మునుగోడు పాయె… హస్తవ్యస్తం

By KTV Telugu On 7 November, 2022
image

కాంగ్రెస్ ను వెంటాడుతోన్న వరుస ఓటములు
కారు, కమలం కొట్లాటలో కాంగ్రెస్ ఖల్లాస్..
మునుగోడులోనూ ముడో స్థానానికే పరిమితం

కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కాంగ్రెస్ తరచూ కొట్టుకుపోతోంది. మునుగోడులో ఓటమి కాంగ్రెస్ పార్టీని మరింత నిరాశలోకి నెట్టింది. గెలవకపోయినా కనీసం గట్టిపోటీ ఇచ్చినా కాంగ్రెస్ శ్రేణులు సంతృప్తి పడేవి. కానీ డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో మూడో స్థానానికి పడిపోవడం హస్తం కేడర్ ను ఆందోళనకు గురిచేస్తోంది. రాహుల్ తెలంగాణలోనే తిరుగుతున్నా ఆడబిడ్డను ఆశీర్వదించాలని కోరినా ఓటర్లు పట్టించుకోలేదు. బీజేపీ మాదిరి పోరాడి ఓడితే వచ్చే ఎన్నికల్లో సానుభూతి అయినా దక్కేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. రాబోయే రోజులన్నీ కాంగ్రెస్ కు మరింత కష్టకాలమనే చెప్పాలి. టీఆర్ఎస్, బీజేపీలు రెండు కాంగ్రెస్ పై ఫోకస్ పెడితే వలసలను ఆపడం ఆ పార్టీ తరం కాకుండా పోతుంది. అంతేకాదు ఎన్నికల్లో కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా కరువైనా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.

పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురిగా నియోజకవర్గంలో ఆమెకు ఉన్న పలుకుబడి స్రవంతికి కలిసొస్తుందని కాంగ్రెస్ భావించింది. నియోజకవర్గంలో గతంలో ఒకసారి ఆమె ఓడిపోవడంతో ఈ సారైనా సెంటిమెంట్ కలిసొస్తుందేమోననే ఆశలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. కాంగ్రెస్ నేతలు వెళ్లి లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కినా కాంగ్రెస్‌ను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టినా, వేలాది మందితో మహిళా గర్జన సభ నిర్వహించినా ఫలితం లేకపోయింది. రాహుల్ జోడో పాదయాత్ర ప్రభావం కూడా మునుగోడు ఉపఎన్నికపై పనిచేయలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డిపాజిట్ కూడా దక్కకపోవడాన్ని కాంగ్రెస్ వర్గాలు ఘోర అవమానంగా భావిస్తున్నాయి. గెలుపోటములు సహజమని చెప్పడం మినహా ఏమీ చేయలని నిస్సహాయస్థితిలో  హస్తం నేతలున్నారు.

తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పుకోవడం తప్ప ఓట్లు మాత్రం రాబట్టలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఆ పార్టీకి ఓటమి శాపం తగులుతూనే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి కట్టినా 21 స్థానాలు దక్కాయి. మొత్తం 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే, ఆరుగురు మినహా అంతా కారెక్కేశారు. అప్పటినుంచి కాంగ్రెస్ పతనం మొదలైంది. ఎమ్మెల్యేలను ఆపుకోలేకపోయారు అనే అపవాదు నుంచి బయటపడే లోపే ఉపఎన్నికలు మరో గండంగా మారాయి. 2018 తర్వాత జరిగిన ఐదు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మునుగోడు తమ సిట్టింగ్ స్థానంగా భావించిన కాంగ్రెస్ దాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థుల కన్నా సొంత పార్టీ నేతల తీరుతోనే ఓడిపోతోంది. మునుగోడులో అది స్పష్టంగా కనిపించింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, బీజేపీలను ఢీకొని నిలబడడం కాంగ్రెస్ కు కత్తిమీద సామేనంటున్నారు విశ్లేషకులు.