తెలంగాణా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.. ఠాక్రే మంత్ర అద్భుతంగా పనిచేస్తోంది

By KTV Telugu On 30 January, 2023
image

కొద్ది రోజుల క్రితం వరకు ఈసురోమంటూ డీలాగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో ఇపుడు ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లు నిన్నా మొన్నటి దాకా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారు. ఇపుడు వారు కూడా ముందు పార్టీని బలోపేతం చేసుకుందామన్నట్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీ క్యాడర్ ను కదన రంగంలో కదం తొక్కేలా వెన్నుతడుతోందంటున్నారు పాత తరం కాంగీయులు. ప్రత్యేకించి తెలంగాణా పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా మాణిక్ రావు ఠాక్రే వచ్చిన తర్వాత ఆయన ఏదో మాయ చేశాడనే చెప్పాలి. ఆయనకు ముందు ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన మాణిక్యం ఠాగూర్ హయాంలో పార్టీలోని భిన్న ధృవాలు ఒక్కతాటిపైకి వచ్చింది లేదు. రోజు భిన్న వర్గాల మధ్య ఘర్షణలే. ఠాగూనే అందులో ఓ గ్రూపుకు వత్తాసు పలికేవారని రెండో వర్గం గుర్రుగా ఉండేది. ఠాగూర్ వ్యవహార శైలిపై కొందరు సీనియర్లు హైకమాండ్ దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. దాన్ని బట్టి ఓ నివేదిక రూపొందించిన దిగ్విజయ్ సింగ్ టెన్ జన్ పథ్ కు సమర్పించారు. కాపీ టూ మల్లికార్జున ఖర్గే అన్నారు.

ఆతర్వాతనే ఠాగూరును సాగనంపాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలోనే ఠాక్రే వచ్చారు. ఠాక్రే వచ్చింది లగాయితు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తనకు అప్పగించిన మిషన్ ను అమల్లో పెట్టేశారు. ముందుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇతర సీనియర్లకి మధ్య ఉన్న తేడాలను గమనించిన ఠాక్రే ముందుగా అక్కడ రిపేర్ వర్క్ మొదలు పెట్టారు. ఇటు రేవంత్ కు అటు సీనియర్లకు నచ్చ చెప్పి మీరంతా కలసి కట్టుగా ఉండకపోతే మనకి అధికారం రావడం కష్టమే అని తేల్చి చెప్పారు. జాగ్రత్తగా చేసుకుంటే ఈ సారి అధికారం కాంగ్రెస్ దేనని కూడా జోస్యం చెప్పారు. ఎన్నికలు అయ్యే వరకు అయినా అందరూ ఒక్కమాట మీద ఉంటే అందరికీ పదవులు వస్తాయని ఆశ పెట్టారు.
అలా ఠాక్రే ఆఫర్ చేసిన పదవుల తాయిలం వర్కవుట్ అయ్యింది. సీనియర్లంతా కూడా నిజమే కదా మనం కలిసుంటేనే కదా అధికారం వచ్చేది అని రియలైజ్ అయ్యారు. ఖాళీ మెదళ్లు దెయ్యాల కర్మాగారాలుగా మారిపోతాయన్న భయంతోనే ఠాక్రే అందరికీ ఏదో ఒక పని పెట్టారు. ఎవ్వరూ ఖాళీగా ఉండకుండా ఆపరేషన్లు అప్పగిస్తున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రను అందరూ సీరియస్ గా తీసుకునేలా చేశారు. నేతలు కూడా యాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. నేతలంతా ముందుకు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.

నిన్నా మొన్నటి దాకా కాంగ్రెస్ నుండి ఏ నేత ఏ రోజు ఏ పార్టీకి వలసపోతాడా అని ఆందోళన చెందేవారు. ఇపుడు సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ వైపు ఇతర పార్టీల నేతలు చూస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గం కొడంగల్ లో బి.ఆర్.ఎస్. నేత గురునాథ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆ నియోజక వర్గంలో గురునాథ రెడ్డి చాలా కీలక నేత. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోడానికి గురునాథ రెడ్డి కారణం. అటువంటిది ఇపుడానేతే కాంగ్రెస్ లోకి రావడంతో వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీలో సీనియర్లు గొడవలు పడకుండా కలసి కట్టుగా ముందుకు కదలడంతో సొంత పార్టీ కార్యకర్తల్లో నమ్మకమూ పెరిగింది. బయటి నుండి వచ్చే నేతలకూ ఓ భరోసా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫిబ్రవరి నెలలో హాత్ సే హాత్ జోడో యాత్ర మరింతగా ఊపందుకుంటుంది. అపుడు పార్టీ మరింతగా జనంలోకి చొచ్చుకుపోతుందని నేతలు భావిస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే అవకాశం కచ్చితంగా ఉంటుందంటున్నారు.

