ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా పరిస్తితి తయారవుతుందేమోననిపిస్తోంది. రేవంత్ గ్రూపు, టీ. కాంగ్రెస్ సీనియర్లు కొట్టుకోవడం ఇప్పుడు ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పదవికి ఎసరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీకి, పీసీసీకి వారధిగా ఉండాల్సిన మాణిక్కం ఠాగూర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సీనియర్ల వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లడం వల్లే హుటాహుటిన దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించారని చెబుతున్నారు. ఠాగూర్ మొదటి నుంచి రేవంత్ పక్షం వహిస్తూ సీనియర్లను అవమానపరుస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి..
ఉమ్మడి రాష్ట్రంలో ఇంఛార్జ్ లుగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్ ఎంతో సమర్థంగా టీ. కాంగ్రెస్ కార్యకలాపాలను చక్కబెట్టారు. చిన్న సమస్యలు పెద్దవి కాకుండా ఆదిలోనే వాటిని తుంచేశారు. అందుకే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిందని చెబుతున్నారు. ఓడిపోయినప్పటకీ పార్టీ శక్తిమంతంగా ఉందని విశ్లేషిస్తున్నారు.
2018 తర్వాత ఇంఛార్జ్ మారారు. తమిళనాడులోని విరుదునగర్ లోక్ సభా స్థానానికి ప్రాతినిధ్యం వహించే మాణిక్కం ఠాగూర్ ను అధిష్టానం తెలంగాణ ఇంఛార్జ్ గా నియమించింది. అప్పటి నుంచి పార్టీ పతనం ప్రారంభమైందని సీనియర్లు వాదిస్తున్నారు. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం మొదటి నుంచి వచ్చిన తమకు లభించడం లేదని అది ఠాగూర్ ఏకపక్ష వైఖరికి నిదర్శనమని సీనియర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఇంఛార్జ్ అయిన తర్వాతే దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయారని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. పైగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లాలని భావించినప్పుడు కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదని అంటున్నారు. దానితో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఆపలేకపోయారు.
మాణిక్కం ఠాగూర్ టీ.పీసీసీ ఇంఛార్జ్ పదవిని చేపట్టి రెండు సంవత్సరాలు దాటింది. అయినా గ్రుపు తగాదాలను పరిష్కరించడంలో మాత్రం విఫలమయ్యారు. రేవంత్ ను పీసీసీ చీఫ్ చేసిన తర్వాత రేగిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చడంలో సక్సెస్ కాలేకపోయారు. అధికార బీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తిపరులున్నా వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడంలో ఆసక్తి చూపలేదు. 2023 ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కల్పించలేకపోయారు. దానితో మాణిక్కం ఠాగూర్ ఉండి ప్రయోజనం ఏమున్నదన్న ప్రశ్న తలెత్తుతోంది.
తాజాగా సీనియర్లు తిరుగుబాటు చేయడంతో ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగారు. ఆమె సూచన మేరకే మల్లికార్జున్ ఖర్గే రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కబెట్టే బాధ్యతను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించారని చెబుతున్నారు. ఆయన వెంటనే సీనియర్లను సంప్రదించి మీటింగ్ పెట్టకుండా ఆపారు. సంక్షోభ నివారణ దిశగా అది తొలి పాజిటివ్ పరిణామంగా భావించారు. త్వరలో దిగ్విజయ్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఠాగూర్ సైడైపోవాల్సిన పరిస్థితి రావచ్చు. తెలంగాణపై ఫోకస్ పెట్టాలనుకున్న ప్రియాంక ఏం చెబుతారో చూడాలి.