండా ఆయన వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారని అనుకోవచ్చు. గత నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ పరిపాలనా పరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందులో ప్రధానమైనవి ఆర్థిక సమస్యలు. తెలంగాణ ఆర్థిక పరిపుష్టి గల రాష్ట్రం. కానీ కేసీఆర్ లార్జర్ దెన్ లైఫ్ అన్న ప్రాజెక్టులను డిజైన్ చేసి అప్పులు చేసి నిర్మించారు. వాటి వల్ల వచ్చే ప్రయోజనాల సంగతేమో కానీ వాటికి వడ్డీలు కట్టుకోవడం ఎక్కువ అయిపోయింది. అదే సమయంలో కేంద్రంతో పెట్టుకున్న లొల్లి కారణంగా అప్పులకూ పర్మిషన్లు దొరక్క పోవడమే వల్ల బాగా ఇబ్బంది పడింది. అందుకే ఉద్యోగుల జీతాలూ సమయానికి ఇవ్వలేకపోతున్నారు. హైదరాబాద్ లో ఉద్యోగులకు మాత్రమే సమయానికి జీతాలు అందుతున్నాయి. జిల్లాల్లో వారికి ఎప్పటికి జీతాలు వస్తాయో అంచనా వేయడం కష్టంగా ఉంది. ఇక ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమైనా చివరికి సర్దుకోగలిగారు. ఉద్యోగ సంఘాలను గ్రిప్‌లో పెట్టుకోగలిగారు. అలాగే నిరుద్యోగుల్ని సరైన సమయంలో నోటిఫికేషన్ల ద్వారా కంట్రోల్ చేయగలిగారు. ఎన్నికల నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఆ నిరుద్యోగులు తీవ్ర ఉద్యమం చేసిఉండేవారే. అయితే పరీక్షలు పెట్టడంలో తప్పిదాలకు పాల్పడటం మైనస్‌గా మారింది. ప్రభుత్వ పాలనలో ఇలాంటి లోపాలు ఉన్నా సర్దుకోగలిగారు.
తెలంగాణ ప్రభుత్వ పెద్ద కేసీఆర్ పథకాల అమలు విషయంలో యావరేజ్ మార్కులు సాధించారని అనుకోవచ్చు. కీలకమైన పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. కొత్తగా దళిత బంధు పథకం పెట్టారు కానీ దాని వల్ల వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువ. మాకేంటి అని ఇతర వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రైతు రుణమాఫీ ఇప్పటికీ జరగలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక రైతు బంధు అయినా సక్రమంగా వస్తోందా అంటే రైతుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. తెలంగాణ సర్కార్ ప్రజలను పట్టించుకుంటున్నాం అని చెప్పేలా కంటి వెలుగు వంటి పథకాల్ని అమలు చేసింది. అయితే మొదటి విడతలో అమలు చేసిననట్లుగా రెండో విడతల పథకాల అమలు జరగలేదని కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇది కేసీఆర్‌కు ఇబ్బందికరమే.
తెలంగాణలో అభివృద్ధి విషయంలో .. కెప్టెన్ కేసీఆర్‌కు అనితర సాధ్యమైన అభివృద్ది చేసి చూపించారు. కొత్త సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉం డేలా అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. హైదరాబాద్‌లో 41 ఫ్లైఓవర్లు కట్టారు. దేశంలోనే తొలిసారి పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నత అధికారులంతా ఒకే చోట నుండి రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ మ్యానిటరింగ్ కమాండ్ కంట్రోల్ చేసేందుకు వీలుగా అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఒక్క సంవత్సరంలో ఒకే రోజు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ 2 ఈ ఏడాదే ప్రారంభమయింది. వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీ హబ్ 2ను ప్రభుత్వం రూ.400 కోట్ల పెట్టుబడితో 3ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. అలాగే టీ వర్క్స్‌ను కూడా నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మల్లన్న సాగర్ ను రంభించారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ను శరవేగంగా నిర్మాణం అవుతోంది. 12 వందల 80 కోట్ల నిధులతో యాదాద్రిని పునర్ నిర్మించింది ప్రభుత్వం. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే ఐటీ హబ్ మైండ్ స్పేస్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మాణాలు చేస్తోంది.
కేసీఆర్ చాలా కాలం పాటు అసలు బయట కనిపించరు. అయితే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ అన్నట్లుగా ఉంటారు. కానీ అవసరమైన సందర్భాల్లో మాత్రం ఫీల్డ్ లోకి వస్తారు. అసలు సెక్రటేరియట్ కు వెళ్లరు ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ నిర్మించారు అయితే వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడ్డారు కాబట్టి కొత్త సెక్రటేరియట్‌కు అయినా వస్తారా లేదా అన్నది చెప్పడం కష్టమే. ఎన్నికల సీజన్ కాబట్టి ఆయన రోజూ రావొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్ రాజకీయ నిర్ణయాలు ఈ నాలుగున్నర కాలంలో యూటర్నులుగా మిగిలాయి. మొదట రైతు చట్టాలను సమర్థించారు. తర్వాత వ్యతిరేకించారు. బీజేపీతో కొంత కాలం జాగ్రత్తగా ఉండాలనుకున్నారు తర్వాత యుద్ధం ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. పార్టీ పేరును బీఆర్ఎస్ గా ప్రకటించారు. కానీ ప్రగతి భవన్ దాటని రాజకీయాలు చేస్తున్నారు. కర్ణాటకలో అసలు పోటీ చేయడం లేదు ప్రచారం కూడా లేదు. మహారాష్ట్రలో దున్నేస్తామని అంచున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యేను చేర్చుకుని ఆయనకు పట్టు ఉన్న మార్కెట్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఒక్క డైరక్టర్ కూడా గెలవలేదు. మొత్తంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ పని తీరును విభిన్నరకాలుగా విశ్లేషించాల్సి ఉంటుంది. అభివృద్ధి విషయంలో వంకలు పెట్టడానికి లేకపోయినా సంక్షేమం పాలన రాజకీయం విషయంలో మాత్రం ఆయన యావరేజ్ పనితీరు కనబరిచారని అనుకోవచ్చు. అయితే ప్రజలు ఏ పారామీటర్‌ను చూసుకుని ఓట్లు వేస్తారన్నదే కీలకం. ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన ఫలితం.