సీనియర్లను అధిష్టానం సైలెంట్ చేసేసిందా

By KTV Telugu On 4 January, 2023
image

ఉవ్వేత్తున్న ఎగిసిపడిన కాంగ్రెస్ సీనియర్లు చప్పున సైలెంట్ అయిపోయారు. రేవంత్ రెడ్డి ఉంటే తాము కొనసాగడం కష్టమని తేల్చి చెప్పిన వారే ఇప్పుడు సర్దుకుపోతున్నారు. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా మౌనం వహిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం తాయిత్తు మహిమ అని చెబుతున్నారు. జీ-9 నేతలకు తాయిత్తు కట్టినదీ అధిష్టానం ప్రతినిధి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డిగ్గీ రాజా వేసిన మంత్రమేంటో బాగానే పనిచేసిందని టీ.కాంగ్రెస్ గాడిలో పడే అవకాశాలు పెరిగాయిని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు చెప్పుకుంటున్నారు.

టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల అసమ్మతి పెరిగిపోయి తాడో పేడో తేల్చుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతున్న తరుణంలోనే దిగ్విజయ్ సింగ్ రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర పార్టీలో కమిటీల చిచ్చు రేగి సీనియర్లు అలిగిన వేళ డిగ్గీ మైండ్ గేమ్ ఆడారు. ఆయన గాంధీ భవన్లో ఉండగానే బయట నేతలు గల్లాలు పట్టుకున్న సంఘటనలు జరిగినా సైలెంట్ గా నరుక్కుపోయారు. కాంగ్రెస్ పార్టీలో కమిటీల చిచ్చు ఆర్పడానికి డిగ్గీ చేసిన ట్రబుల్ షూటింగ్ ఇప్పుడు బాగానే పనిచేసింది. అంతలోనే రేవంత్ వర్గానికి చెందిన కొందరు రాజీనామా చేస్తూ ఆయనకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. నేతలందరినీ లెక్కపెట్టి విడివిడిగా దిగ్విజయ్ మాట్లాడటం కూడా బాగానే పనిచేసింది.

సీనియర్లతో డిగ్గీ రాజా పలు అంశాలు చర్చించారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. పార్టీలో అందరూ సమానమేనని చెప్పారు. సీనియర్ల కంటే రేవంత్ ఎక్కువేమీ కాదని తేల్చారు. అదే మాట తర్వాత ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించారు. పార్టీలో ఎవరూ సీనియర్లు కాదు ఎవరూ జూనియర్లు కాదని పరిస్థితులను బట్టి ఎవరి పాత్ర వారు పోషించాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడినప్పుడు సీనియర్ల తప్పొప్పులను ఆయన విశ్లేషించినట్లు చెబుతున్నారు. వారి చర్యల వల్ల పార్టీకి ఎంతనష్టం కలిగిందో వివరించారట. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్టను దిగజార్చడం వల్లే ఉప ఎన్నికల్లో దెబ్బతింటున్నామని దిగ్విజయ్ గుర్తుచేశారంటున్నారు. గెలవడం మాట ఎలా ఉన్నా కనీసం గెలుపుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోవడానికి కారణమేమిటో దానిలో ఆయా నేతల పాత్ర ఏమిటో అర్థం చేసుకోవాలని బంతిని సీనియర్ల కోర్టులోనే ఆయన వేసేశారు.

పార్టీలో ఎప్పుడు జరిగే తంతునే సీనియర్లకు దిగ్విజయ్ గుర్తుచేశారని అంటున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. అన్యాయం జరుగుతోందని భావించిన పక్షంలో అధిష్టానం దృష్టికి తీసుకురావచ్చని అందుకు తాజా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ఢిల్లీ నేతలంతా అందుబాటులో ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ప్రతీ విషయానికి మీడియా కెమెరాల ముందుకు వెళితే వాళ్లే పలుచనైపోతారని దిగ్విజయ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేయాలని అప్పుడే గెలుస్తామని పార్టీ నాయకులను మీడియా ముందు కాదు ప్రజల పక్షాన రోడ్డెక్కి పోరాడమని హితబోధ చేశారు.

ఒక పక్క దిగ్విజయ్ చర్చలు జరపగా మరో పక్క అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు నేతలు సీనియర్లకు టచ్ లోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కూడా ఒక్కరిద్దరు నేతలతో ఫోన్లో మాట్లాడి పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే తెలంగాణలోనూ జాతీయ స్థాయిలోనూ వరుసగా రెండు సార్లు ఓడిపోయామని మరోసారి ఓటమి పాలైతే అందరికీ ఇబ్బందేనని వివరించారు. సంఘీభావమే బలమన్నది మరిచిపోకూడదని అగ్రనేతలు హితబోధ చేశారు. ఫైనల్ గా మరో మాట కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు బీజేపీ వైపు చూస్తున్న సంగతి ఆయా నేతల వద్దే ప్రస్తావించారు. బీజేపీలో చేరడం వల్ల కలిగే నష్టాన్ని వారికి వివరించారు. దేశంలో అధికార పార్టీగా ఇప్పటికే బీజేపీలో గుంపులు పెరిగిపోయాయని కాంగ్రెస్ సీనియర్లు అక్కడకు వెళ్లినా ప్రాధాన్యం దక్కదని ప్రస్తావించారు. చేర్చుకుని వదిలేస్తారని అప్పుడు రెంటికి చెడ్డ రేవడవుతారని సున్నితంగా హెచ్చరించారు. దానితో సీనియర్లు పునరాలోచనలో పడి దారికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే రేవంత్ పాదయాత్రపై ఇంకా క్లారిటీ రాలేదు. పాదయాత్ర జరిగితే ఎవరెవరు అందులో భాగస్వాములవుతారో చూడాలి.