తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ముచ్చటగా మూడో సారి గెలిచేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ కూడా ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎప్పటిలాగే ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలనే తపన ఆ పార్టీ నేతల్లో ఏకోశానా ఉన్నట్లు కనిపించడం లేదు. నాయకుల్లో ఐక్యత కొరవడింది. పీసీపీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని అధిష్టానం నియమించడం కొందరు సీనియర్ నాయకులకు నచ్చలేదు. దాంతో కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచించకుండా రేవంత్‌రెడ్డిని ఎలా అడ్డుకోవాలి అనే పనిమీదే తమ శక్తియుక్తులు కేటాయిస్తున్నారు.
ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అధిష్టానం ఆమోదంతో హాత్ సే హాత్ జోడో కు కొనసాగింపుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. అది ఆ పార్టీలోని కొందరు నాయకులకు ఇష్టం లేదు. ఈ పాదయాత్రతో రేవంత్‌రెడ్డి బాగా హైలెట్ అవుతాడేమోనని వారి భయం. దాంతో రేవంత్‌రెడ్డికి పోటీగా కొందరు నాయకులు కూడా పాదయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పోరు యాత్ర పేరుతో శుక్రవారం నుంచి యాత్ర ప్రారంభించారు. బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్ వరకు ఈ యాత్ర జరుగుతుంది. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ యాత్రలో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను మేడారంలో ప్రారంభించిన రోజున వీరిలో ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదని కాంగ్రెస్ కార్యకర్తలే గుర్తుచేస్తున్నారు.
భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరుతో ఇప్పటికే పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు మరి కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి కూడా తెలంగాణలోని యూనివర్సిటీలలో విద్యార్థులను కూడగట్టాలనే ఆలోచనతో యాత్రకు సిద్ధమయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో బైక్ యాత్ర చేస్తానని ఇదివరకే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనే ఆశయంతో కాకుండా కేవలం రేవంత్‌రెడ్డికి పోటీగా యాత్రలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.