ఇంత వరకు చెట్టుకొకరు పుట్టకొకరుగా పార్టీలో సీనియర్లంతా ఎవరి దారి వారిదే అన్నట్లు ఉండడంతో బి.ఆర్.ఎస్. కు మేమే ప్రత్యామ్నాయం అంటూ బిజెపి దూసుకుపోతూ వచ్చింది. ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటి కాంగ్రెస్ కు షాకిచ్చింది. మునుగోడు ఎన్నికల్లోనూ బి.ఆర్.ఎస్. తో హోరా హోరీ పోరు చేసింది బిజెపియే తప్ప కాంగ్రెస్ కాదు. అయితే ఇపుడిక పాత ఎన్నికల ఫలితాల గురించి ఆలోచన చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పట్నుంచీ పార్టీలో అన్ని వర్గాలూ ఒక్కమాట మీద ఉండి చేయి చేయి కలిపితే మాత్రం 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఎవ్వరూ ఆపలేరని వారంటున్నారు. అంతా బానే ఉంది కానీ ఎన్నికల వరకు అంతా ఒక తాటిపైకి వచ్చి రేపు టికెట్లు ఇచ్చే సమయంలో తమ అనుచరులకు టికెట్ రాలేదనో తమకే అన్యాయం జరిగిందనో నేతలు వీధులకెక్కితే మాత్రం అప్పటి వరకు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. ఇపుడు అందరూ కలిసే కదులుతున్నా ఎన్నికల ప్రచారం వచ్చేసరికి గ్రూపులు తెరపైకి వచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు మరి కొందరు. అదే జరిగితే అది పార్టీ పుట్టి ముంచడం ఖాయమని వారంటున్నారు.

ఇప్పటికీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటి సీనియర్లు రేవంత్ రెడ్డిపై గుర్రుగానే ఉన్నారని సమాచారం. అది సమసి పోనంత వరకు మిగతా వారంతా కలిసి ఉన్నట్లు కనిపించినా ఒరిగేదేమీ ఉండదని రాజకీయ పండితులు అంటున్నారు. కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు మాత్రం బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకుంటే మంచిదని హైకమాండ్ దూతలకు చెబుతున్నారు. పార్టీలోని మరో వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బి.ఆర్.ఎస్. తో చేతులు కలిపే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోంది. కేసీయార్ తరపున పనిచేసే కోవర్టుల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోతోందన్నది వారి వాదన. అయితే ఆ కోవర్టులు ఎవరన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఒక పక్క బిజెపి తెలంగాణాలో అధికారం సొంతం చేసుకోడానికి శక్తివంచన లేకుండా పావులు కదుపుతోంది. పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు పదే పదే తెలంగాణాలో పర్యటిస్తూ తమ ఉద్దేశాన్ని చాటి చెప్పారు. అటు పార్టీ అధ్యక్షుడు నడ్డా కూడా తెలంగాణాలో ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణాలో కూడా బిజెపిని అధికారంలోకి తెస్తే తెలంగాణా ప్రాంతం డబుల్ ఇంజన్ తో లబ్ధిపొందుతుందని కమలనాథులు అంటున్నారు. ఇక బి.ఆర్.ఎస్. అయితే తాము చేసిన అభివృద్ధే తమకి హ్యాట్రిక్ విజయం అందిస్తుందని ధీమాగా ఉంది. తెలంగాణాలో వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ, జనసేన, టిడిపిలు విడి విడిగా పోటీ చేయడం కూడా బి.ఆర్.ఎస్.కే మేలు చేస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ పార్టీలన్నీ కూడా కొద్ది మొత్తంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ఖాయమని అది కాంగ్రెస్ కు నష్టమని వారంటున్నారు. ఉభయకమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని బి.ఆర్.ఎస్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బిజెపితో సహా ఇతర పార్టీలు గండికొడతాయని అది బి.ఆర్.ఎస్. కు అద్భుత విజయాలు తెచ్చిపెడుతుందని బి.ఆర్.ఎస్. నాయకత్వం లెక్కలు వేసుకుంటోంది.