తెలంగాణ కాంగ్రెస్ లో మాణిక్ రావు ఠాక్రే మంత్రం వర్కవుట్ అవుతోందా? కొద్ది రోజులుగా నేతల వ్యవహార శైలి చూస్తోంటే కాంగ్రెస్ గ్యారేజీలో ఏదో ఒక రిపేర్ జరిగినట్లే కనిపిస్తోందంటున్నారు పాతతరం నేతలు. అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఏడాది పాటు అందరూ కష్టపడాల్సిందేనని మాణిక్ రావ్ ఠాక్రే నేతలకు నూరిపోసిట్లు సమాచారం.
భారత దేశంలో ఏ రాజకీయ పార్టీలోనూ లేనంతగా అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో వెల్లి విరుస్తూ ఉంటుంది.
నిజానికి ఈ ప్రజాస్వామ్యమే కాంగ్రెస్ పార్టీకి సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుందంటారు రాజకీయ పండితులు.
కాంగ్రెస్ లో ఎంత చిన్న నేత అయినా ఎంత పెద్దనేతనైనా ఏమైనా అనేయచ్చు. క్రమశిక్షణలు ఉల్లంఘనలు చర్యలు వంటివి నామ్ కే వాస్తేగానే ఉంటాయి. అందుకే ఎవరూ క్రమశిక్షణా సంఘానికి బెదర్రు. అదర్రు.
బి.ఆర్.ఎస్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీని జనంలోకి తీసుకుపోవలసిన తరుణంలో కాంగ్రెస్ నేతలు తమలో తామే కలహించుకుంటూ పార్టీని సమస్యల్లోకి లాగేస్తున్నారన్నదే ఫిర్యాదు. దీన్ని సెట్ రైట్ చేయడానికే మాణిక్కం ఠాగూర్ ను బదలీ చేసి ఠాకే సాబ్ ను తీసుకువచ్చారు టెన్ జన్ పథ్ వ్యూహకర్తలు. ఠాక్రే రావడం రావడం అంతర్గత కుమ్ములాటలకు అడ్డుకట్ట వేశారు. పార్టీలోని కీలక నేతలందరితోనూ విడి విడిగానూ కలిసి కట్టుగానూ భేటీ అవుతోన్న ఠాక్రే ఎన్నికల ఏడాదిలో అందరం ఒక్కమాటమీద ఉండాలి సుమా అని క్లాస్ పీకుతున్నారట. అది వర్కవుట్ అవుతోంది కూడా అంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కార్యకర్తలను కదం తొక్కించేలా నేతలంతా చేతులు కలిపి ముందుకు ఉరకాలని ఠాక్రే దిశా నిర్దేశనం చేసినట్లు సమాచారం. ఠాక్రే డ్యూటీలో చేరి పదిహేను రోజులు కూడా కాకముందే హాత్ సే జోడో అభియాన్ పేరిట కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో అన్ని రాష్ట్రాల్లోనూ ఏం సందేశం ఇస్తున్నారో దాన్ని తెలంగాణాలో గడప గడపకీ చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానాన్ని మెప్పించాలంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందేనని టి- కాంగ్రెస్ బూత్ స్థాయి నేతలకు కొత్త ఇన్ ఛార్జ్ సూచిస్తున్నారు. హత్ సే హత్ జోడో తో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర సమాంతరంగా కొనసాగుతుందా ఈ కార్యక్రమం తర్వాత రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దాన్ని కొనసాగిస్తారా అన్నది చూడాలి. సంక్రాంతి పండగ కోసం కాస్త ఆటవిడుపు నిచ్చిన ఠాక్రే ఈ నెల 20,21,22 తేదీల్లో హైదరాబాద్ రానున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలతో పాటు హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
హత్ సే హత్ జోడో యాత్ర లో కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజల్లో ఉండాలని రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి కుటుంబానికి వివరించాలని భావిస్తున్నారు. అయితే హత్ సే హత్ యాత్ర ఎవరి నియోజక వర్గంలో వారే చేస్తారు. అదే సమయంలో అధిష్టానం అనుమతిస్తే రేవంత్ పాదయాత్ర భద్రాచలం నుంచి మొదలు పెట్టి రాష్ట్రం అంతటా చేయాలని భావిస్తున్నారు. లేదంటే హత్ సే హత్ జోడో యాత్ర రెండు నెలల కాలంలో రోజుకు రెండు నియోజక వర్గాలలో సాగే యాత్రలో ఆ ఆ నియోజకవర్గ నేతలతో కాళ్లు కలపాలని భావిస్తున్నట్లు సన్నిహితులు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే 60 రోజుల్లో 119 నియోజకవర్గాల క్యాడర్ లో జోష్ నింపడంతో పాటు అన్ని నియోజక వర్గాల్లో తిరిగినట్లు అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఠాక్రే సాబ్ రాకతో టి.కాంగ్రెస్ లో కొత్త ఊపు కొత్త జోష్ వచ్చాయంటున్నారు.